Share News

దొంగలు దొరికారు!

ABN , Publish Date - Apr 25 , 2024 | 01:23 AM

మండల కేంద్రమైన చీమకుర్తిలో ఈనెల 21న జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఇద్దరు దొంగలను అరెస్టు చేశారు. వారి వద్ద రూ.45లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నారు.

దొంగలు దొరికారు!
దొంగల నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆభరణాలను పరిశీలిస్తున్న ఎస్పీ సుమిత్‌

చీమకుర్తిలో భారీ చోరీ కేసును ఛేదించిన పోలీసులు

ఇద్దరు అరెస్టు

రూ.45లక్షల సొత్తు స్వాధీనం

వివరాలను వెల్లడించిన ఎస్పీ సుమిత్‌

ఒంగోలు (క్రైం), ఏప్రిల్‌ 24 : మండల కేంద్రమైన చీమకుర్తిలో ఈనెల 21న జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఇద్దరు దొంగలను అరెస్టు చేశారు. వారి వద్ద రూ.45లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. వివరాలను బుధవారం ఒంగోలులో ఎస్పీ గరుడ సుమిత్‌ సునీల్‌ వెల్లడించారు. ఆయన కథనం మేరకు.. చీమకుర్తి పట్టణంలోని విద్యానగర్‌కు చెందిన పమిడి పద్మశ్రీ తన సోదరుడు మృతి చెందడంతో ఈనెల 21న బాపట్ల జిల్లా బల్లికురవ వెళ్లారు. 22వ తేదీ మధ్యాహ్నం 2.30 గంటలకు తిరిగి వచ్చే సరికి ఇంటి తలుపులు పగులగొట్టి ఉన్నాయి. లోపలికి వెళ్లి చూడగా బీరువా బద్దలు కొట్టి ఉంది. అందులో ఉంచిన 75 సవర్ల బంగారు అభరణాలు, రూ.60 వేల నగదు కనిపించలేదు. దీంతో ఆమె చీమకుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ కోసం ఎస్పీ స్వీయ పర్యవేక్షణలో మూడు బృందాలను ఏర్పాటు చేశారు.

దొంగలను పట్టించిన వేలిముద్రలు

రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలంలో దొరికిన వేలి ముద్రల ఆధారంగా నిందితులను గుర్తించారు. తాళ్లూరు మండలం తూర్పుగంగవరం పంచాయతీ పరిధిలోని రామభద్రాపురంనకు చెందిన వదిసేన వేణుగోపాల్‌రెడ్డి, చీమకుర్తిలోని జగనన్న కాలనీకి చెందిన షేక్‌ తరుణ్‌ అలియాస్‌ రఫి ఈచోరీ చేసినట్లు నిర్ధారించుకున్నారు. ఇద్దరినీ బుధవారం రామభద్రాపురంలోని వేణుగోపాల్‌రెడ్డి ఇంటి వద్ద అరెస్టు చేశారు. వారి వద్ద రూ.45లక్షల విలువైన 75 సవర్ల బంగారు అభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు.

నిందితుల్లో అంతర్‌రాష్ట్ర దొంగ

నిందితుల్లో ఒకరైన వేణుగోపాల్‌రెడ్డి అంతర్‌రాష్ట్ర దొంగ. మన రాష్ట్రంలో 13 కేసులతోపాటు తెలంగాణలో మరో ఆరు కేసుల్లో ఆయన నిందితుడిగా ఉన్నాడు. పగలు రోడ్ల వెంట తిరుగుతూ తాళాలు వేసిన ఇళ్లను గుర్తించి రాత్రుళ్లు చోరీకి పాల్పడతాడు. చీమకుర్తిలో జరిగిన చోరీలో అతనితో షేక్‌ తరుణ్‌ కూడా కలిశాడు. ఇతనిపై కూడా కొన్ని చిన్నచిన్న కేసులు ఉన్నాయి. ముందుగానే వారిని అనుమానించిన పోలీసులు విచారించి వదిలేశారు. అయితే సంఘటనా స్థలంలో దొరికిన వేలిముద్రలతో వారి వేలిముద్రలు సరిపోలినట్లు నిపుణులు గుర్తించడంతో తిరిగి మరోసారి అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో చోరీ చేసింది తామేనని ఒప్పుకున్నారు. కేసును అత్యంత వేగంగా ఛేదించిన అదనపు ఎస్పీ (క్రైమ్స్‌) శ్రీధర్‌రావు, ఒంగోలు డీఎస్పీ ఎం.కిషోర్‌బాబు, చీమకుర్తి సీఐ దుర్గాప్రసాద్‌, సీసీఎస్‌ సీఐ టి.విజయకృష్ణలతోపాటు సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

Updated Date - Apr 25 , 2024 | 01:23 AM