Share News

నిరుపయోగంగా మార్కెట్‌యార్డు

ABN , Publish Date - May 26 , 2024 | 11:56 PM

రెండు మండలాల రైతుల ప్రయోజనార్థం నిర్మించిన వ్యవసాయ మార్కెట్టు యార్డు వినియోగంలోకి రాకముందే శిధిలావస్థకు చేరుకొంది.

నిరుపయోగంగా మార్కెట్‌యార్డు

పెద్ద దోర్నాల, మే 26: రెండు మండలాల రైతుల ప్రయోజనార్థం నిర్మించిన వ్యవసాయ మార్కెట్టు యార్డు వినియోగంలోకి రాకముందే శిధిలావస్థకు చేరుకొంది. దీంతో లక్షల రూపాయాల ప్రజాదనం బూడిదలో పోసిన పన్నీరే అయ్యింది.

స్థానిక విద్యుత్తు సబ్‌ స్టేషను వద్ద సుమారు ఏడు ఎకరాల విస్తీర్ణంలో రెండున్నర దశాబ్దాల క్రితం వ్యవసాయ మార్కెట్‌ యార్డును ఏర్పాటు చేశారు. అప్ప ట్లోనే కోటి రూపాయలకు పైగా వెచ్చించి పంట విక్రయించేందుకు షేడ్‌, అధికారులకు క్వార్టరు, పంట నిల్వ చేసేందుకు శీతల గిడ్డుంగుల కోసం రెండు భవనా లు నిర్మించారు. పెద్దారవీడు, దోర్నాల మండలాలకు చెందిన రైతులు పండించిన పంటలు స్థానికంగానే మార్కెట్‌కు తరలించి విక్రయించుకోవచ్చు. గిట్టుబాటు ధర లభించక పోతే శీతల గిడ్డంగులలో నిల్వ చేసుకునే సదుపాయంతో వ్యవసాయ మార్కెట్‌ నిర్మాణం చేశారు. అయితే సంబంధిత అధికారులు, పాలకులు నిర్లక్ష్య ధోరణితో ఇప్పటి వరకు ఎటువంటి లావాదేవీలు నిర్వహించలేదు. ఏళ్లు గడుస్తున్నా, నేటికీ పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఆవరణంతా చిల్లకంపతో అల్లుకుపోయి అస్తవ్యస్తంగా తయారయ్యాయి. సెలవుల రోజుల్లో విద్యార్థు క్రీడలు నిర్వహిస్తుంటారు. అప్పుడప్పుడు స్వచ్చంద సంస్థలు కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.

మోసపోతున్న రైతులు

అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నచందంగా కోట్ల రూపాయల విలువైన మార్కెట్‌యార్డు అందుబాటులో ఉన్నా, రైతులకు అక్కరకు రావడం లేదు. వ్యాపార లావాదేవీలు నిర్వహించేందుకు కావలసిన భవనాలు, సదుపాయాలున్నాయి. ప్రభుత్వం, సంబంధిత అధి కారులు, పాలకులు అలసత్వం వీడితే ప్రయోజనం కలుగుతుందని రైతులు చెబుతున్నారు. వ్యవసాయ మార్కెట్‌ యార్డు వినియోగంలో లేకపోవడంతో పండించిన పంటను సుదూర ప్రాంతాలకు వ్యయ ప్రయాసల కోర్చి తరలించి అడిగిన కాడికి అమ్ము కోవాలసిన దుస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రధానంగా ఈ ప్రాంతాల్లో మిర్చి, పత్తి, మినుము, అలసందలు, ఉలవలు, కందులు పండిస్తారు. యార్డు వినియోగంలో లేక పోవడంతో వ్యాపారులు, దళారులు ఎంతకంటే అంతకు తక్కువ చేసి ధరలు అడుగుతున్నారు. ఇళ్లలో నిల్వ చేసుకునే సదుపాయం లేక గుంటూరు, కర్నూలు, ఆదోని వంటి ఇతర ప్రాంతాలకు తరలించాల్సి వస్తోంది. దీంతో రవాణా, ఇతరత్రా ఖర్చులు పెరిగి తడిసి మోపెడవుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం, పాలకులు స్పందించి వినియోగంలోకి తీసుకురావాలని కోరుతున్నారు.

Updated Date - May 26 , 2024 | 11:57 PM