Share News

అంగన్‌వాడీల అలుపెరగని పోరాటం

ABN , Publish Date - Jan 12 , 2024 | 01:17 AM

తమ సమస్యలు పరిష్కరించాలని అంగన్‌వాడీలు చేస్తున్న సమ్మె గురువారం 31వ రోజుకు చేరింది.

అంగన్‌వాడీల అలుపెరగని పోరాటం

మార్కాపురం వన్‌టౌన్‌, జనవరి 11: తమ సమస్యలు పరిష్కరించాలని అంగన్‌వాడీలు చేస్తున్న సమ్మె గురువారం 31వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా అంగన్‌వాడీలు సబ్‌కలెక్టర్‌ కార్యాలయం వద్ద దీక్షా శిబిరంలో పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. సమ్మెలో పాల్గొంటున్న అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాల ఇళ్లకు ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్లు, వీఆర్‌వోలు వెళ్లి షోకాజ్‌ నోటీసులు అంటించారు.

గిద్దలూరు : నిర్వదిన దీక్షల్లో భాగంగా అంగన్‌వాడీ కార్యకర్తలు, ప్రభుత్వ తీరును నిరసిస్తూ, కళ్లకు నోటికి, చెవులకు చేతులు అడ్డం పెట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. 31వ రోజు సమ్మెలో భాగంగా స్థానిక సచివాలయం ఎదుట నిరసన కొనసాగింది. ‘కళ్లుండి చూడలేని ప్రభుత్వం, నోరుండి మాట్లాడలేని ప్రభుత్వం, చెవులుండి వినలేని ప్రభుత్వం’ అంటూ అంగన్‌వాడీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు సమ్మె కొనసాగిస్తామ న్నారు. సంక్రాంతి పండుగ కూడా రోడ్డుమీదే జరుపుకుంటామని నినదించారు. కార్యక్రమంలో అంగన్‌ వాడీవర్కర్స్‌ యూనియన్‌ ప్రతినిధులు స్వర్ణకుమారి, మున్నా, రహమత్‌భీ, విజయలక్ష్మి, సీఐటీయూ నాయకులు ఆవులయ్య పాల్గొన్నారు.

పెద్ద దోర్నాల : అంగన్‌వాడీలకు ప్రభుత్వం న్యాయం చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్‌ డిమాండ్‌ చేశారు. స్థానిక ఆర్‌టీసీ బస్టాండు వద్ద నెల రోజులుగా అంగన్‌వాడీలు నిర్వహిస్తున్న సమ్మె గురు వారం కూడా కొనసాగింది. ఈ క్రమంలో సీఐటీయూ ప్రధాన కార్యదర్శి రమేష్‌ మాట్లాడుతూ అంగన్‌వాడీల న్యాయమైన సమస్యల పరిష్కారం కోరుతూ నెలకు పైగా వీధుల్లో ఆందోళన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. పైగా చిరు ఉద్యోగులపై ఎస్మా చట్టం ప్రయోగించడం, బెదిరించడం అన్యాయమని ఆరోపించారు. తమను కొందరు ప్రజాప్రతినిధులు వ్యంగంగా మాట్లాడటం శోచనీయ మన్నారు. తమకు గ్రాట్యూటి, బీమా సౌకర్యం ఏర్పాటు, 62 ఏళ్లకు ఉద్యోగ విరమణ వంటి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బాలనాగయ్య, సీఐటీయూ డివిజన్‌ కార్యదర్శి రఫీ, నాయకులు ముంతాజ్‌బేగం, సుబ్బమ్మ, వెంకటలక్ష్మీ, వెంకటరత్నం, పద్మ, సుహాసిని, కోడి రాణి, కుమారి, పాల్గొన్నారు.

ఎర్రగొండపాలెం : ఎర్రగొండపాలెంలో 31వ రోజు అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు చేస్తున్న ధర్నా శిబిరాన్ని టీడీపీ అంగన్వాడీ కార్యకర్తల యూనియన్‌ అధ్యక్షురాలు ఉప్పలపాటి నాగేంద్రమ్మ, ప్రధాన కార్యదర్శి మెహరున్నీసా, ఎర్రగొండపాలెం టీడీపీ అధ్యక్షురాలు రమణమ్మలు గురువారం సందర్శించి సంఘీభావం తెలిపారు. టీడీపీ అధికారం చేపట్టగానే అంగన్వాడీల సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తుందన్నారు. చంద్రబాబు దృష్టికి సమస్యను తీసుకెళ్లి, పనికి తగిన వేతనం మంజూరు చేయిస్తామన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ నాయకులు జి.మల్లేశ్వరి, పి.సుబాషిణి, నాగరాజకుమారి, రామసుబ్బమ్మ, అరుణ, సునీత, తలపాటి సుబ్బమ్మ, సుజాత, విజయలక్ష్మి, రూత్‌మేరి, రామకుమారి, తిరుపాలమ్మ, పాల్గొన్నారు. మూడు మండలాల నుంచి 250 మందికిపైగా అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు.

గిద్దలూరు టౌన్‌ : నెల రోజులుగా సమ్మె నిర్వహిస్తున్న అంగన్‌వాడి కార్యకర్తలకు స్థానిక టీడీపీ నాయకులు గురువారం మధ్యాహ్నం భోజన ఏర్పాట్లు చేశారు. టీడీపీ ఇన్‌చార్జ్‌ ముత్తుముల అశోక్‌రెడ్డి ఆదేశాల మేరకు పట్టణ పార్టీ అధ్యక్షులు సయ్యద్‌ షాన్షావలి, షేక్‌ మగ్బుల్‌, ఉలాపు బాలచెన్నయ్య, షేక్‌ మమహ్మద్‌ జానీలు ఆధ్వర్యంలో రెవెన్యూ కార్యాలయం ఆవరణలో భోజన ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు షేక్‌ పెద్దభాషా, పోలేపల్లి కిశోర్‌, వేములపాటి చంటి, తదితరులు పాల్గొన్నారు.

సమస్య పరిష్కరించే వరకు పోరాటం

పొదిలి : సమస్య పరిష్కరించే వరకు తమ పోరాటం జరుగుతుందని అంగన్‌వాడీ కార్యకర్తలు ఖరాకండీగా చెబుతున్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని గత నెలరోజులుగా చేస్తున్న నిరసనను ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని విమర్శించారు. సమ్మెకు పరిష్కారమార్గం చూపాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు. తక్షణమే ఎస్మా జీవోను వెనక్కు తీసుకొని తమ సమస్యలు పరిష్కరించాలన్నారు. కనీస వేతనం 26వేలు అమలు చేయాలని, సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Jan 12 , 2024 | 01:17 AM