ఉపాధి కూలీల కుటుంబాలకు ‘ఉన్నతి’
ABN , Publish Date - Nov 28 , 2024 | 01:58 AM
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేసే ఉపాధి కూలీల కుటుంబాల అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం ఉన్నతి పథకాన్ని చేపట్టింది. వంద రోజుల పని దినాలు పూర్తి చేసుకున్న కుటుంబాలకు చెందిన యువతీ, యువకులకు నెపుణ్య శిక్షణ ఇప్పించి జీవనోపాధి అవకాశాలు మెరుగుపర్చాలన్నదే దీని ప్రధాన ఉద్దేశం.

జాబ్‌కార్డు కలిగిన వారి పిల్లలకు నైపుణ్య శిక్షణ
ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగావకాశాలు
వంద పని దినాలు పూర్తి ప్రామాణికం
మర్రిపూడి, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి) : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేసే ఉపాధి కూలీల కుటుంబాల అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం ఉన్నతి పథకాన్ని చేపట్టింది. వంద రోజుల పని దినాలు పూర్తి చేసుకున్న కుటుంబాలకు చెందిన యువతీ, యువకులకు నెపుణ్య శిక్షణ ఇప్పించి జీవనోపాధి అవకాశాలు మెరుగుపర్చాలన్నదే దీని ప్రధాన ఉద్దేశం. ఎంపిక చేసిన కేంద్రాల్లో ఆయా రంగాల్లో 90 రోజులు శిక్షణ ఇస్తారు. ఆ సమయంలో రోజుకు రూ.300 చొప్పున పారితోషికం చెల్లిస్తారు. శిక్షణ పొందే యువతీయువకులకు అవసరమైన మెటీరియల్‌తోపాటు ఉచిత వసతి సౌకర్యం కల్పిస్తారు. శిక్షణలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు సర్టిఫికెట్‌లు ఇస్తారు. ఆయా రంగాలకు సంబంధించిన ప్రైవేటు సంస్థల్లో వారికి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తారు.
31 రంగాల్లో 215 కోర్సుల్లో శిక్షణ
ఉన్నతి కార్యక్రమంలో భాగంగా 31 రంగాల్లో 215 కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నారు. 18 నుంచి 45 సంవత్సరాల వయసు కలిగి 10వ తరగతి ఉత్తీర్ణులైనా, ఫెయిల్ అయినా అర్హులు. దీర్ఘకాలం ఎన్‌ఆర్‌ఈజీఎస్ పనులపై ఆధారపడకుండా ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం ఉన్నతి ప్రధాన ఉద్దేశం. మర్రిపూడి మండలంలో 12వేల జాబ్‌కార్డులు కలిగిన 19వేల మంది ఉపాధి కూలీలు ఉన్నారు. గత ఏడాది 100రోజుల పనికాలం పూర్తి చేసుకున్న కుటుంబాలు 120 వరకూ ఉన్నాయి. అందులో 70 కుటుంబాలలో శిక్షణకు అర్హత కలిగిన యువతీయువకులు ఉన్నారు. ఉపాధి హామీ సాంకేతిక సిబ్బంది, క్షేత్రసహాయకులు ప్రత్యేక సర్వే చేసి వీరిని గుర్తించారు. వారంతా శిక్షణకు హాజరయ్యేలా అవగాహన కల్పిస్తున్నారు. జిల్లావ్యాప్తం గా ప్రస్తుతం ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ఒంగోలులో రూట్‌సెట్ ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తారని ఏపీవో రాంబాబు తెలిపారు. ఈ అవకా శాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.