తేల్చని కేంద్రం
ABN , Publish Date - Jul 05 , 2024 | 11:44 PM
హాట్‌హాట్‌గా సాగుతున్న పొగాకు మార్కెట్‌కు బ్రేకులు పడ్డాయి. అయితే పొగాకును కొనే వ్యాపారులు లేరనో, ధరలు సరిగా లేవనో, రైతులు ఆందోళనలు చేయడం వలనో, గోడౌన్లు లేవనో కాదు. అధిక పంట ఉత్పత్తిపై అపరాధ రుసుం విషయాన్ని కేంద్రం ఎటూ తేల్చకపోవడమే అందుకు కారణం. దీంతో మార్కెట్‌లో కొనుగోళ్లకు ఆటంకం ఏర్పడింది. ఇప్పటికే అత్యధిక కేంద్రాల్లో అధికారిక పంట కొనుగోలు పూర్తయ్యింది. అలాంటి చోట్ల కేంద్రం ప్రభుత్వం నుంచి అనుమతులు రాక, అధికోత్పత్తి కొనుగోలు చేసే అవకాశం లేక వేలాన్ని బోర్డు అధికారులు నిలిపేశారు. కొన్నింటిలో చూర కొనుగోలు చేయిస్తున్నా రెండురోజులు పోతే అవి కూడా పూర్తవుతాయి. అలాగే ప్రస్తుతం అనుమతికి లోబడి ఉన్న పంటకు మూడు, నాలుగు కేంద్రాల్లో వేలం జరుగుతున్నా ఈ వారంలో అక్కడా కొనుగోళ్లు పూర్తికానున్నాయి. ఆ తర్వాత అక్కడా వేలం ఆగిపోతుంది.

పొగాకు అధికోత్పత్తి కొనుగోలుపై సందిగ్ధం
అధికారిక పంట కొనుగోలు పూర్తి
ఆయా కేంద్రాల్లో ఆగిన వేలం.. కొన్నిచోట్ల చూర విక్రయాలు
రైతుల వద్ద ఇంకా సుమారు 45 మిలియన్ కిలోల ఉత్పత్తి
జాప్యం జరిగితే నష్టపోతామని ఆందోళన
హాట్‌హాట్‌గా సాగుతున్న పొగాకు మార్కెట్‌కు బ్రేకులు పడ్డాయి. అయితే పొగాకును కొనే వ్యాపారులు లేరనో, ధరలు సరిగా లేవనో, రైతులు ఆందోళనలు చేయడం వలనో, గోడౌన్లు లేవనో కాదు. అధిక పంట ఉత్పత్తిపై అపరాధ రుసుం విషయాన్ని కేంద్రం ఎటూ తేల్చకపోవడమే అందుకు కారణం. దీంతో మార్కెట్‌లో కొనుగోళ్లకు ఆటంకం ఏర్పడింది. ఇప్పటికే అత్యధిక కేంద్రాల్లో అధికారిక పంట కొనుగోలు పూర్తయ్యింది. అలాంటి చోట్ల కేంద్రం ప్రభుత్వం నుంచి అనుమతులు రాక, అధికోత్పత్తి కొనుగోలు చేసే అవకాశం లేక వేలాన్ని బోర్డు అధికారులు నిలిపేశారు. కొన్నింటిలో చూర కొనుగోలు చేయిస్తున్నా రెండురోజులు పోతే అవి కూడా పూర్తవుతాయి. అలాగే ప్రస్తుతం అనుమతికి లోబడి ఉన్న పంటకు మూడు, నాలుగు కేంద్రాల్లో వేలం జరుగుతున్నా ఈ వారంలో అక్కడా కొనుగోళ్లు పూర్తికానున్నాయి. ఆ తర్వాత అక్కడా వేలం ఆగిపోతుంది.
ఒంగోలు, జూలై 5(ఆంధ్రజ్యోతి): ఇతర పంటలకు భిన్నంగా పొగాకు సాగు, విక్రయాలు ఇతరత్రా అన్నింటిపైనా ప్రభుత్వ నియంత్రణ ఉంటుంది. కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ పరిధిలోని భారత పొగాకు బోర్డు పర్యవేక్షణలో ఈ ప్రక్రియ అంతా సాగుతుంటుంది. ఏటా ఎంత విస్తీర్ణంలో సాగు చేయాలి, బ్యారన్‌కు ఎంతమేర ఉత్పత్తి చేయాలన్నది పొగాకు బోర్డు నిర్ణయిస్తుంది. అలాగే రైతులు కూడా బ్యారన్లకు లైసెన్సులు పొంది తదనుగుణంగానే సాగు చేయాలి. పొగాకు బోర్డు అనుమతి లేకుండా సాగు చేసినా, అనుమతి ఇచ్చిన దాని కన్నా పంట అధికంగా ఉత్పత్తి అయినా, దానిని కొనుగోలు చేయాలంటే రైతులపై బోర్డు అపరాధ రుసుం వసూలు చేస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) నిబంధన ప్రకారం దేశంలో పొగాకు ఉత్పత్తి తగ్గింపు చర్యలలో భాగంగా కేంద్రం ఇలాంటి షరతులు అమలు చేస్తోంది. కాగా కొన్నిసందర్భాలలో పొగాకు బోర్డు ఇచ్చిన అనుమతి కన్నా తక్కువగా, మరికొన్ని సీజన్లలో ఎక్కువగా పంట ఉత్పత్తి జరుగుతుంటుంది. వాతావరణంలో మార్పులతో కూడా అలా జరగవచ్చు.
పదిశాతం దాటితే అపరాధం వసూలు
అనుమతించిన పరిమాణం కన్నా పదిశాతం అధికంగా ఉత్పత్తి జరిగితే అందులో పదిశాతం వరకు వాతావరణంలో మార్పుగా భావించి కొనుగోళ్లకు అనుమతిస్తారు. అంతకు మించితే అపరాధ రుసుం వేస్తారు. గతంలో అలా అధికంగా ఉత్పత్తి అయిన పంటకు దాని ధరలో 15శాతం అలాగే కిలోకు రెండు రూపాయల వంతున అపరాధ రుసుం వసూలు చేసేవారు. ఏటేటికి ఆ ఏడు పొగాకు బోర్డు ఇందుకోసం కేంద్ర వాణిజ్యమంత్రిత్వశాఖ నుంచి అనుమతులు తీసుకోవాలి. అయితే అంత శాతం అపరాధ రుసుంతో నష్టపోతామన్న రైతుల ఆవేదనను పరిగణనలోకి తీసుకొని అపరాధ రుసుంను 15 నుంచి 10 శాతానికి కొన్నేళ్ల క్రితం తగ్గించారు. ఇదిలా ఉండగా గత రెండు, మూడు సీజన్‌లుగా కర్ణాటకలో అనుమతించిన దానిలో 60 నుంచి 70శాతం మాత్రమే పంట ఉత్పత్తి జరుగుతుండటంతో పెట్టుబడులు కూడా రావడం లేదని అక్కడ గగ్గోలుపెట్టడంతో వరుసగా రెండు సీజన్లు అక్కడ అపరాధ రుసుంను కేంద్రం రద్దు చేసింది.
కర్ణాటక మాదిరిగానే...
కర్ణాటక తరహాలో తమకు కూడా మినహాయింపు ఇవ్వాలని ఆంధ్ర రైతులు కోరగా గతేడాది ఇక్కడ కూడా అపరాధ రుసుంను రద్దుచేశారు. అయితే ఈ ఏడాది భారీగా రాష్ట్రంలో పంట ఉత్పత్తి పెరిగింది. సాధారణ ఎన్నికల నేపథ్యంలో అపరాధ రుసుంపై కేంద్రం ఇంత వరకు స్పష్టత ఇవ్వలేదు. దక్షిణాదిలోని రెండు రీజియన్లలో 11 వేలం కేంద్రాలు ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు జిల్లాలో ఉండగా ఆ పరిధిలో 2023-24 సీజన్‌కు పొగాకు బోర్డు సుమారు 57వేల హెక్టార్ల విస్తీర్ణంలో పంట సాగుకు, 86.62 మిలియన్ కిలోల పంట ఉత్పత్తికి అనుమతి ఇచ్చింది. అయితే గత రెండేళ్లు మార్కెట్ ఆశాజనకంగా ఉండటం, కర్ణాటకలో ఉత్పత్తి తగ్గడం, ఇక్కడ వాతావరణం అనుకూలత వంటి అంశాలతో దక్షిణాదిలో రైతులు భారీగా పొగాకు సాగు చేశారు. సుమారు 72వేల హెక్టార్లపైగా విస్తీర్ణంలో పంట సాగు కాగా ఇంచుమించు 134 మిలియన్ కిలోలు అధికంగా ఉత్పత్తి జరిగినట్లు అంచనా. ఈ ఏడాది ఫిబ్రవరి 29న కొన్ని, మార్చి 6న మిగిలిన కేంద్రాలలో వేలం ప్రారంభించగా ఇప్పటివరకు సుమారు 89 మిలియన్ల కొనుగోళ్లు జరగ్గా సగటున కిలోకు రూ.254కుపైగా ధర లభించింది. ఆ విషయం అలా ఉంచితే ఇప్పటికే ఒంగోలు-1, 2, కందుకూరు-1, 2 , కలిగిరి, డీసీపల్లి, కనిగిరి కేంద్రాల్లో అధికారిక పంట కొనుగోళ్లు పూర్తయ్యాయి. వెల్లంపల్లిలో రేపటితో ముగియనుండగా మిగిలిన టంగుటూరు, కొండపి పొదిలిలోనూ ఈ వారంలో పూర్తి కానున్నాయి.
ఆలస్యమయ్యే కొద్దీ తూకంతోపాటు నాణ్యత తగ్గుముఖం
దక్షిణాదిలో దాదాపు 48 మిలియన్ కిలోలు అధికంగా పంట ఉత్పత్తికాగా కేంద్రం దాని కొనుగోలు విషయంలో అపరాధ రుసుం రద్దు చేయడమా లేక కొంత వసూలు చేయడమా అన్నది స్పష్టత ఇవ్వలేదు. ఈవిషయంపై తగు సూచనలు కోరుతూ బోర్డు అధికారులు చాలా ముందుగానే కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖకు రాతపూర్వకంగా సంప్రదించారు. బోర్డు పాలక మండలి బాధ్యులు, పలువురు రైతులు కూడా ఇటీవల ఆ శాఖ మంత్రి షియూ్‌షగోయల్‌ను కలిసి వినతిపత్రాలు అందజేశారు. ప్రధానంగా ధరలు కొంత బాగానే ఉన్నా పెట్టుబడి ఖర్చులు భారీగా పెరగడం, కర్ణాటకలో అపరాధ రుసుం రద్దు చేయడంతో అలాగే ఇక్కడ కూడా రుసుం రద్దుచేసి అధిక పంట ఉత్పత్తి కొనుగోలుకు అనుమతి ఇవ్వాలని కోరారు. అయితే కేంద్రం నుంచి ఈ విషయంలో స్పష్టత రాలేదు. దీంతో కొనుగోలు పూర్తయిన ఏడు కేంద్రాల్లో రైతులు వద్ద పంట ఉన్న వేలం నిలిచిపోయింది. దాదాపు 47 మిలియన కిలోల పంట రైతుల ఇళ్లలో ఆగిపోగా కొనుగోళ్లు ఇంకా జాప్యం జరిగితే తూకం తగ్గడంతోపాటు నాణ్యత దెబ్బతిని భారీగా నష్టపోతామని రైతాంగం ఆందోళన చెందుతున్నారు. తక్షణం కేంద్రం అపరాధ రుసుం రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చి అధిక పంట కొనుగోలు జరిగేలా చూడాలని రైతులు కోరుతున్నారు. కొనుగోలు నిలిచిన విషయంపై పొగాకు బోర్డు ఒంగోలు ఆర్‌ఎం లక్ష్మణరావును వివరణ కొరగా అధిక పంట కొనుగోళ్లపై కేంద్ర వాణిజ్యమంత్రిత్వశాఖ నుంచి ఆదేశాలు త్వరలో వస్తాయని రాగానే వేలం తిరిగి ప్రారంభిస్తామన్నారు.