Share News

జాళ్లపాలేనికి తిరునాళ్ల శోభ

ABN , Publish Date - Apr 08 , 2024 | 10:16 PM

కొండపి మండలంలోని జాళ్లపాలెం తిరునాళ్ల శోభ సంతరించుకుంది. గ్రామంలోని వీరబ్రహ్మేంద్రస్వామి మఠంలో సోమవారం నుంచి పూజలు ప్రారంభమయ్యాయి. వేకువజాము నుంచే భక్తులు తరలివచ్చి స్వామి వారికి తలనీలాలు సమర్పించడంతోపాటు పొంగళ్లు పెట్టి మొక్కులు తీర్చుకున్నారు. పశుపోషకులు మఠం చుట్టూ పశువులు, జీవాలను ప్రదక్షిణ చేయించారు. ఉగాది రోజైన మంగళవారం ప్రధాన తిరునాళ్ల జరగనుంది. ఈఏడాది ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న నేపథ్యంలో విద్యుత్‌ ప్రభల ఏర్పాటును రద్దు చేశారు.

జాళ్లపాలేనికి తిరునాళ్ల శోభ
వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం

వీరబ్రహ్మేంద్రస్వామి మఠంలో పూజలు ప్రారంభం

పొంగళ్లు పెట్టి మొక్కలు తీర్చుకుంటున్న భక్తులు

ఎన్నికల నేపథ్యంలో విద్యుత్‌ ప్రభలు రద్దు

కొండపి, ఏప్రిల్‌ 8 : మండలంలోని జాళ్లపాలెం తిరునాళ్ల శోభ సంతరించుకుంది. గ్రామంలోని వీరబ్రహ్మేంద్రస్వామి మఠంలో సోమవారం నుంచి పూజలు ప్రారంభమయ్యాయి. వేకువజాము నుంచే భక్తులు తరలివచ్చి స్వామి వారికి తలనీలాలు సమర్పించడంతోపాటు పొంగళ్లు పెట్టి మొక్కులు తీర్చుకున్నారు. పశుపోషకులు మఠం చుట్టూ పశువులు, జీవాలను ప్రదక్షిణ చేయించారు. ఉగాది రోజైన మంగళవారం ప్రధాన తిరునాళ్ల జరగనుంది. ఈఏడాది ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న నేపథ్యంలో విద్యుత్‌ ప్రభల ఏర్పాటును రద్దు చేశారు.

ఆలయ ప్రాశస్త్యం...

జాళ్లపాలెం గ్రామానికి చెందిన కొత్తపల్లి బ్రహ్మయ్య అనే వీరబ్రహ్మేంద్రస్వామి భక్తుడు ఆధ్యాత్మిక చింతనలో గడిపి గ్రామంలోని మఠంలో ఉగాది రోజున జీవ సమాధి అయ్యారు. అప్పటి నుంచి ఆయన వారసులు, గ్రామస్థులు నిత్య పూజలు చేస్తున్నారు. ఏటా ఉగాది రోజున తిరునాళ్ల నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఆరోజు ఆలయ ఆవరణలో ధుని ఏర్పాటు చేస్తారు. అందులో భక్తులు ఎండు కొబ్బరి వేసి మొక్కులు తీర్చుకుంటారు. పిల్లలు లేనివారు మొక్కుకుని, పిల్లలు పుడితే బ్రహ్మయ్య, వీరబ్రహ్మయ్య, ఈశ్వరమ్మ పేర్లు పెట్టుకుంటుంటారు.

ప్రత్యేక బస్సుల ఏర్పాటు

ఉగాది రోజైన మంగళవారం ప్రధాన తిరునాళ్ల జరగనుంది. అందుకోసం ఒంగోలు, పొదిలి, కందుకూరు డిపోల నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. భక్తుల కోసం దాతలు, ఆయా సంఘాలు అన్నదానంతోపాటు మంచినీరు, మజ్జిగ, పులిహోర పొట్లాలు అందజేయనున్నారు. చిన్నారుల ఆనందం కోసం ఆలయ సమీపంలో జెయింట్‌వీల్‌, మినీ ట్రైన్‌ ట్రాక్‌లు ఏర్పాటు చేశారు. ఎన్నికల నిబంధనల కారణంగా పెద్ద ప్రభల ఏర్పాటుకు పోలీసులు, అధికారులు అనుమతి ఇవ్వలేదు. దీంతో ఈ ఏడాది ప్రభలు ఎవరూ కట్టడం లేదు.

Updated Date - Apr 08 , 2024 | 10:16 PM