Share News

తరుముకొస్తున్న తాగునీటి ఎద్దడి

ABN , Publish Date - Mar 01 , 2024 | 11:16 PM

వేసవి సమీపిస్తోంది. తాగునీటి ఎద్దడి ముంచుకొస్తోంది. పల్లెల్లో నీటి సమస్య రోజురోజుకు పెరుగుతోం ది.’ భూగర్భజలాలు అడుగంటుతున్నాయి.

తరుముకొస్తున్న తాగునీటి ఎద్దడి

త్రిపురాంతకం, మార్చి 1: ‘వేసవి సమీపిస్తోంది. తాగునీటి ఎద్దడి ముంచుకొస్తోంది. పల్లెల్లో నీటి సమస్య రోజురోజుకు పెరుగుతోం ది.’ భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. అయినా తాగునీటి పథకాలు, చేతి పంపులు మరమ్మతులకు నోచుకోవడం లేదు. దీంతో మంచినీటి సమస్యలతో పల్లె ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. వేసవి సమీపిస్తుండడంతో తాగునీటి సమస్యను తీర్చేందుకు అధికారులు, పాలకులు చొరవ చూపాలని ప్రజలు కోరుతున్నారు. మండలంలోని 24 గ్రామ పంచాయతీల్లో 600 చేతిపంపులు ఉండగా 250 పని చేస్తున్నాయి. మిగిలినవి మరమ్మత్తులకు గురి కావడం, భూగర్భజలాలు అడుగంటడంతో మిగిలిన చేతి పంపులకు నీరు రావటం లేదు. మండ లం మొత్తం మీద 37 వాటర్‌ ట్యాంకులు గ్రామ పంచాయతీల ఆధీనంలో ఉండగా వీటిలో కేవలం 13 మాత్రమే పనిచేస్తున్నాయి. అయినా అధికారులు, పాలకులు వీటిపై దృష్టి సారించలేదు. మండలంలో 50కి పైగా డీప్‌ బోర్లు, మిని ట్యాంకులు ఉండగా సగానికి పైగా పనిచేయడం లేదు. దీనికి తోడు చెరువులు, బావులు, కుంటలు వర్షాలు లేక ఎండిపోవడంతో గ్రామాల్లో తాగునీటి సమస్య జఠిలమవుతోంది. మండలంలో 20 చెరువుల వరకు ఉండగా వర్షాలులేక ఒక్క చెరువులోనూ చుక్క నీరు కూడా లేదు. దీంతో భూగర్భజలాలు అడుగంటాయి. రెండు నెలల క్రితం విడుదల చేసిన సాగర్‌ జలాలలో కొన్ని చెరువులను నీటితో నింపారు. గొల్లపల్లి ఎస్‌ఎస్‌ ట్యాంకుకు ప్రస్తుతం 50 శాతం సాగర్‌ జలాలు ఉన్నాయి. దీని పరిధిలో 34 గ్రామాలలకు నీటిని సరఫరా చేయాల్సి ఉన్నా 22 గ్రామాలకు మాత్రమే సరఫరా చేశారు. మిగిలిన చోట్ల పైపులైన్లు సమస్యతో నీరు గమ్యానికి చేరడంలేదు. ప్రస్తుతం మండలంలోని కేశినేనిపల్లి, గొల్లవాండ్లపల్లి, డీవీఎన్‌ కాలనీల్లో మంచినీటి సమస్య తీవ్రంగా ఉంది. ఆర్‌డబ్ల్యూయస్‌ ఆధ్వర్యంలో రోజుకు 2 ట్యాంకర్లు ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. మరి కొద్ది రోజుల్లో మండలంలోని దువ్వలి, చెర్లోపల్లి, లేళ్లపల్లి గ్రామాలతోపాటు మిగిలిన గ్రామాల్లో మంచినీటి సమస్య తీవ్రమయ్యే అవకాశం కనిపిస్తోంది. అధికారులు, పాలకులు ఇప్పటికైనా స్పందించి మరమ్మత్తులకు గురైన మంచినీటి ట్యాంకులను, చేతిపంపులను వినియోగంలోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు. ఈ సమస్యపై ఏఈఈ ఏ.హనుమాన్‌బాబు మాట్లాడుతూ తాగునీటి సమస్య ఉన్నచోట ట్యాంకర్లతో నీటిని తరలిస్తామన్నారు.

Updated Date - Mar 01 , 2024 | 11:16 PM