Share News

సకాలంలో రుతుపవనాలు

ABN , Publish Date - May 21 , 2024 | 12:09 AM

ఈ ఏడాది జిల్లాలో వర్షాలు సకాలంలో అది కూడా సాధారణం కన్నా కాస్తంత అధికంగానే కురిసే అవకాశం కనిపిస్తోంది.

సకాలంలో రుతుపవనాలు
కొండల మధ్య నుంచి నెమలిగుండలోకి జాలువారుతున్న నీరు

ఇప్పటికే జిల్లాలో వర్షాలు

తగ్గిన ఎండల తీవ్రత

పలుప్రాంతాల్లో జలకళ

పశ్చిమ ప్రాంతానికి ఊరట

సాగుకు భరోసా

దుక్కుల దున్నకానికి సిద్ధమవుతున్న రైతులు

ఒంగోలు, మే 20 (ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది జిల్లాలో వర్షాలు సకాలంలో అది కూడా సాధారణం కన్నా కాస్తంత అధికంగానే కురిసే అవకాశం కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు ఈసారి కాస్తంత ముందుగానే రావడం, ఇప్పటికే జిల్లాలో ఒక మోస్తరు వర్షాలు కురవడం రైతుల్లో ఆశలు కల్పిస్తున్నాయి. వాతావరణ శాఖ సమాచారాన్ని బట్టి రుతుపవనాలు ముందుగానే అండమాన్‌ తీరాన్ని తాకగా జూన్‌ 1 నాటికి కేరళలోకి, తొలివారంలో రాష్ట్రంలోకి ప్రవేశించనున్నాయి. దీనికితోడు మరో రెండు రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి ఆతర్వాత తుఫాన్‌గా మారే అవకాశం ఉంది. ఇప్పటికే ద్రోణి ప్రభావం ఉండటంతో జిల్లాలో గత వారంరోజులుగా జల్లులు పడుతూనే ఉన్నాయి. అత్యధిక ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షం కురిసింది. పశ్చిమాన మండు వేసవిలోనూ జలకళ కనిపిస్తోంది. భైరవకోన జలపాతం నీటితో కనువిందు చేస్తుండగా గుండ్లకమ్మలోకి ప్రవాహం వస్తోంది. తాజా వర్షాలతో గిద్దలూరు నియోజకవర్గంలోని నెమలిగుండ్ల రిజర్వాయర్‌కు కూడా నీరు చేరుతోంది. తూర్పు, పశ్చిమ తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లోనూ వాగులు, వంకలు, కుంటల్లోకి నీరు చేరి వేసవి వేళ పశువులు, ఇతరత్రా జీవాలకు ఊరట లభించింది.

చల్లబడిన వాతావరణం

వారంక్రితం వరకు తీవ్ర ఎండలతో మండిపోయిన జిల్లా ప్రజలకు తాజా వాతావరణ పరిస్థితి కొంతమేర ఊరట కలిగిస్తోంది. వారం క్రితం వరకు పశ్చిమాన 43 నుంచి 46 డిగ్రీలు, తూర్పుప్రాంతంలో 40 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా ప్రస్తుతం ఎక్కడా 40 డిగ్రీలు కూడా లేదు. కొద్దిచోట్ల 37 నుంచి 39 డిగ్రీలు ఉంటుండగా అధిక ప్రాంతా ల్లో మిట్టమధ్యాహ్నం కూడా 35 నుంచి 37 డిగ్రీలలోపుగానే నమోదవుతున్నాయి. అలా ఉష్ణోగ్రతలు తగ్గడం, పలుచోట్ల ఒక మోస్తరు వర్షాలు పడుతుండటం, వచ్చేనెల రెండో వారంలోపు రుతుపవనాలు వచ్చి వర్షాలు సాధారణంగా పడే అవకాశం వంటి సంకేతాలతో ఈ ఏడాది సాగుపై భరోసా కలుగుతోంది. దీంతో రైతులు దున్నకాలకు సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉండగా ఈనెల 25 నుంచి రోహిణి కార్తె రానుండటంతో నెలాఖరులో మరోసారి ఎండలు పెరిగే అవకాశం ఉంది. అయితే వాతావరణ మార్పుతో జల్లులు పడి ఆ తీవ్రత అంతగా ఉండకపోవచ్చని సమాచారం.

Updated Date - May 21 , 2024 | 12:09 AM