Share News

నేటితో తేలనన్న భవితవ్యం

ABN , Publish Date - Jun 03 , 2024 | 11:16 PM

గిద్దలూరు బాద్‌షా ఎవరో నేడు తేలనుంది. అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి.

నేటితో తేలనన్న భవితవ్యం

గిద్దలూరు, జూన్‌ 3 : గిద్దలూరు బాద్‌షా ఎవరో నేడు తేలనుంది. అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. రౌండ్‌కు 14 టేబుళ్లతో కౌంటింగ్‌ ప్రారంభం కానుండగా మొత్తం 21 రౌండ్లలో గిద్దలూరు నూతన ఎమ్మెల్యే ఎవరనేది తెలియనున్నది. నియోజక వర్గంలో మొత్తం 2,39,710 మంది ఓటర్లు ఉండగా ఇందులో 2,02,397 మంది 284 పోలింగ్‌ కేంద్రాలలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. హోం ఓటింగ్‌, ఉద్యోగుల పోస్టల్‌ బ్యాలెట్లతో కలిపి ఇందులో 3,550 మంది ఓట్లు ఇమిడి ఉన్నాయి. ఇవి కాకుండా మిలటరీ సర్వీసులో పనిచేసే ఉద్యోగుల ఓట్లు అదనంగా పోలయ్యాయి. 21 రౌండ్లలో ఒంగోలులోని రైజ్‌ ఇంజనీరింగ్‌ కళాశాల ఆవరణలో కౌంటింగ్‌ ప్రక్రియ పూర్తికానున్నది. 21 మంది అభ్యర్థులు బరిలో ఉన్న విషయం తెలిసిందే. టీడీపీ అభ్యర్థిగా ముత్తుముల అశోక్‌రెడ్డి, బహుజన్‌ సమాజ్‌వాజ్‌ పార్టీ అభ్యర్థిగా ఇసుకల జయరాజ్‌, వైసీపీ అభ్యర్థిగా కుందురు నాగార్జునరెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థిగా పగడాల పెద్దరంగస్వామి, తెలుగు రాజ్యాధికార సమితి అభ్యర్థిగా చింతా శ్యాంసన్‌, పిరమిడ్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా అభ్యర్థిగా జవ్వాజి పవన్‌కుమార్‌, లిబరేషన్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా జానావత్‌ ఠాకూర్‌నాయక్‌, జైభీమ్‌రావ్‌ భారత్‌ పార్టీ అభ్యర్థిగా దాసరి బాబూరావు, స్వతంత్ర అభ్యర్థులు గా కొప్పుల నరసింహులు, టి.కోటేశ్వర్‌రెడ్డి, పరిసనేని వెంకటేశ్వర్లు, పిడతల రమేష్‌రెడ్డి, బట్టపోతుల ఓబులేసు, బాలసాని మాల్యాద్రిరెడ్డి, బొంతా రంగారెడ్డి, బొర్రా రాఘవేంద్రయాదవ్‌, మీనిగ మురళిమోహన్‌రెడ్డి, ముడియం వెంకటరామిరెడ్డి, ఎం.లక్ష్మీరామనాయక్‌, వరికుంట్ల ప్రసాద్‌, వీరంరెడ్డి ఉషారాణి అసెంబ్లీ బరిలో నిలిచారు. ప్రధానంగా టీడీపీ, వైసీపీ అభ్యర్థులైన ముత్తుముల అశోక్‌రెడ్డి, కుందురు నాగార్జునరెడ్డిల మధ్యనే పోటీ జరిగింది. కాంగ్రెస్‌ అభ్యర్థి పగడాల పెద్దరంగస్వామి నియోజకవర్గంలోని చాలా ప్రాంతాలలో ప్రచారం చేసినప్పటికీ పోటీ నామమాత్రమే. మిగతా అభ్యర్థుల పోటీ నామమాత్రం కావడంతో టీడీపీ, వైసీపీ మధ్యనే ప్రధానపోటీ నెలకొన్నది.

ఎవరు గెలిచినా రెండవసారి

గిద్దలూరు అసెంబ్లీ బరిలో ప్రధానంగా పోటీలో ఉన్న టీడీపీ, వైసీపీ అభ్యర్థులు ముత్తుముల అశోక్‌రెడ్డి, కుందురు నాగార్జునరెడ్డి ఇప్పటివరకు ఒక్కొక్కసారి ఎమ్మెల్యేగా పని చేశారు. అశోక్‌రెడ్డి గిద్దలూరు ఎమ్మె ల్యేగా గెలుపొందగా, కుందురు నాగార్జునరెడ్డి మార్కాపురం ఎమ్మెల్యేగా ఎన్నికైన విషయం తెలిసిందే. వీరిరువురు కేవలం ఒక్కొక్క పర్యాయం మాత్రమే ఎమ్మెల్యేగా గెలుపొందగా ప్రస్తుతం ఎవరు గెలిచినా రెండవసారి ఎమ్మెల్యేగా గెలిచినట్లు అవుతుంది.

టేబుల్స్‌ ఇవే

ఒంగోలులోని రైజ్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో గిద్దలూరు అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్‌ జరుగనుండగా తొలుత అర్థవీడు మండలం నుంచి కౌంటింగ్‌ ప్రారంభమువుతోంది. 1వ బూత్‌ నుంచి 29వ బూత్‌ వరకు అర్థవీడు మండలంలో ఉండగా తొలి రెండు రౌండ్లు అర్థవీడు మండల ఫలితం వెలువడుతుంది. ఆ తరువాత 30 నుంచి 74వ నంబరు వరకు ఉన్న కంభం మండలం, 75 నుంచి 129వ నంబరు వరకు ఉన్న బేస్తవారపేట మండలం, 130 నుంచి 164వ నంబరు వరకు ఉన్న రాచర్ల మండలం, 165 నుంచి 243వ నంబరు వరకు ఉన్న గిద్దలూరు రూరల్‌, అర్బన్‌, 244 నుంచి 284వ నంబరు బూతు వరకు కొమరోలు మండలం ఫలితాలు వెలువడనున్నాయి. అంటే తొలుత అర్థవీడు, తరువాత కంభం, బేస్తవారపేట, రాచర్ల, గిద్దలూరు చివరగా కొమరోలు మండల పోలింగ్‌ బూతుల వివరాలు వెల్లడికానున్నాయి.

విజయం ఎవరిని వరిస్తుందో..!

ఎర్రగొండపాలెం, జూన్‌ 3 : ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ స్థానికంగా నెలకొంది. గెలుపుపై ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీలు ధీమాగా ఉన్నాయి. నియోజకవర్గంలో 2,07,214 ఓట్లు ఉండగా, 1,85,242 ఓట్లు పోలయ్యాయి. 89.40 శా తం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఓట్లను మొత్తం 19 రౌండ్లలో లెక్కించనున్నారు. పోస్టల్‌ ఓట్లు కూడా 1500 పైనే ఉన్నాయి.

ఈ నియోజకవర్గంలో గెలుపుపై ఎవరికి వారే ధీమాగా ఉన్నారు. ఇక ఈ పర్యాయం ప్రభుత్వ వ్యతిరేకత సామన్య ఓటరు నుంచి కనిపిస్తోందని, ప్రస్తుతం గిరిజనులు కూడా టీడీపీకే మొగ్గు చూపారని తన గెలుపు తథ్యం అని టీడీపీ ఇన్‌చార్జ్‌ ఎరిక్షన్‌బాబు పేర్కొంటున్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు, తాము పడినకష్టానికి విజయం తమనే వరిస్తుందని ఎరిక్షన్‌బాబు ధీమాగా ఉన్నారు. 6500 ఓట్ల మెజార్టీతో విజయం సాధిస్తానని చెబుతున్నారు. టీడీపీ పార్టీనాయకులు, కార్యకర్తలు ఈ పర్యాయం విజయం తమదే అని ఉత్సాహంగా ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేకత, పోస్టల్‌ ఓట్లు, బీసీ ఓటర్లు ఈ పర్యాయం టీడీపీకే మొగ్గు చూపారని ఎరిక్షన్‌బాబు తెలిపారు.

ఎర్రగొండపాలెం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచిన తాటిపర్తి చంద్రశేఖర్‌ నియోజకవర్గానికి మూడు నెలల క్రితమే వచ్చినప్పటికీ, వైసీపీకి ఉన్న బలమైన ఓటు బ్యాంకు ఈ పర్యాయం తనకు గెలుపును తెచ్చి పెడుతుందని ఆయన పేర్కొంటున్నారు. పోల్‌మేనేజ్‌మెంట్‌, నాయకులతో సమన్వయం చేసుకోవడం తమకు కలిసి వస్తుందన్నారు. తనకు 10 వేల వరకు మెజారిటీ వస్తుందని అంచనా వేస్తున్నారు. గెలుపుపై ఎవరికి వారు ధీమాగా ఉన్నప్పటికీ, ఫలితాలపై ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

విజేత ఎవరో... తేలేది నేడే

మార్కాపురం : సార్వత్రిక ఎన్నికలలో మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గ విజేత ఎవరో మంగళవారం తేలనుంది. పోలింగ్‌ ముగిసిన అనంతరం ఎవరి అంచనాలలో వారున్నప్పటికీ, టీడీపీ, వైసీసీ అభ్యర్థులు కౌటింగ్‌ తేదీ దగ్గర పడే కొద్ది కనిపించిన దేవుళ్లను మొక్కే పనిలో పడ్డారు. కౌటింగ్‌ తేదీ జూన్‌ 4 రావడంతో పోటీలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కౌటింగ్‌ కేంద్రంలో అనుసరంచాల్సిన వ్యూహాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తమ పార్టీ ఏజెంట్లకు సుశిక్షుతులను చేసి మంగళ వారం జరుగనున్న ఒంగోలుకు సోమ వారం మధ్యాహ్నం నుంచే తరలివెళ్లారు.

14 టేబుళ్లు... 19 రౌండ్లు

మార్కాపురం నియోజకవర్గంలోని మార్కాపురం మున్సిపాలిటీ, మండలం, తర్లుపాడు, కొనకనమిట్ల, పొదిలి నగర పంచాయతీ, మండలాలలో 257 పోలింగ్‌ కేంద్రాలలో 2,14,608 ఓట్లకు గాను 1,87,952 ఓట్లు పోలయ్యాయి. వాటి లెక్కింపునకు ఒంగోలు రైజ్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓట్లు లెక్కించేందుకు 14 టేబుళ్లను ఏర్పాటు చేశారు. వాటిపై 19 రౌండ్లలో 257 పోలింగ్‌ కేంద్రాలకు సంబంధించిన లెక్కింపు జరుగుతుంది.

సాయంత్రం 4 గంటలకు ఫలితాలు

మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఏ పార్టీ అభ్యర్థికి ఎంత మెజార్జీ వచ్చిందో తెలిపే స్పష్టమైన ఫలితాలను అధికారులు సాయంత్రం 4 గంటలకు ప్రకటించే అవకాశం ఉంది. మంగళవారం ఉదయం 8 గంటలకు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపును 4 టేబుళ్ల మీద అధికారులు ప్రారంభిస్తారు. 8.30 గంటలకు ఈవీఎంల ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. ఒక రౌండ్‌లో 14 ఈవీఎంలలో ఓట్ల లెక్కింపుకు 25 నిమిషాల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు. దీనిని బట్టి 19 రౌండ్ల ఓట్ల లెక్కింపుకు సుమారు 8 గంటల సమయం పడుతుంది. అంటే తుది ఫలితాలు సాయంత్రం 4 గంటలకు వెలువడనున్నాయి.

Updated Date - Jun 03 , 2024 | 11:16 PM