Share News

నేడు చంద్రన్న పట్టాభిషేకం

ABN , Publish Date - Jun 12 , 2024 | 01:39 AM

ముఖ్య మంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బుధవారం పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కృష్ణా జిల్లా కేసరపల్లి అందుకు వేదికవుతోంది. ప్రధాని మోదీతోపాటు పలువురు ప్రముఖులు హాజరుకానుండగా ఉదయం 11.27 గంటలకు ప్రమాణస్వీకారం జరగనుంది.

నేడు చంద్రన్న పట్టాభిషేకం
ధగధగలాడుతున్న ఒంగోలులోని విద్యుత్‌ భవన్‌

ప్రమాణ స్వీకారోత్సవానికి తరలివెళ్తున్న తెలుగు తమ్ముళ్లు

1,200 మందికి ప్రత్యేక పాసులు, 32 బస్సులు ఏర్పాటు

పండుగ వాతావరణంలా కార్యక్రమం

ఊరూవాడా ప్రత్యక్ష ప్రసారం, వీక్షణకు స్ర్కీన్లు ఏర్పాటు

ప్రభుత్వ కార్యాలయాలకు విద్యుత్‌ వెలుగులు

విశాఖ వైపు వాహనాలు చీరాల మీదుగా మళ్లింపు

కూటమి సమావేశానికి హాజరైన శాసనసభ్యులు

ఐదేళ్ల వైసీపీ అవినీతి, అరాచక పాలనకు అంతం పలకడమే కాక కూటమికి రాష్ట్రంలో, జిల్లాలో ప్రజలు భారీ విజయాన్ని ఇచ్చారు. ఊహించిన దాని కన్నా ప్రజాదరణ ఎక్కువ లభించడంతో తబ్బిబ్బవుతున్న టీడీపీ శ్రేణులు అంతే ఉత్సాహాన్ని చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమంపై చూపుతున్నారు. అందులో పాల్గొనేందుకు జిల్లా నుంచి భారీగా తెలుగు తమ్ముళ్లు తరలివెళ్తున్నారు. జిల్లా నుంచి గెలుపొందిన వారు మంగళవారం విజయవాడలో జరిగిన కూటమి ఎమ్మెల్యేల సమావేశానికి హాజరయ్యారు. ఇక ఇతర ముఖ్యులతోపాటు వేలాదిమంది ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు ఎవరికి వారుగా బుధవారం ఉదయం బయల్దేరుతు న్నారు. ఇటు జిల్లాలో ఎటుచూసినా పండుగ వాతావరణం కనిపిస్తోంది.

ఒంగోలు, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి): ముఖ్య మంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బుధవారం పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కృష్ణా జిల్లా కేసరపల్లి అందుకు వేదికవుతోంది. ప్రధాని మోదీతోపాటు పలువురు ప్రముఖులు హాజరుకానుండగా ఉదయం 11.27 గంటలకు ప్రమాణస్వీకారం జరగనుంది. ఈ కార్యక్రమం ప్రభుత్వపరంగా నిర్వహించేది కావడంతో జిల్లా నుంచి కొందరికి ప్రత్యేక పాసులు, బస్సులను ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రప్రభుత్వ ఆదేశాలతో నియోజకవర్గానికి 20 వీవీఐపీ, మరో 130 వీఐపీ వెరసి 150 వంతున 1,200 పాసు లను కలెక్టరేట్‌ నుంచి ఇచ్చారు. టీడీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిల సూచనలకు అనుగుణంగా ఈ కేటాయింపు జరిగింది. అలాగే ఒక్కో నియోజకవర్గానికి 20 కారు పాసులు ఇవ్వడంతోపాటు పాసులు ఉన్న నాయకులు వెళ్లేందుకు వీలుగా ఒక్కో నియోజకవర్గానికి నాలుగు వంతున 32 బస్సులు సమకూర్చుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన పాసులు ఉన్న వారిని మాత్రమే అక్కడ సభాప్రాంగణంలోకి అనుమతిస్తారని సమాచారం. అయినప్పటికీ వేలాదిమంది అభిమానులు, ఇతర కార్యకర్తలు తమకు అవకాశం ఉన్నదారిలో వెళ్తున్నారు.

జిల్లాలో పండుగ వాతావరణం

ఇక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ భావిస్తున్న నేపథ్యంలో సాధారణ ప్రజానీకం కూడా చంద్రబాబు ప్రమాణస్వీకార సభను ప్రత్యక్షంగా చూసేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఇందుకోసం గ్రామ సచివాలయాల వద్ద, మండలకేంద్రాల్లోని తహసీల్దార్‌ ఎంపీడీవో కార్యాలయాలు, పట్టణాల్లో వార్డు సచివాలయాలు, కార్పొరేషన్‌ కార్యాలయాల వద్ద ఇందుకోసం ప్రత్యేకంగా భారీ ఎల్‌ఈడీ స్ర్కీన్లు ఏర్పాటు చేసి ఆప్టిక్‌ ఫైబర్‌ కేబుల్‌ సౌకర్యం కల్పిస్తున్నారు. అలాగే ప్రధానమైన జిల్లా, మండల కార్యాలయాలను విద్యుత్‌ దీపాలతో అలంకరించారు.

చీరాలవైపు వాహనాల మళ్లింపు

మరోవైపు చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా ప్రజలు, పెద్దఎత్తున వాహనాలు రానుండటంతో పలురూట్లలో ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నారు. చెన్నై వైపు నుంచి విశాఖ మార్గంలో వెళ్లే వాహనాలను ఒంగోలు నగరపరిధిలోని త్రోవగుంట వద్ద నుంచి చీరాల వైపు మళ్లిస్తున్నారు. అందుకు స్థానిక పోలీసు అధికారులు చర్యలు చేపట్టారు. ఇదిలాఉండగా ప్రమాణస్వీకారం అనంతరం చంద్రబాబు పెట్టే తొలి సంతకాలపై విభిన్న వర్గాలు ఆసక్తిగా చూస్తున్నాయి. ప్రత్యేకించి మెగా డీఎస్సీపై తొలి సంతకం అని ఆయన ప్రకటించడంతో నిరుద్యోగులు ఆశతో ఉన్నారు. అలాగే ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టు రద్దు, పింఛన్‌ మొత్తం రూ.4వేలకు పెంపుపై సంతకాలు చేయనున్నారన్న చర్చ సాగుతోంది.

Updated Date - Jun 12 , 2024 | 01:39 AM