వ్యాపారి కిడ్నాప్ కథ సుఖాంతం
ABN , Publish Date - Jul 05 , 2024 | 01:28 AM
కిడ్నాప్‌కు గురైన మిర్చి వ్యాపారి వ్యవహారంపై ఇంచుమించు 30 గంటలపాటు నెలకొన్న ఉత్కంఠకు చివరకు తెరపడినట్లైంది.

మార్కాపురం, జూలై 4: కిడ్నాప్‌కు గురైన మిర్చి వ్యాపారి వ్యవహారంపై ఇంచుమించు 30 గంటలపాటు నెలకొన్న ఉత్కంఠకు చివరకు తెరపడినట్లైంది. అపహరణకు గురైన వెంకటరెడ్డిని గురువారం రాత్రి 7.00 గంటల సమయంలో గొట్టిపడియ గ్రామ సమీపంలోని కొండపై రైతులు వదిలి వెళ్లిపోయారు. అక్కడకు వెళ్లిన పోలీసులు వాహనంలో వెంకటరెడ్డిని వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తరలించారు.
ఉదయం నుంచి ముమ్మర గాలింపు
మండలంలోని బిరుదులనరవ గ్రామంలోని దానిమ్మ పొలం వద్దకు బుధవారం మధ్నాహ్న సమయంలో మిర్చి వ్యాపారి రాగి వెంకటరెడ్డి అత్తమామలతో కలిసి వెళ్లాడు. పొలం వద్ద ఉన్న విషయం తెలుసుకున్న గొట్టిపడియకు చెందిన బాఽధిత రైతులు అక్కడకు వెళ్లారు. తొలుత వెంకటరెడ్డి కారును ధ్వంసం చేశారు. అనంతరం మోటార్ సైకిళ్లపై వెంకటరెడ్డిని అక్కడ నుంచి సుమారు 8 మంది రైతులు అపహరించుకు పోయారు. సాయంత్రం సమయంలో పోలీసు లకు సమాచారం అందింది. వెంటనే రంగంలోకి దిగినా రాత్రి సమయం కావడంతో వెతుకులా డేందుకు అవరోధం ఏర్పడింది. కొంత మంది సిబ్బందితో గొట్టిపడియ, బిరుదుల నరవ గ్రామ పరిసరాల్లో పోలీసు సిబ్బంది గాలించారు. కానీ ఎక్కడా ఆయ న ఆచూకీ లభించలేదు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న జిల్లా ఎస్పీ సుమిత్ సునీల్ ప్రత్యేక దృష్టిపెట్టారు. ఉదయాన్నే అదనపు ఎస్పీ కె.నాగేశ్వర రావును ఏఆర్ సిబ్బందితో కలిపి మార్కాపురం పంపారు. అంతేకాక మార్కాపురంతో పాటు ఎర్రగొండ పాలెం, త్రిపురాంతకం, కంభం, గిద్దలూరు సీఐలను కూడా రంగంలోకి దింపారు. పలు బృందాలుగా ఏర్పడిన పోలీసు అధికారులు అన్ని కోణాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. ప్రధానంగా వ్యాపారిని కిడ్పాప్‌కు చేసిన రైతుల బంధువుల ద్వారా ఒత్తిడిని తీవ్రం చేయడంతో వ్యాపారిని అపహరించిన రైతులు గురువారం రాత్రి 7.00 గంటల సమయంలో వెంకటరెడ్డిని గొట్టిపడియ కొండపైకి తీసుకెళ్లి ఒక రైతు ఫోన్ నుంచి పోలీసులకు ఫలానా చోట ఉన్నట్లు సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరుకుని పోలీసులు వెంకట రెడ్డిని మార్కాపురం తరలించారు.
రైతుల కోసం పోలీసుల గాలింపు
కిడ్నాప్ వ్యవహారంలో మండలంలోని గొట్టిపడియకు చెందిన 9మంది రైతులు ఉన్నట్లు పోలీసులు నిర్థారించారు. వారిలో ఒకరైన అను బోలు గాలిరెడ్డి బుధవారం సాయత్రమే వ్యాపారి వెంకటరెడ్డి పొలం వద్ద దొరికాడు. ఆయన వద్ద నుంచి సేకరించిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన అనబోలు శ్రీనివాసరెడ్డి, అనబోలు సుబ్బారెడ్డి, అనబోలు గోపాల్‌రెడ్డి, తుమ్మా చిన్న అల్లూరిరెడ్డి, నడికట్టు నారాయణరెడ్డి, తంగిరాల సత్యనారాయణరెడ్డి, తుమ్మా రామలక్ష్మిరెడ్డి, మాలపాటి అల్లూరిరెడ్డిలు వ్యాపారి వెంకటరెడ్డిని అపహరించిన వారిలో ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం వారి ఫోన్లు ఎవరివీ పని చేయడం లేదు. గొట్టిపడియ గ్రామంలో సెల్‌ఫోన్ సిగ్నల్స్ రావు. దీంతో పోలీసులు గ్రామంలోనే ఉండి పరిసర పొలాల్లో వారి కోసం గాలిస్తున్నారు. కానీ వారంతా గ్రామానికి సమీపంలోకి అటవీ ప్రాంతంలోకి వెళ్లి ఉంటారనే కోణంలో పోలీసులు ఏఆర్ సిబ్బందితో వెతికిస్తున్నారు.