Share News

అటు ఆగ్రహం.. ఇటు అసహనం

ABN , Publish Date - Feb 25 , 2024 | 02:05 AM

ఒకవైపు హడావుడిగా అయిపోయిన పనులకు ఆమోదం తెలపడమేమిటంటూ ప్రతిపక్ష కార్పొరేటర్లు పోడియం చుట్టుముట్టి ఆగ్రహం వ్యక్తం చేయగా, మరోవైపు శుక్రవారం ఎన్‌.అగ్రహా రంలో జరిగిన సీఎం సభలో తమకు ఘోర అవమానం జరిగిందని వైసీపీ కార్పొరేటర్లు వాపోయారు.

అటు ఆగ్రహం.. ఇటు అసహనం
అజెండా కాపీలను చించివేస్తున్న టీడీపీ కార్పొరేటర్‌లు (ఇన్‌సెట్‌లో) మాట్లాడుతున్న మేయర్‌ సుజాత

కౌన్సిల్‌లో అజెండా కాపీలను చించేసిన టీడీపీ కార్పొరేటర్లు

సీఎం సభలో అవమానించారని వైసీపీ కార్పొరేటర్ల ఆవేదన

తనకు స్వీపర్‌ పాస్‌ ఇచ్చారని వాపోయిన మేయర్‌

ఒంగోలు (కార్పొరేషన్‌), ఫిబ్రవరి 24 : ఒకవైపు హడావుడిగా అయిపోయిన పనులకు ఆమోదం తెలపడమేమిటంటూ ప్రతిపక్ష కార్పొరేటర్లు పోడియం చుట్టుముట్టి ఆగ్రహం వ్యక్తం చేయగా, మరోవైపు శుక్రవారం ఎన్‌.అగ్రహా రంలో జరిగిన సీఎం సభలో తమకు ఘోర అవమానం జరిగిందని వైసీపీ కార్పొరేటర్లు వాపోయారు. పలు అభివృద్ధి అంశాలపై మేయర్‌ గంగాడ సుజాత అధ్యక్షతన శనివారం నిర్వహించిన కార్పొరేషన్‌ కౌన్సిల్‌ అత్యవసర సమావేశం వాడీవేడిగా సాగింది. టెండర్‌ ఖరారు కాకముందే రూ.22 కోట్లతో చేపట్టిన పనులకు అధికార వైసీపీ కార్పొరేటర్లు ఆమోదం తెలిపారు. ఇప్పటికే కొనసాగుతున్న పనులకు ముందస్తు అనుమతులు (ర్యాడిఫికేషన్‌) పేరుతో హడావుడిగా కౌన్సిల్‌ అజెండాలో పొందుపరిచారు. దీంతోపాటు మరి కొన్ని అభివృద్ధి పనులకు ఆమోదం కోసం మొత్తం 26 అంశాలను అజెండాలో చేర్చగా టీడీపీ, జనసేన కార్పొరేటర్లు అభ్యంతరం తెలిపారు. దీంతో వాడీవేడిగా చర్చ జరగడంతో ప్రతిపక్ష కార్పొరేటర్లు అజెండా కాపీలను చించివేశారు. మొత్తంగా సమావేశం రసాభాసగా సాగింది. ఇదే సమయంలో శుక్రవారం జరిగిన సీఎం సభకు వెళ్లేందుకు కార్పొరేటర్లకు స్వీపర్లకు ఇచ్చే డ్యూటీపాస్‌లు ఇచ్చారని వైసీపీ కార్పొరేటర్‌ చింతపల్లి గోపితోపాటు మరికొందరు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఇది అధికార పార్టీ కార్పొరేటర్లుగా తమకు తీరని అవమానంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని సమావేశంలో చర్చకు తీసుకురాగా, వైసీపీ కార్పొరేటర్లందరూ తమకు జరిగిన అవమానంపై తీవ్రఅసహనం వ్యక్తం చేశారు. అయితే ఇదే విషయమై మేయర్‌ మాట్లాడుతూ మీ సంగతి అలా ఉంచితే నగర ప్రఽథమ మహిళ, మేయర్‌ అయిన తనకు కూడా స్వీపర్‌కు ఇచ్చే డ్యూటీ పాస్‌నే ఇచ్చారని, తన బాధ ఎవరికి చెప్పుకోవాలని సమావేశంలో వాపోవడం విశేషం.

Updated Date - Feb 25 , 2024 | 02:05 AM