Share News

మారుతున్న అధికారుల స్వరం

ABN , Publish Date - Jun 11 , 2024 | 11:36 PM

టీడీపీ కూటమి అధికారంలోకి రావటంతో అధికారులు స్వరం మార్చారు. టీడీపీ నాయకులను ప్రసన్నం చేసుకునేందుకు యత్నాలు సాగిస్తున్నారు. కీలక నాయకులకు ముఖ్యులైన వారి వివరాలు కనుక్కొని వారిద్వారా కొంతమంది ఫోన్లు చేయిస్తున్నారు. నిన్న మొన్నటివరకు వైసీపీకి తొత్తులుగా వ్యవహరించిన పలువురు అధికారులు తీరు మార్చుకోకపోతే ఇబ్బందులు తప్పవన్న భయంతో నేరుగా కలిసి ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

మారుతున్న అధికారుల స్వరం
డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మికి బొకే అందజేస్తున్న సీఐ షమీముల్లా

టీడీపీ నాయకులను ప్రసన్నం చేసుకునే యత్నాలు

అడ్డగోలుగా వ్యవహరించిన అఽధికారులను ఉపేక్షించేది లేదంటున్న నేతలు

దర్శి, జూన్‌ 11: టీడీపీ కూటమి అధికారంలోకి రావటంతో అధికారులు స్వరం మార్చారు. టీడీపీ నాయకులను ప్రసన్నం చేసుకునేందుకు యత్నాలు సాగిస్తున్నారు. కీలక నాయకులకు ముఖ్యులైన వారి వివరాలు కనుక్కొని వారిద్వారా కొంతమంది ఫోన్లు చేయిస్తున్నారు. నిన్న మొన్నటివరకు వైసీపీకి తొత్తులుగా వ్యవహరించిన పలువురు అధికారులు తీరు మార్చుకోకపోతే ఇబ్బందులు తప్పవన్న భయంతో నేరుగా కలిసి ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కౌంటింగ్‌ రోజువరకు ఏకపక్షంగా వ్యవహరించిన పోలీసులు మెత్తబడి చల్లగా టీడీపీ నాయకుల వద్దకు చేరుకుంటున్నారు.

దర్శి సీఐ షేక్‌ షమీముల్లా రెండురోజుల క్రితం దర్శి నియోజకవర్గ టీడీపీ నాయకురాలు డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి, ఆమె భర్త డాక్టర్‌ లలిత్‌సాగర్‌ను కలిసి బొకే అందజేశారు. మరికొందరు అధికారులు కూడా కలిసినట్లు సమాచారం. ఎన్నికల సందర్భంగా వైసీపీ దాడులు చేస్తున్నారని టీడీపీ క్యాడర్‌ ఆక్రోశించినప్పటికీ పోలీసులు పట్టించుకోలేదు. గాయాలపాలైన బాధితులపైనే కేసులు పెట్టారు. ఇదేమిటని టీడీపీ నాయకులు అడిగితే మేము ఇంతకంటే ఏమిచేయలేమని ఇక్కడ కాకపోతే మరోకచోటికి వెళ్తామని కొంతమంది పోలీసు అధికారులు సమాధానం చెప్పిన విషయం తెలిసిందే. అడ్డగోలుగా వ్యవహరించిన పోలీసు అధికారులపై అమీతుమీ తేల్చుకోవాలని, ప్రభుత్వం ఏర్పాటుకాగానే ఫిర్యాదు చేయాలని టీడీపీ నాయకులు సిద్ధమయ్యారు. ఇప్పటివరకు ఏకపక్షంగా వ్యవహరించిన పోలీసులు భవిష్యత్తులో జరిగే పరిణామాలను గుర్తించి ఏదోరకంగా మంచి చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. టీడీపీ నాయకులు మాత్రం ఎన్నికల సందర్భంగా వారు వ్యవహరించిన తీరను గుర్తుచేసుకొని వైసీపీకి తొత్తులుగా వ్యవహరించిన అధికారులను ఉపేక్షించేది లేదని కఠినంగా ఉన్నారు. అదేవిధంగా రెవెన్యూ, పంచాయతీరాజ్‌, మండల పరిషత్‌ శాఖల్లో కూడా కొంతమంది ఉద్యోగులు వైసీపీకి తొత్తులుగా వ్యవహరించారు. ఎన్నికల సమయంలో పోలీసులు సూచించిన మేరకు ఫిర్యాదులు చేశారు. ఆ అధికారుల ఫిర్యాదుల మేరకు పోలీసులు అక్రమ కేసులు బనాయించారు. ఇప్పుడు ఆ అధికారులు తమకు ఇబ్బందులు తప్పవని భయపడుతున్నారు. కొంతమంది అధికారులు ఉద్యోగులను బెదిరించి పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను వైసీపీకి అనుకూలంగా వేయించారు. జిల్లా పరిషత్‌ తమ చేతుల్లో ఉందని పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు వైసీపీకి వేయకపోతే మీసంగతి చూస్తామని పలువురు ఉద్యోగులను బెదిరించటంతో భవిష్యత్తులో ఇబ్బందలు ఉడాల్సివస్తుందనే భయంతో కొందరు ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు వైసీపీకి వేశారు. ఉద్యోగులను బెదిరించి పోస్టల్‌ బ్యాలెట్లు ఎవరెవరు వేయించారనే విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. దీంతో ఆ శాఖలకు చెందిన కొందరు ఉద్యోగులు టీడీపీ నాయకులను కలిసి ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, ఎన్నికల సందర్భంగా ఏకపక్షంగా వ్యవహరించిన అధికారులను టీడీపీ కార్యకర్తలను ఇబ్బందులు పెట్టిన వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని చెబుతున్నారు. నూతన ప్రభుత్వం ఏర్పడగానే ఉద్యోగుల ప్రక్షాళన తప్పదని టీడీపీ కూటమి నాయకులు స్పష్టం చేస్తున్నారు.

Updated Date - Jun 11 , 2024 | 11:36 PM