Share News

నేడు ఎన్టీఆర్‌ జయంతి

ABN , Publish Date - May 28 , 2024 | 01:10 AM

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావు జయంతిని మంగళవారం తెలుగు తమ్ముళ్లు ఘనంగా నిర్వహించనున్నారు.

నేడు ఎన్టీఆర్‌ జయంతి

ఎన్నికల కోడ్‌తో విగ్రహాల వద్ద కార్యక్రమాలకు అడ్డంకి

కార్యాలయాల్లోనే నిర్వహణకు తమ్ముళ్ల ఏర్పాట్లు

ఒంగోలు, మే 27 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావు జయంతిని మంగళవారం తెలుగు తమ్ముళ్లు ఘనంగా నిర్వహించనున్నారు. సాధారణంగా ఏటా ఈ సమయంలో టీడీపీ మహానాడు పెద్దఎత్తున జరుగుతుంది. ముఖ్యనేతలంతా మహా నాడులో పాల్గొంటే గ్రామ, మండల స్థాయి నాయ కులు, ఎన్టీఆర్‌ అభిమానులు స్థానికంగా ఎక్కడికక్కడ కార్యక్రమాలను నిర్వహిస్తారు. అయితే ఈ ఏడాది సాధారణ ఎన్నికల నేపథ్యంలో కోడ్‌ అమలులో ఉంది. దీంతో పార్టీ అధిష్ఠానం మహానాడును వాయిదా వేసి జిల్లాస్థాయి నుంచి గ్రామస్థాయి వరకూ ఎక్కడికక్కడ కార్యక్రమాల నిర్వహణకు పిలుపునిచ్చింది. అయితే అలా కూడా సాఫీగా నిర్వహించేందుకు కోడ్‌ అడ్డం కిగా మారింది. ఎన్నికల కోడ్‌ అమలు నేపథ్యంలో అన్నిరకాల రాజకీయ నాయకుల విగ్రహాలకు యంత్రాంగం ముసుగులు వేయడంతోపాటు ఆయా ప్రాంతాల్లో సభలు, సమావేశాల నిర్వహణను రద్దు చేశారు. పోలింగ్‌ ముగిసినా ఇంకా లెక్కింపు పూర్తికాక కోడ్‌ అమలులోనే ఉంది. దీంతో ఎన్టీఆర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించడం, అక్కడ సభలు, సమావేశాలు ఇతర కార్యక్రమాల నిర్వహణకు అడ్డంకిగా మారింది. ఈ నేపథ్యంలో మండల, జిల్లా పార్టీ కార్యాలయాలలో ఎన్టీఆర్‌ జయంతి కార్యక్రమాలను నిర్వహించాలని టీడీపీ అధిష్ఠానం సూచించింది. ఆ ప్రకారం కార్యాలయాలు ఉన్న చోట వాటిల్లోనూ, లేనిచోట పార్టీ నాయకులకు చెందిన ప్రైవేటు స్థలాల్లోనూ ఎన్టీఆర్‌ చిత్రపటాలు ఏర్పాటు చేసి నివాళులర్పించడంతోపాటు ఇతర కార్యక్రమాల నిర్వహణకు తెలుగు తమ్ముళ్లు సిద్ధమయ్యారు.

Updated Date - May 28 , 2024 | 01:10 AM