Share News

నగరానికి పూర్వ వైభవం

ABN , Publish Date - Jun 11 , 2024 | 12:47 AM

అభివృద్ధిలో ఒంగోలు నగరానికి పూర్వ వైభవం తీసుకురావాలని, అందుకోసం అవసరమైన చర్యలు వేగవంతం చేయాలని, అభివృద్ధికి అవసరమైన ప్రతిపాదనలు తయారు చేయాలని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ మునిసిపల్‌ అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన దామచర్ల తన నివాసంలో తొలి సమావేశం కార్పొరేషన్‌ అధికారులతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇప్పటివరకు నగరంలో జరిగిన అభివృద్ధి పనుల పురోగతి, పెండింగ్‌ పనులపై సమీక్షించారు.

 నగరానికి పూర్వ వైభవం

టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి మళ్లీ కనిపించాలి

తాగునీరు, పారిశుధ్యం మెరుగుపై ప్రత్యేక దృష్టి

ఒంగోలు (కార్పొరేషన్‌), జూన్‌ 10 : అభివృద్ధిలో ఒంగోలు నగరానికి పూర్వ వైభవం తీసుకురావాలని, అందుకోసం అవసరమైన చర్యలు వేగవంతం చేయాలని, అభివృద్ధికి అవసరమైన ప్రతిపాదనలు తయారు చేయాలని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ మునిసిపల్‌ అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన దామచర్ల తన నివాసంలో తొలి సమావేశం కార్పొరేషన్‌ అధికారులతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇప్పటివరకు నగరంలో జరిగిన అభివృద్ధి పనుల పురోగతి, పెండింగ్‌ పనులపై సమీక్షించారు. ముఖ్యంగా నగర ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడకూడదని సూచించారు. గుండ్లకమ్మ నుంచి ఒంగోలుకు తాగునీరు సరఫరా పనుల గురించి అడిగి తెలుసుకున్న ఆయన ఇటీవల కాలంలో తాగునీటి కోసం మంజూరు అయిన రూ. 339 కోట్లతో చేపట్టిన పనుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రతిపాదించిన పనులు వేగవంతం చేయలన్నారు.నగరంలో తాగునీటికి సమస్య లేకుండా చూడాలని, లీకుల నియంత్రణతోపాటు, శివారు కాలనీల ప్రజలు అవస్థలు పడకుండా సకాలంలో తాగునీరు అందించాలని ఆదేశించారు. అస్తవ్యస్తంగా ఉన్న నీటి సరఫరా విధానికి స్వస్తి పలకాలని, అలాగే సకాలంలో తాగునీరు అందించాలని ఆదేశించారు. అలాగే నగర అభివృద్ధి కోసం చేపట్టిన పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. తెలుగుదేశం పార్టీ హాయాలోనే ఒంగోలు నియోజకవర్గం అభివృద్ధి జరిగిందని, ఆ నమ్మకాన్ని ప్రజల్లో నిలబెట్టాలన్నారు. అందుకు అవసరమైన నిధుల మంజూరు విషయంతో తాను ప్రభుత్వంతో మాట్లాడతానని దామచర్ల తెలిపారు. అభివృద్ధిలో రాజీ పడేది లేదని, అందుకు అనుగుణంగా అధికారులు మరింత కష్టపడి పనిచేయాలన్నారు. త్వరలోనే మరోసారి సమావేశం నిర్వహిస్తానని, పూర్తినివేదికలు సిద్ధం చేయాలని దామచర్ల తెలిపారు. ఇదిలా ఉండగా, నగరంలో పారిశుధ్యం అస్తవ్యస్తంగా ఉందన్నారు. త్వరితగతిన పారిశుధ్యం మెరుగునకు చర్యలు చేపట్టాలని, ప్రజల నుంచి ఫిర్యాదులు రాకూడదని ఆదేశించారు. రోడ్లపై చెత్తలేకుండా చూడాలని, ఇంటింటి చెత్త సేకరణ రోజూ చేపట్టాలన్నారు. అలాగే రెవెన్యూ సిబ్బందితో మాట్లాడుతూ ఇంటి పన్నుల విధింపుల్లో అడ్డగోలు వ్యవహారాలకు తావులేకుండా పారదర్శకంగా ఉండాలన్నారు. సమష్టి కృషితో నగరాన్ని అభివృద్ధివైపు నడిపించడానికి అందరు సహకరించాలని, గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నపుడు, తెలుగుదేశం హయాంలో జరిగిన విధంగా అభివృద్ధిలో పూర్వ వైభవం తీసుకురావాలి ఆదేశించారు. సమావేశంలో కమిషనరు ఎం.జశ్వంత్‌రావు, మునిసిపల్‌ ఇంజనీర్‌ జానీబాషా, డీఈలు గణపతి, పద్మజ, ఆర్‌వో మధుబాబు, ఆర్‌ఐలు శ్రీనాఽథ్‌, అమ్మిరెడ్డి, మిరియాల శ్రీను, సాయి, సుస్మిత, సుజాతతోపాటు ఇతర ఇంజనీరింగ్‌, రెవెన్యూ, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jun 11 , 2024 | 12:48 AM