Share News

అరాచక పాలనకు రోజులు దగ్గరపడ్డాయి..

ABN , Publish Date - Apr 26 , 2024 | 11:22 PM

వైసీపీ అరాచక, అసమర్థ పాలనకు రోజులు దగ్గరపడ్డాయని టీడీపీ కూటమి అభ్యర్థి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. మండలంలోని చెరువుకొమ్ముపాలెం, తూర్పువీరాయపాలెం, బొట్లపాలెం, పాపిరెడ్డిపాలెం గ్రామాల్లో శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు, యువకులు ఆమెకు ఘనస్వాగతం పలికారు.

అరాచక పాలనకు రోజులు దగ్గరపడ్డాయి..
గజమాలతో టీడీపీ కూటమి అభ్యర్థి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మికి స్వాగతం పలుకుతున్న చెరువుకొమ్ముపాలెం గ్రామస్థులు

మహిళా శక్తి టీడీపీ కూటమిని గెలిపిస్తుంది

దర్శి అభ్యర్థి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి

దర్శి, ఏప్రిల్‌ 26: వైసీపీ అరాచక, అసమర్థ పాలనకు రోజులు దగ్గరపడ్డాయని టీడీపీ కూటమి అభ్యర్థి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. మండలంలోని చెరువుకొమ్ముపాలెం, తూర్పువీరాయపాలెం, బొట్లపాలెం, పాపిరెడ్డిపాలెం గ్రామాల్లో శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు, యువకులు ఆమెకు ఘనస్వాగతం పలికారు. చెరువుకొమ్ముపాలెంలో గజమాలతో సత్కరించారు. హారతులిచ్చి పూలవర్షం కురిపించారు. తూర్పువీరాయపాలెంలో వందలాది మంది మహిళలు పసుపురంగు వస్ర్తాలు ధరించి, టీడీపీ జెండాలు చేతపట్టి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో మహిళా శక్తి టీడీపీ కూటమిని గెలుపిస్తుందని చెప్పారు. ఎక్కడకు వెళ్లినా మహిళలు అధికసంఖ్యలో తనకు ఆదరణ చూపుతున్నారన్నారు. చంద్రబాబు నాయకత్వంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే విషయం ప్రజలు గుర్తించారన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు చిట్టే వెంకటేశ్వర్లు, మాజీ అధ్యక్షుడు బొట్లా కోటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

టీడీపీలో పలువురు చేరిక

కురిచేడు : కురిచేడు మండలంలోని పలు గ్రామాలకు చెందినవారు శుక్రవారం తెలుగుదేశం పార్టీలో చేరారు. పడమర గంగవరం, పడమర నాయుడుపాలెం, కురిచేడు వాల్మీకి బజారులోని వారు కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి భర్త లలిత్‌ సాగర్‌ సమక్షంలో పార్టీలో చేరారు. పడమర నాయడుపాలెం గ్రామాకి చెందిన గడ్డం శ్రీను, మరికొంతమంది గడ్డం బాలయ్య ఆధ్వర్యంలో చేరారు. పడమరగంగవరం గ్రామంలో టీడీపీ నాయకుడు దాసరి ఏడుకొండలు ఆధ్వర్యంలో పలువురు పార్టీలో చేరారు. కురిచేడు వాల్మీకి బజారుకు చెందిన పార్టీ సీనియర్‌ నాయకులు బొనిగల అంకయ్య ఆధ్వర్యంలో పలువురు చేరారు. పార్టీలో చేరిన వారిలో అనకొండ చిన్నవెంకయ్య, ఆదినారాయణ, నల్లబోతుల నాగయ్య, రవి, బొనిగల గోపి, నల్లబోతుల నరసింహులు, తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు పిడతల నెమిలయ్య, కాట్రాజు నాగరాజు, డాక్టర్‌ సునీల్‌, ఫౌండ్రి సుభాని, కమతం నాగిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ఎంపీటీసీతో సహా పలువురు చేరిక

దర్శి : టీడీపీలోకి వలసల పర్వం కొనసాగుతుంది. తాజాగా మండలంలోని రాజంపల్లి ఎంపీటీసీ గొర్ల వీరయ్యతో పాటు మరో పది కుటుంబాలు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. టీడీపీ కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మీ భర్త లలిత్‌సాగర్‌ వారికి పార్టీ కండవాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. మాజీ ఎంపీపీ ఫణిదపు వెంకటరామయ్య ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. కార్యక్రమంలో మాజీ సొసైటీ అధ్యక్షుడు వజ్జా శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

జడ్పీచైర్‌పర్సన్‌ వెంకాయమ్మ స్వగ్రామంలో 25 కుటుంబాలు టీడీపీలో చేరిక

తాళ్లూరు : టీడీపీలో చేరికలు మండలంలో జోరందుకున్నాయి. ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి తనయుడు రాఘవరెడ్డి, కూటమి అభ్యర్థి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి భర్త లలిత్‌సాగర్‌ తాళ్లూరు మండలంపై ప్రత్యేక దృషి సారించి చేరికలు చేపట్టారు. శుక్రవారం బొద్దికూరపాడు, నాగంబొట్లపాలెం గ్రామాల్లో వారు పర్యటించారు. ఈసందర్భంగా జడ్పీ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ స్వగ్రామమైన బొద్దికూరపాడులో బీసీ పాఠశాల చైర్మన్‌ బూచిరాజు సురేంద్ర, స్కూల్‌ మాజీ చైర్మన్‌ బూచిరాజు రవి, వైసీపీ సోషల్‌ మీడియా కోకన్వీనర్‌ కావూరి చిన్న, మొలక నరసింహతో పాటు 25 కుటుంబాలు వైసీపీని వీడారు. నాగంబొట్లపాలెంలో మాజీ ఎంపీటీసీ ఎబేల్‌రాజు, మాజీ డీలర్‌ శనివారపు కోటిరెడ్డి, పెద కోటయ్యతో పాటు మరికొందరు వైసీపీని వీడారు. వీరికి టీడీపీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ పాలనలో అన్నివర్గాల ప్రజలు తీవ్రంగా నష్టపోయారన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే కూటమి ప్రభుత్వం రావాలని ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ టి.శ్రీనివాసరావు, టీడీపీ మండల అధ్యక్షుడు బి.ఓబుల్‌రెడ్డి, పోలంరెడ్డి రమణారెడ్డి, వేడికోల లక్ష్మిరెడ్డి, శాగం కొండారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 26 , 2024 | 11:22 PM