పొగాకు రైతులూ తస్మాత్ జాగ్రత్త.!
ABN , Publish Date - Jul 28 , 2024 | 11:14 PM
పొగాకు రైతులూ తస్మాత్ జాగ్రత్త! కర్ణాటక రాష్ట్రంలో ప్రస్తుత సీజన్ పొగాకు పంట ఆశాజనకంగా కనిపిస్తోంది అక్కడ ప్రస్తుతం పొగాకు సాగు చేసి రెండు మాసాలు గడుస్తోంది. ప్రస్తుతం ఆకు రెలుపునకు రైతులు సిద్ధమవుతున్నారు.

కర్ణాటకలో పొగాకు పంట ఆశాజనకం
ఉత్పత్తి 100 మిలియన్ కిలోలు దాటే అవకాశం
దక్షిణాదిన వచ్చే సీజన్ సాగుపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం
ఇక్కడ అధికంగా సాగుచేయొద్దని బోర్డు అధికారుల సూచన
ఒంగోలు, జూలై 28 (ఆంధ్రజ్యోతి) : పొగాకు రైతులూ తస్మాత్ జాగ్రత్త! కర్ణాటక రాష్ట్రంలో ప్రస్తుత సీజన్ పొగాకు పంట ఆశాజనకంగా కనిపిస్తోంది అక్కడ ప్రస్తుతం పొగాకు సాగు చేసి రెండు మాసాలు గడుస్తోంది. ప్రస్తుతం ఆకు రెలుపునకు రైతులు సిద్ధమవుతున్నారు. గత రెండుళ్లుగా కర్ణాటకలో పొగాకు పంట తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కోగా ప్రస్తుత సీజన్‌లో వాతావరణం అనుకూలించింది. తోటలు ఏపుగా పెరగడంతోపాటు నాణ్యత కూడా బాగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే గత రెండేళ్లతో పోల్చితే ఈ ఏడాది అక్కడ పంట దిగుబడి కూడా పెరిగే అవకాశం ఉంది. ఇది వచ్చే సీజన్‌లో ఇక్కడి మార్కెట్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రైతులు బోర్డు అనుమతించిన విస్తీర్ణం, పరిమాణంలోనే పంట సాగు చేయాలని అధికారులు కోరుతున్నారు.
మూడేళ్లుగా అక్కడ తగ్గిన ఉత్పత్తి..
మన రాష్ట్రంలో డిమాండ్
కర్ణాటకలో గత మూడు, నాలుగేళ్లుగా వంద మిలియన్ కిలోల పంట ఉత్పత్తికి పొగాకు బోర్డు అనుమతి ఇస్తుండగా ఎంతో కొంత తక్కువగానే పండుతోంది. అందులో 2022-23 సంవత్సరంలో గణనీయంగా తగ్గింది. ఆ ఏడాది కేవలం 60 మిలియన్ కిలోల దిగుబడి మాత్రమే వచ్చింది. బోర్డు అనుమతించిన పరిమాణంలో 40శాతం ఉత్పత్తి తగ్గింది. 2023-24లో కూడా వంద మిలియన్ కిలోలకు బోర్డు అనుమతివ్వగా 83 మిలియన్ కిలోలు పండింది. ధర గరిష్ఠంగా కిలో రూ.289 పలకింది. చివరకు సగటు ధర కిలో రూ.254 లభించింది. అలా కర్ణాటకలో పంట ఉత్పత్తి తగ్గడం ఆంధ్రలోని ప్రత్యేకించి దక్షిణాది రైతులకు లాభించింది. కర్ణాటకలో పూర్తయిన వెంటనే రాష్ట్రంలోని దక్షిణాది ప్రాంతంలో వేలం ప్రారంభం అవుతుండటంతో అక్కడ ఉత్పత్తి తగ్గిన ప్రభావంతో ఎగుమతుల అవసరాల మేరకు ఈప్రాంతంలో పంట కొనేవారు పోటీ పడటంతో మంచి ధరలు లభించాయి.
ప్రస్తుతం భిన్న పరిస్థితి
ప్రస్తుత సీజన్ చూస్తే పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది. రాష్ట్రంలోని దక్షిణాది ప్రాంతంలో ఇంకా రైతుల వద్ద మూడో వంతు పంట నిల్వ ఉండగా కర్ణాటకలో ఆకు రెలుపు, క్యూరింగ్ సమయం వచ్చింది. కొన్ని చోట్ల క్యూరింగ్ కూడా చే స్తున్నారు. ఈ ఏడాది కూడా కర్ణాటకలో వంద మిలియన్ కిలోల పంట ఉత్పత్తికి బోర్డు అనుమతి వ్వగా 100నుంచి 102 మిలియన్ కిలోలు రావచ్చని బోర్డు అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే అక్కడ వాతావరణం అనుకూలించడం, ప్రస్తుతం తోటలు ఏపుగా పెరగుతున్న తీరును పరిశీలిస్తే 110 మిలియన్ కిలోల వరకూ పండవచ్చని వ్యాపార, ఇతరవర్గాల సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. అంటే గత ఏడాది కన్నా దాదాపు 30 మిలియన్ కిలోలు, అంతకుముందు ఏడాది కన్నా 50 మిలియన్ కిలోలు అధికంగా ఉత్పత్తి రావచ్చన్న విషయం స్పష్టమతోంది.
దక్షిణాది ప్రాంతంపై తీవ్ర ప్రభావం
కర్ణాటకలో ఉత్పిత్తి పెరిగితే ఆ ప్రభావం రాష్ట్రంలో ప్రత్యేకించి దక్షిణాది ప్రాంతంపై తీవ్రంగానే చూపే అవకాశం ఉంటుంది. ఇక్కడ గత సీజన్‌లో పండిన పంట ఇంకా భారీగా కొనుగోలు చేయాల్సి ఉండగా కర్ణాటకలో కూడా అధికంగా పండితే వచ్చే ఏడాది దక్షిణాది మార్కెట్‌ను అది ప్రభావితం చేసి వ్యాపారులు ధరలు తగ్గించే అవకాశం ఉంటుందని మార్కెట్ విశ్లేషకులు చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లో దక్షిణాది రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ప్రత్యేకించి వచ్చే సీజన్‌లో పంట సాగు, ఉత్పత్తి విషయంలో ఎంత పరిమితంగా ఉంటే అంత మంచిదన్న అభిప్రాయాన్ని ఆ రంగంలో అనుభవజ్ఞులు తెలియజేస్తున్నారు. అదే సమయంలో అనుమతించిన మేర మాత్రమే పంట సాగు, ఉత్పత్తికి పరిమితం కావాలని బోర్డు అధికారులు సూచిస్తున్నారు.