Share News

బాల్య వివాహాలపై సమరం

ABN , Publish Date - Nov 19 , 2024 | 01:40 AM

జిల్లాలో బాల్య వివాహాలపై యంత్రాంగం సమరభేరి మోగించింది. నియంత్రణకు అందరినీ చైతన్యవంతం చేస్తోంది. ఆ మేరకు కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా చొరవతో ‘బంగారు బాల్యం’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. అధికారులంతా కదిలారు.

బాల్య వివాహాలపై సమరం
చదలవాడలో అధికారులు, మహిళలతో ప్రతిజ్ఞ చేయిస్తున్న కలెక్టర్‌

నినదించిన ప్రభుత్వ యంత్రాంగం

బంగారు బాల్యం పేరుతో

జిల్లావ్యాప్తంగా ప్రజాచైతన్య కార్యక్రమాలు

ఉత్సాహంగా వారోత్సవాలు

ఒకేరోజు అన్ని గ్రామాల్లో అవగాహన సదస్సులు

రేపు ఒంగోలులో ముగింపు సభ

అనంతరం మరిన్ని కార్యక్రమాలపై కలెక్టర్‌ దృష్టి

బాలికల విద్య, ఆరోగ్యం పెంపు, హక్కుల రక్షణ లక్ష్యం

జిల్లాలో బాల్య వివాహాలపై యంత్రాంగం సమరభేరి మోగించింది. నియంత్రణకు అందరినీ చైతన్యవంతం చేస్తోంది. ఆ మేరకు కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా చొరవతో ‘బంగారు బాల్యం’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. అధికారులంతా కదిలారు. క్షేత్రస్థాయిలోని వివిధ విభాగాల ఉద్యోగులు ప్రజా చైతన్య కార్యక్రమాలను చేపడుతున్నారు. ఈనెల 14 నుంచి 20 వరకూ ఇందుకోసం జిల్లావ్యాప్తంగా వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా బాల్యవివాహాల నిర్మూలన కోసం సోమవారం ఒకే రోజున జిల్లాలోని అన్ని గ్రామాల్లోనూ ప్రత్యేకంగా ప్రజలకు అవగాహన సదస్సులతోపాటు విద్యార్థులకు వివిధ రకాల పోటీలను నిర్వహించారు.

ఒంగోలు, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): బాల్య వివాహాల రహిత జిల్లా సాధనే లక్ష్యంగా ప్రభుత్వ యంత్రాంగం కార్యాచరణ చేపట్టింది. అందులో భాగంగా సోమవారం గ్రామాల్లో భారీఎత్తున అవగాహన కార్యక్రమాలను అధికారులు చేపట్టారు. వివరాల్లోకి వెళితే.. దేశంలో బాల్య వివాహాలు అధికంగా ఉన్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్‌ ద్వితీయ స్థానంలో ఉండగా రాష్ట్రంలో రెండో స్థానంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా ఉంది. ఏటా 37శాతం బాలికలకు 18 ఏళ్లు నిండకముందే వివాహాలు చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు బాల్య వివాహాలను దురాచారంగా ప్రకటించి యంత్రాంగం, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ పెద్దగా మార్పు ఉండటం లేదు. ప్రజల్లో అవగాహనా రాహిత్యం, ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రం, చదువు భారం అన్న భావన తల్లిదండ్రులలో ఉండటం వంటి కారణాలతో ఈ వివాహాలు అధికంగా సాగుతు న్నాయి. దీంతో చదువుతో బంగారు భవిష్యత్‌కు బాటలు పడాల్సిన వయస్సులో బాలికల మెడల్లో పుస్తెల తాడులు పడుతూ కుటుంబ వ్యవస్థలోకి రావాల్సి వస్తోంది. అలాంటి వారిలో 19 ఏళ్లలోపే ఎక్కువ మంది గర్భం దాల్చుతున్నారు. దీంతో అనేక శారీరక, మానసిక సమస్యలు వస్తున్నాయి. పౌష్టికా హార లోపం, రక్తహీనత చోటుచేసుకొని తక్కువ వయస్సులోనే మరణాలు, దీర్ఘకాలం అనారోగ్య సమస్యలతో అల్లాడటం సర్వసాధారణమైంది. బాల్య వివాహాల నిరోధానికి ప్రభుత్వం చట్టాలు చేసినా పెద్దగా అరికట్టలేకపోతున్నారు. అడపాదడపా నిలువరిస్తున్నా అధికశాతం పెళ్లిళ్లు జరుగుతూనే ఉన్నాయి.

కలెక్టర్‌ అన్సారియా ప్రత్యేక దృష్టి

జిల్లాలో ఏటా పెద్దసంఖ్యలో బాల్య వివాహాలు జరుగుతున్నాయి. గత ఐదేళ్లలో ఐసీడీఎస్‌, ఇతర శాఖలు, పోలీసులు కేవలం 347 వివాహాలను మాత్రమే అడ్డుకోగలిగారు. ఇటీవల దేశంలో బాల్యవివాహాల నిర్మూలనకు చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు కూడా మార్గదర్శకాలు ఇచ్చింది. అదేసమయంలో జిల్లాలో బాల్య వివాహాల సమస్యపై కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా ఇక్కడ బాధ్యతలు చేపట్టిన కొద్దిరోజులకే అవగాహనకు వచ్చారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ వైద్యశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల పరిశీలన సమయంలో వీటిని ప్రధానంగా గుర్తించారు. సంబంధిత అధికారులతో సమీక్షల సమయంలో బాల్య వివాహాలు, వాటి వల్ల అనర్థాల తీవ్రతను గుర్తించి మొత్తం యంత్రాంగాన్ని సమాయత్తం చేసి ఈ దురాచారంపై సమరం చేయాలన్న నిర్ణయానికి వచ్చారు.

బంగారు బాల్యం పేరుతో..

ప్రధానంగా బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాలతోపాటు బాలికల విద్య, ఆరోగ్యంతోపాటు హక్కులపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని భావించిన కలెక్టర్‌ బంగారు బాల్యం పేరుతో ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తొలుత జిల్లా నుంచి మండల స్థాయి అధికారుల వరకూ అందరూ దీనిపై దృష్టిసారించేలా రెండునెలల క్రితం ఒంగోలులో భారీ సదస్సు నిర్వహించారు. ప్రముఖ బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాస్‌ సత్యర్థి, జిల్లాకు చెందిన మంత్రి డాక్టర్‌ స్వామిలు అందులో పాల్గొన్నారు. అనంతరం కనీసం ఏడాదిపాటు ప్రజా చైతన్య కార్యక్రమాలు వివిధ రూపాలలో నిర్వహించాలని భావించిన కలెక్టర్‌ బాలల దినోత్సవం సందర్భంగా బంగారు బాల్యం పేరుతో ఈనెల 14 నుంచి 20 వరకు వారోత్సవాలకు శ్రీకారం చుట్టారు. తొలిరోజు జిల్లావ్యాప్తంగా ర్యాలీలు చేపట్టారు. అనంతరం రోజుకు ఒకరకమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వారంపాటు గ్రామ, మండల, డివిజన్‌ స్థాయిలో వివిధ రకాల పోటీలు నిర్వహిస్తున్నారు. జిల్లాస్థాయిలో వారోత్సవాల ముగింపు సభను ఒంగోలు మినీ స్టేడియంలో భారీగా ఏర్పాటు చేసి విజేతలకు బహుమతులు ఇవ్వనున్నారు.


చదలవాడలో పాల్గొన్న కలెక్టర్‌

వారోత్సవాల నిర్వహణలో భాగంగా సోమవారం జిల్లావ్యాప్తంగా అన్ని గ్రామాల్లో వివిధ వర్గాల ప్రజలతో అవగాహన సదస్సులు నిర్వహించారు. నాగులుప్పలపాడు మండలం చదలవాడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్‌ అన్సారియా పాల్గొన్నారు. మొత్తం 38 మండలాల్లో ఆయా మండలాలకు స్పెషల్‌ ఆఫీసర్లు అయిన జిల్లా అధికారులు, గ్రామాల్లో పలువురు మండలస్థాయి అధికారులు పాల్గొన్నారు. వారోత్సవాల అనంతరం నిరంతర పర్యవేక్షణ కార్యక్రమాలు కొనసాగించేలా వివిధ స్థాయిల్లోని అధికారులతో గ్రామ, మండల, డివిజన్‌, జిల్లాస్థాయి టాస్క్‌ఫోర్స్‌ కమిటీలను కలెక్టర్‌ ఏర్పాటు చేశారు. ప్రతినెలా ఒక్కో స్థాయిలోని కమిటీ ఒక శుక్రవారం ఈ అంశంపై సమావేశం నిర్వహించేలా ఆదేశించారు. అలాగే ఒక్కో డివిజన్‌కు ఒక మండలాన్ని ఎంపిక చేసి అందులోని అన్ని గ్రామాలు చైల్డ్‌ఫ్రెండ్లీ గ్రామాలుగా మార్పు చెందేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు.

Updated Date - Nov 19 , 2024 | 01:40 AM