Share News

నామినేషన్‌ వేయాలంటే నడిచి వెళ్లాల్సిందే

ABN , Publish Date - Apr 24 , 2024 | 11:59 PM

ఎన్నికల సంఘం నియమావళి అమలులో ఉన్నా, పోలీసులు మాత్రం అధికార వైసీపీకి జీహుజూర్‌ అంటూనే ఉన్నారు. వైసీపీకి నమ్మినబంట్లుగా వ్యవహరిస్తూ, టీడీపీకి వ్యతిరేకంగా నిబంధనలను సైతం అమలుచేయకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

నామినేషన్‌ వేయాలంటే   నడిచి వెళ్లాల్సిందే
నామినేషన్‌ వేసి నడిచి వస్తున్న జనార్దన్‌

దామచర్ల వాహనాలను అనుమతించని పోలీసులు

ప్రశ్నించడంతో సమాధానం చెప్పలేక నీళ్లు నమిలిన సీఐ లక్ష్మణ్‌

ఒంగోలు (కార్పొరేషన్‌), ఏప్రిల్‌ 23 : ఎన్నికల సంఘం నియమావళి అమలులో ఉన్నా, పోలీసులు మాత్రం అధికార వైసీపీకి జీహుజూర్‌ అంటూనే ఉన్నారు. వైసీపీకి నమ్మినబంట్లుగా వ్యవహరిస్తూ, టీడీపీకి వ్యతిరేకంగా నిబంధనలను సైతం అమలుచేయకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బుధవారంటీడీపీ కూటమి అసెంబ్లీ అభ్యర్థిగా దామచర్ల జనార్దన్‌ స్థానిక ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్‌ వేసేందుకు వెళ్లగా పోలీసుల తీరునుఆ పార్టీ శ్రేణులతోపాటు, ప్రజలు కూడా తప్పుబడుతున్నారు. జనార్దన్‌ ర్యాలీలో పాల్గొన్న అనంతరం బైక్‌పై బయలుదేరారు. ఆయనతోపాటు ఆయన కార్లు కూడా ఉన్నాయి. అయితే స్థానిక అంబేడ్కర్‌ విగ్రహం వద్ద పోలీసులు అడ్డుకుని వాహనాలకు అనుమతి లేదంటూ ఆయన్ను నిలబెట్టారు. దీంతో అభ్యర్థి అయిన దామచర్ల నడుచుకుంటూనే ఆర్డీవో కార్యాలయానికి వెళ్లారు. ఇదిలా ఉంచితే.. సోమవారం వైసీపీ అసెంబ్లీ అభ్యర్థిగా బాలినేని శ్రీనివాసరెడ్డి నామినేషన్‌ వేసేందుకు వెళ్లగా, ఆయనతోపాటు మూడు వాహనాలను ఆర్డీవో కార్యాలయం వరకూ అనుమతించారు. అంతేకాకుండా నిబంధనలకు విరుద్ధంగా వైసీపీ శ్రేణులను సైతం కార్యాలయం ఆవరణ లోపలకు అనుమతించారు. ఇదే విషయాన్ని టీడీపీ శ్రేణులు సీఐ లక్ష్మణ్‌ను ప్రశ్నించగా తనకు ఆ విషయం తెలియదన్నారు. నిబంధనల మేరకు మూడు వాహనాలకు అనుమతి ఉందని దాటవేశారు. ఈ సందర్భంగా దామచర్ల కుమార్తె సీఐ తీరును తప్పుబట్టారు. నాలుగైదుసార్లు ఫోన్‌ చేసినా మీరు ఎందుకు తీయలేదని, తమ వాహనాలను ఎందుకు అనుమతించలేదని ప్రశ్నించారు. దీంతో సీఐ జరిగిన తప్పిదాన్ని కప్పిపుచ్చుకునేందుకు నానా అవస్థలు పడ్డారు. అయితే పోలీసులు వ్యవహరించిన తీరుపై టీడీపీ శ్రేణులు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యాయి.

Updated Date - Apr 24 , 2024 | 11:59 PM