Share News

ఇంటి దొంగలే స్కెచ్‌ వేశారు!

ABN , Publish Date - Apr 20 , 2024 | 01:15 AM

నగరంలో పట్టపగలు సీఎంఎస్‌ (క్యాష్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌) వాహ నంలో రూ.66లక్షల చోరీ కేసును 20 గంటల్లోనే పోలీసులు ఛేదించారు.

ఇంటి దొంగలే స్కెచ్‌ వేశారు!
స్వాధీనం చేసుకున్న నగదును పరిశీలిస్తున్న ఎస్పీ సుమిత్‌

ఇంటి దొంగలే స్కెచ్‌ వేశారు!

సీఎంఎస్‌ వాహనంలో రూ.66లక్షలు చోరీ

కేసును 20 గంటల్లో ఛేదించిన పోలీసులు

ముగ్గురు అరెస్టు.. మొత్తం డబ్బు స్వాధీనం

నిందితుల్లో ఒకరు సంస్థ మాజీ డ్రైవర్‌, మరో ఇద్దరు అక్కడి ఉద్యోగులు

వివరాలను వెల్లడించిన ఎస్పీ సుమిత్‌

ఒంగోలు (క్రైం), ఏప్రిల్‌ 19 : నగరంలో పట్టపగలు సీఎంఎస్‌ (క్యాష్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌) వాహ నంలో రూ.66లక్షల చోరీ కేసును 20 గంటల్లోనే పోలీసులు ఛేదించారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వారిలో ఒకరు సీఎంఎస్‌లో పనిచేస్తూ మూడు రోజుల క్రితం రాజీనామా చేసిన డ్రైవర్‌ కాగా, మరో ఇద్దరు అందులో పనిచేసే ఉద్యోగులు. వివరాలను ఎస్పీ గరుడ సుమిత్‌ సునీల్‌ శుక్రవారం వెల్లడించారు. ఆయన కథనం మేరకు.. సీఎంఎస్‌ సంస్థ సిబ్బంది గురువారం ఒంగోలులోని పలు బ్యాంకుల నుంచి రూ.68 లక్షలు తీసుకొని వాటికి సంబంధించిన ఏటీఎంలలో పెట్టేందుకు వాహనంలో బయల్దేరారు. కర్నూలు రోడ్డులోని ఇండియన్‌ పెట్రోల్‌ బంకు వద్ద ఉన్న పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ ఏటీఎం వద్ద గదిలో సిబ్బంది భోజనం చేసేందుకు వాహనం నిలిపారు. భోజనం అనంతరం వారు వచ్చి చూడగా వాహనం డోర్లు తెరిచినట్లు అనుమానం వచ్చింది. లోపలికి వెళ్లి చూడగా నగదు ఉన్న బాక్స్‌కు తాళం వేసి ఉంది. కానీ అందులో ఉన్న రూ.66లక్షలు మాత్రం మాయమైంది. మిగిలిన రెండు లక్షలు ఉంది. ఈమేరకు సీఎంఎస్‌ మేనేజర్‌ గుజ్జుల వెంకట కొండారెడ్డి ఫిర్యాదు చేయడంతో తాలుకా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

సీసీ ఫుటేజీ ఆధారంగా ప్రధాన నిందితుడి గుర్తింపు

సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు కేసును ఛేదించారు. సిబ్బంది భోజనం కోసం సీఎంఎస్‌ వాహనం నిలిపిన ప్రాంతం పక్కన గోడ దూకి ఓ వ్యక్తి రావడం సీసీ కెమెరాలో దొరికింది. దీంతో అతను ఎవరు అని ఆరా తీశారు. అతను అదే సంస్థలో డ్రైవర్‌గా పనిచేస్తూ మూడు రోజుల క్రితం రాజీనామా చేసిన మహేష్‌ అని తేలింది. వెంటనే అతని కోసం గాలింపు చేపట్టారు. పేర్నమిట్ట సమీపంలోని ఎన్‌ఎస్పీ కాలువ వద్ద ఆయన్ను అరెస్టు చేసి రూ.66లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

మాజీ డ్రైవర్‌కు మరో ఇద్దరు సహకారం

నగదు చోరీకి సీఎంఎస్‌ సంస్థలో పనిచేసే కొంత మంది కలిసి ప్రణాళిక రూపొందించారు. ఆ ప్రకారం ప్రధాన నిందితుడైన సంతనూతలపాడు మండలం కామేపల్లివారిపాలెంనకు చెందిన సన్నమూరి మహేష్‌బాబు మూడు రోజుల క్రితమే సంస్థలో ఉద్యోగానికి రాజీనామా చేశాడు. వాహనంలో నగదు ఉంచే పెట్టెకు మారు తాళం తయారు చేసేందుకు అక్కడ మేనేజర్‌గా పనిచేస్తున్న నగరంలోని శివప్రసాద్‌ కాలనీకి చెందిన గుజ్జుల వెంకట కొండారెడ్డి, కామేపల్లివారిపాలెంనకు చెందిన కస్టోడియన్‌ రాచర్ల రాజశేఖర్‌ సహకరించారు. దీంతో ముగ్గురినీ పోలీసులు అరెస్టు చేశారు. వాహనంలో ఉన్న సిబ్బందికి కూడా ఏదైనా సంబంధం ఉందా? అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. నగదు రవాణాకు సంబంధించిన లోపాలపై హోం సెక్రటరికీ నివేదిక పంపనున్నట్లు ఎస్పీ చెప్పారు.

పోలీసులను అభినందించిన ఎస్పీ

చోరీ కేసును 20 గంటల్లో ఛేదించిన పోలీసులను ఎస్పీ అభినందించారు. అద నపు ఎస్పీ క్రైమ్స్‌ ఎస్‌.వి.శ్రీధర్‌రావు, ఒంగో లు డీఎస్పీ కిషోర్‌బాబు, తాలూకా సీఐ భక్తవత్సలరెడ్డి, సీసీఎస్‌ సీఐ టి.విజయకృష్ణ, సైబర్‌ సెల్‌ సీఐ సూర్యనారాయణ, ఎస్సైలు పున్నారావు, విజయ్‌కుమార్‌, మహేష్‌, ఏఎస్సెలు టి.బాలాంజనేయులు, నాగేశ్వరరావు, సురేష్‌బాబు, రమేష్‌బాబు, హెడ్‌కానిస్టేబుళ్లు రామకృష్ణ, రాంబాబు, ఖాజావలి, కానిస్టేబుళ్లు రవికుమార్‌, నాగేశ్వరరావు, హనోక్‌, శ్రీనివాసులు, శ్రీనివాసరావు, రత్తయ్య, హోంగార్డులు శేషగిరిలకు రివార్డులను అందజేశారు.

Updated Date - Apr 20 , 2024 | 01:15 AM