Share News

వైసీపీలో అలజడి

ABN , Publish Date - Feb 01 , 2024 | 11:29 PM

అధిష్ఠానం తాజా నిర్ణయాలతో అధికార వైసీపీలో ప్రకంపనాలు ప్రారంభమయ్యాయి. తనను మళ్లీ మోసం చేశారంటూ ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రభుత్వ ప్రత్యేక సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డితో రుసరుసలాడారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి పార్టీలో ప్రత్యేక బాధ్యతలు ఇచ్చిన నేపథ్యంలో జిల్లాలోని యావత్తూ వైసీపీ నేతలు, శ్రేణుల్లో కలకలం ఆ రంభమైంది. ఇదిలా ఉండగా.. పోటీచేస్తే మార్కాపురంలో చేయాలే తప్పా గిద్దలూరు వెళ్లాలన్నా అధిష్ఠానం నిర్ణయాన్ని అంగీకరించకూడదని మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి అతని కుటుంబసభ్యులు నిర్ణయించుకున్నట్లు తెలిసింది.

వైసీపీలో అలజడి

చెవిరెడ్డికి పార్టీ బాధ్యతలపై ఆశ్చర్యం

ఆగమేఘాలపై ఒంగోలులో స్థలాల వ్యవహారం కదలిక

రైతుల ఖాతాల్లో సాయంత్రం నిధుల విడుదల

మార్కాపురం వదిలేది లేదు: ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

అధిష్ఠానం తాజా నిర్ణయాలతో అధికార వైసీపీలో ప్రకంపనాలు ప్రారంభమయ్యాయి. తనను మళ్లీ మోసం చేశారంటూ ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రభుత్వ ప్రత్యేక సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డితో రుసరుసలాడారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి పార్టీలో ప్రత్యేక బాధ్యతలు ఇచ్చిన నేపథ్యంలో జిల్లాలోని యావత్తూ వైసీపీ నేతలు, శ్రేణుల్లో కలకలం ఆ రంభమైంది. ఇదిలా ఉండగా.. పోటీచేస్తే మార్కాపురంలో చేయాలే తప్పా గిద్దలూరు వెళ్లాలన్నా అధిష్ఠానం నిర్ణయాన్ని అంగీకరించకూడదని మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి అతని కుటుంబసభ్యులు నిర్ణయించుకున్నట్లు తెలిసింది.

ఆకస్మికంగా పార్టీ బాధ్యతలు

ఒంగోలు లోక్‌సభతోపాటు ఎస్‌ఎన్‌పాడు, కందుకూరు, కావలి అసెంబ్లీ స్థానాల పార్టీ బాధ్యతలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి అప్పగించటం వైసీపీలో అలజడిని రేకెత్తించింది. ఈ విషయమై ఎమ్మెల్యే బాలినేని తీవ్ర అసంతృప్తికి గురికావటమే కాక ఆ విషయాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. అధిష్ఠానం ఆకస్మికంగా భాస్కర్‌రెడ్డికి పార్టీ బాధ్యతలను అప్పగించడంపై కొందరు నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ ప్రాంతాల్లో గెలాక్సీ గ్రానైట్‌, రామాయపట్నం ఓడరేవుల ఆదాయ వనరులను దృష్టిలో పెట్టుకొని బాధ్యతలను అప్పగించినట్లుగా భావిస్తున్నారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన బాలినేని వెంటనే సజ్జలకు ఫోన్‌ చేసినట్లు తెలిసింది. ఈ నిర్ణయంతో తనను మరోసారి మోసం చేశారని అంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.

ఆగమేఘాలపై రైతులకు డబ్బులు

రాత్రికి రాత్రి హైదరాబాద్‌ వెళ్లిన బాలినేని తన రాజకీయ భవితవ్యంపై మంతనాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. రానున్న రెండు మూడు రోజుల్లో ఈ అంశాలపై తుది నిర్ణయంకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇదే సమయంలో ఒంగోలులో అఽధికారులు భూసేకరణకు సంబంధించిన రైతులకు ఇవ్వాల్సిన డబ్బులను హడావుడిగా వారి అకౌంట్లలో వేయటం విశేషం. గత మూడు నాలుగు రోజులుగా అధికారులు సాగతీశారు. గురువారం 216మంది రైతుల బ్యాంక్‌ అకౌంట్లకు రూ.126.34 కోట్లను జమచేశారు. అంతేకాక రైతుల అకౌంట్లలో డబ్బులు వేసి పట్టాల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేసినట్లు సాక్షాత్తు ఆర్డీవోనే ప్రకటన విడుదల చేశారు. తద్వారా బాలినేనిని సంతృప్తిపర్చే ఎత్తుగడలో భాగంగానే హడావుడిగా రైతులకు డబ్బులు ఇచ్చినట్లుగా భావిస్తున్నారు.

మార్కాపురం వదలకూడదు

పార్టీ అధిష్ఠానం గిద్దలూరు నుంచి పోటీచేయాలని చేసిన సూచనను అంగీకరించకూడదని మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి నిర్ణయించుకున్నట్లుగా తెలిసింది. మార్కాపురంతో ఉన్న అనుబంధంతో పార్టీ టికెట్‌ ఇస్తే ఇక్కడే పోటీ చేయాలని లేకపోయినా పోటీకి దూరంగా ఉండాలే కాని గిద్దలూరు వెళ్లాలనే ప్రతిపాదనను అంగీకరించకూడదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. తన తండ్రి పరంగా, తన మామ పరంగా నియోజకవర్గంలో ఉన్న అనుబంధంను దృష్టిలో ఉంచుకొని కుటుంబసభ్యులు, అనుచరులతో తర్జనభర్జనల అనంతరం ఆ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అయితే ఆ విషయాన్ని అధిష్ఠానంకు సున్నితంగానే తెలిపాలని భావించి సమాచారం పంపినట్లు చెబుతున్నారు.

Updated Date - Feb 01 , 2024 | 11:29 PM