Share News

దాహం కేకలు

ABN , Publish Date - May 21 , 2024 | 12:12 AM

నగరంలో తాగునీటి సమస్య రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది.గొంతు తడుపుకొనేందుకు గుక్కెడు నీరు దొరక్క ప్రజలు అల్లాడుతున్నారు.

దాహం కేకలు
నీటి కోసం రోడ్డెక్కి నిరసన తెలుపుతున్న కొప్పోలు ప్రజలు

నగరంలో నీటి సమస్య మరింత తీవ్రం

రోడ్డెక్కిన కొప్పోలు ప్రజలు

పదిరోజులుగా నీరు లేక నానా అగచాట్లు

ఒంగోలులో అస్తవ్యస్తంగా సరఫరా

శివారు కాలనీల్లో పరిస్థితి దారుణం

నగరంలో తాగునీటి సమస్య రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది.గొంతు తడుపుకొనేందుకు గుక్కెడు నీరు దొరక్క ప్రజలు అల్లాడుతున్నారు. శివారు కాలనీల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. మంచినీళ్ల కోసం మహిళలు కుస్తీలు పడుతున్నారు. బిందెడు నీటి కోసం ట్యాంకర్ల వద్ద బారులు తీరుతున్నారు. కొన్నిప్రాంతాల్లో వేళాపాళా లేని సరఫరాతో జనం జాగారం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్య ధోరణి నీళ్ల కష్టాల్లోకి నెట్టేసింది.ఒంగోలు ప్రజలకు తాగునీటి అవసరాలకు ప్రధాన ఆధారంగా ఉన్న రెండు సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకుల్లో నీరు అంతంతమాత్రంగానే ఉంది. రోజురోజుకూ తాగునీటి అవసరాలు పెరుగుతున్నా కార్పొరేషన్‌ ఇంజనీరింగ్‌ వ్యవస్థ నిర్లక్ష్యం వీడటం లేదు. దీంతో నగర జనం నీటి కోసం గగ్గోలు పెడుతూ రోడ్డెక్కుతున్నారు.

ఒంగోలు (కార్పొరేషన్‌), మే20: పాలకుల నిర్లక్ష్యంతో ఒంగోలు నగరంలో నీటికి కటకట నెలకొంది. జనం దాహార్తితో అల్లాడుతున్నారు. శివారు ప్రాంతాలకు సరఫరా అంతంతమాత్రంగా మారింది. బిందెడు నీటి కోసం బండెడు కష్టాలను నగరవాసులు అనుభవిస్తున్నారు. నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతోనే సరఫరా అస్తవ్యస్తంగా మారింది. సరైన విధానం లేకపోవడంతో కొన్నిచోట్ల నాలుగైదు రోజులకు ఒకసారి ఇస్తుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ప్రస్తుతం నగర జనాభా 3లక్షలకు చేరింది. కానీ అందుకు తగ్గట్లు తాగునీటి అవసరాలను తీర్చే వనరులు లేవు. దీంతో నగరంలోనే కాకుండా విలీన గ్రామాల్లోనూ దాహం కేకలు వినిపిస్తున్నాయి. మునిసిపాలిటీ ఏర్పడిన నాటి పైపులైన్లతోనే అధికారులు కాలం వెల్లబుచ్చుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు వందల సంఖ్యలో దర్శనమిచ్చే లీకులతో సగం నీరు రోడ్లపాలవుతోంది. అయినా నగర పాలక ఇంజనీరింగ్‌ వ్యవస్థలో స్పందన కనిపించడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా తాగునీటి కోసం కొప్పోలు గ్రామ ప్రజలు రోడ్డెక్కారు. పది రోజులుగా నీటి సరఫరా లేకపోవడంతో అధికారుల తీరుపై ఆగ్రహించారు. ఖాళీబిందెలతో రోడ్డుపై బైటాయించి నిరసన తెలిపారు.

అస్తవ్యస్తంగా సరఫరా

నగరంలో కొద్ది రోజుల నుంచి తాగునీటి సరఫరా అస్తవ్యస్తంగా మారింది. గతంలో రెండు రోజులకోసారి నీరు అందిస్తుండగా, ఇటీవల కాలంలో మూడురోజుల కొకసారి సరఫరా చేస్తున్నారు.మోటార్లు పాడయ్యాయని, కరెంటు పోయిందని, పైపులైను లీకులు వచ్చాయని ఏదో ఒక కారణం చూపుతూ తాగునీటి సరఫరా వేళలను మార్చి వేశారు. సరఫరాలో జాప్యంపై ఽఅధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వకపోతుండటంతో ప్రజలకు రోజంతా ఎదురుచూపులు తప్పడం లేదు. కొన్నిసార్లు నాలుగు రోజులకు, పనులు పూర్తికాకపోతే ఐదురోజులకు ఇస్తుండటం గమనార్హం.

ట్యాంకర్లతో సరఫరా ఇష్టారాజ్యం

ఒంగోలు మునిసిపల్‌ కార్పొరేషన్‌లో హోదాకు తగ్గట్లు నీరు సరఫరా చేసేందుకు ప్రభుత్వ ట్యాంకర్లు లేవు. గతంలో మూడు ఉండగా అవి ప్రస్తుతం మరమ్మతులకు గురై మూలనపడ్డాయి. దీంతో 35 ప్రైవేటు ట్యాంకర్లే ఏళ్లతరబడితాగునీటిని సరఫరా చేస్తున్నాయి. కార్పొరేషన్‌లో ఉన్న శివారు ప్రాంతాలకు, పది విలీన గ్రామాలకు ఆ ట్యాంకర్లతోనే రోజుకు రెండువందల ట్రిప్పుల నీరు సరఫరా చేస్తున్నారు. దీంతో అటు శివారు కాలనీలు, ఇటు విలీన ప్రాంతాల ప్రజలు తాగునీటి కోసం తంటాలు పడుతున్నారు.

శివారు కాలనీల్లో వేధిస్తున్న సమస్య

నగరంలో ని 50 శివారు కాలనీల్లో నీటి సమస్య వేధిస్తోంది. ఆ కాలనీలకు సరైన పైపులైన్‌ లేదు. ప్రత్యేకించి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఉన్న ప్రాంతాల్లోనే తాగునీటి పైపులైన్లు అటుఇటు మార్పుచేశారే తప్ప శివారు కాలనీలను పట్టించుకోలేదు. ఇప్పటికీ పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు ప్రైవేటు ట్యాంకర్లు ఆధారమయ్యాయి. అయితే రెండు రోజులకు ఒకసారి నీరు సరఫరా చేస్తున్నారు. ముందే వచ్చిన వేసవితో తాగునీటి అవసరాలు పెరిగాయి. దీంతో కాలనీల్లో నీటి ఎద్దడితో ప్రజలు అల్లాడుతున్నారు.

కొత్త చేతిపంపుల ఏర్పాటు ఊసే కరువు

నగరంలో చేతిపంపులు పనిచేయడం లేదు. ప్రతి వార్డులో పదుల సంఖ్యలోనే ఉండగా వాటి నిర్వహణ కోసం ఓ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌, ఆయన పర్యవేక్షణలో మరో ఆరుగురు సిబ్బంది పనిచేస్తున్నారు. అయితే నిత్యం బోరింగ్‌ (చేతిపంపు)లు మరమ్మతులతో బిజీగా ఉన్నట్లు నటిస్తున్న యంత్రాంగం పట్టుమని బిందెడు నీళ్లు కూడా వాటి ద్వారా ఇవ్వలేకపోతోంది. ఒంగోలులోనే దాదాపు 850 చేతిపంపులు కార్పొరేషన్‌ రికార్డుల్లో ఉండగా, వాటి మరమ్మతులు, కొత్తవి ఏర్పాటు కోసం ఏటా బడ్జెట్‌లో రూ.10లక్షలు మంజూరవుతున్నాయి. కానీ అవి ఏమవుతున్నాయని అడిగితే చెప్పడం కష్టమేనని ఇంజనీరింగ్‌ అధికారులు వెల్లడి స్తున్నారు.

రోడ్డెక్కిన కొప్పోలు ప్రజలు

పది రోజులుగా తాగునీరు రాకపోవడంతో సోమవారం నగర పరిధిలోని కొప్పోలు ప్రజలు రోడ్డెక్కారు. ఒంగోలు-కొత్తపట్నం రహదారిపై ఖాళీబిందెలతో బైటాయించి రెండు గంటలపాటు నిరసన తెలిపారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పదిరోజులుగా నీరు లేకపోవడం వలన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొం టున్నామన్నారు. అధికారులను అడిగితే రెండు మూడు రోజులకొకసారి ట్యాంకర్లు పంపుతారని, అది కూడా పలుకుబడి ఉన్నవారికేనని వాపోయారు. సాధారణ ప్రజల గోడు మాత్రం పట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్య పరిష్కరించే వరకు ఆందోళన విరమించేది లేదని తేల్చిచెప్పారు. దీంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న కార్పొరేషన్‌ అధికారులు కొప్పోలు చేరుకుని గ్రామస్థులతో మాట్లాడారు. కొత్త పైపులైను ఏర్పాటు చేసి పూర్తిస్థాయిలో సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో జనం ఆందోళన విరమించారు.

Updated Date - May 21 , 2024 | 12:12 AM