అలా వదిలేశారు!
ABN , Publish Date - Feb 06 , 2024 | 02:02 AM
దర్శి పట్టణంలో ఎంతో విలువైన స్థలాలు యథేచ్ఛగా ఆక్రమణలకు గురవుతున్నాయి. కొంతమంది అక్రమార్కులు ప్రభుత్వ స్థలాలను కబ్జాచేసి సొంత స్థలాల్లో కలుపుకొంటున్నారు.
యథేచ్ఛగా ప్రభుత్వ స్థలాల ఆక్రమణ
అడ్డుకోవడంలో అధికారులు విఫలం
చాలాకాలం క్రితమే మార్కింగ్ వేసి పట్టించుకోని వైనం
దర్శి, ఫిబ్రవరి 5 : దర్శి పట్టణంలో ఎంతో విలువైన స్థలాలు యథేచ్ఛగా ఆక్రమణలకు గురవుతున్నాయి. కొంతమంది అక్రమార్కులు ప్రభుత్వ స్థలాలను కబ్జాచేసి సొంత స్థలాల్లో కలుపుకొంటున్నారు. ఏళ్ల తరబడి ఆక్రమణలు జరుగుతున్నప్పటికీ పట్టించుకున్న నాథుడే లేడు. ప్రజలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినప్పుడు, వారి ఒత్తిడి మేరకు కొలతలు వేసి హడావుడి చేయడం తప్ప ఆక్రమణలు తొలగించిన దాఖలాలు లేవు. ఎంతోకాలం క్రితం జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ఆక్రమణల తొలగింపునకు మార్కింగ్ ఇచ్చి ఆ తర్వాత వదిలేశారు. దర్శి-కురిచేడు రోడ్డులో దర్శి రెవెన్యూలోని 247, 248, 286 సర్వే నెంబర్లల్లో పది ఎకరాలకుపైగా బండి దారి భూమి ఉంది. అది కొన్ని సంవత్సరాలుగా దశలవారీగా ఆక్రమణలకు గురవుతోంది. ఒక కళాశాల యాజమాన్యం ఎకరం భూమిని ఆక్రమించి కళాశాలలో కలుపుకొని ప్రహరీ గోడను నిర్మించింది. మరికొంత భూమిని చుట్టూ ఉన్న రైతులు ఆక్రమించుకొని వారి పొలాల్లో కలుపుకున్నారు. ఇటీవల కాలంలో స్థలాలకు ధరలు విపరీతంగా పెరగడంతో బండిదారి భూమిని మరికొందరు ఆక్రమించారు. ఆ ప్రాంతంలో రైతులు దారి ఆక్రమణకు గురవుతుందని, తాము పొలాలకు వెళ్లేందుకు ఇబ్బందిగా ఉందని అనేకసార్లు జిల్లా అధికారులకు ఫిర్యాదులు చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కొలతలు వేసి హద్దులను ఏర్పాటు చేశారు. ఆక్రమణలకు గురైన ప్రాంతాలను గుర్తించి తొలగింపు కోసం మార్కింగ్ కూడా ఇచ్చారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో కానీ అధికారులు అక్కడి ఆక్రమణల విషయాన్ని పట్టించుకోవడం లేదు. సుమారు 120 అడుగల వెడల్పు ఉన్న బండి దారి ప్రస్తుతం 40 అడుగులకు కుంచించుకుపోయింది. కొన్నిచోట్ల పూర్తిగా ఆక్రమణకు గురైంది. అదే ప్రాంతంలో మరో దారి పోరంబోకు స్థలాన్ని కొందరు వ్యక్తులు వెంచర్‌లో కలుపుకొని రోడ్లు వేశారు. అదేవిధంగా పొదిలి రోడ్డులో వాగు పోరంబోకు భూమిని కొంతమంది ఆక్రమించి అక్కడ నిర్మాణాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి వచ్చినప్పుడు స్థానిక అధికారులు హడావుడి చేయడం తప్ప ఒక్కచోటా ఆక్రమణలు తొలగించలేదు.రూ.కెగ్త విలువైన ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురికావడంపట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది బండి దారి ఆక్రమణ తొలగింపు కోసం న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలను తొలగించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.