Share News

మార్పు మొదలైంది!

ABN , Publish Date - Feb 29 , 2024 | 01:27 AM

జిల్లా రాజకీయ సమీకరణల్లో పెనుమార్పులు చోటుచేసుకోనున్నాయి. అవి తెలుగుదేశం పార్టీకి బలం చేకూర్చే విధంగా కనిపిస్తున్నాయి.

మార్పు మొదలైంది!
మాగుంటను కలిసి మద్దతు తెలుపుతున్న అనుచరులు

వైసీపీకి గుడ్‌బై చెప్పిన మాగుంట కుటుంబం

మరో నాలుగు రోజుల్లో టీడీపీలో చేరిక

వారసుడిగా తెరపైకి రాఘవరెడ్డి

ఎంపీ వెంటే మేమంటున్న అనుచరనాయకత్వం

ఆగమేఘాలపై వైసీపీ ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి పేరు ప్రకటన

జిల్లా రాజకీయ సమీకరణల్లో పెనుమార్పులు చోటుచేసుకోనున్నాయి. అవి తెలుగుదేశం పార్టీకి బలం చేకూర్చే విధంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే కిందిస్థాయిలో టీడీపీ, జనసేన కూటమిలోకి వలసల పర్వం సాగుతుండగా ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి వైసీపీకి గుడ్‌బై చెప్పడంతో అవి మరింత పెరగనున్నాయి. ఈ పరిణామాలు టీడీపీలో జోష్‌ను పెంచగా, వైసీపీ శ్రేణుల్లో కలకలాన్ని సృష్టిస్తున్నాయి. జిల్లాలో ప్రభావం చూపే వారిలో మాగుంట కుటుంబం ఒకటి. ఆ కుటుంబ వారసుడిగా మాగుంట కుమారుడు రాఘవరెడ్డి ఎన్నికల సమరంలోకి రానున్నారని స్పష్టమైంది. ఇప్పటికిప్పుడు ఆయన తన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించనప్పటికీ టీడీపీలో చేరబోతున్నారని తెలిసింది. ఆపార్టీ తరపున రాఘవరెడ్డి ఒంగోలు ఎంపీగా పోటీచేయబోతున్నారు. మాగుంట నిర్ణయాన్ని ఒంగోలు లోక్‌సభ పరిధిలోని ఆయన అనుచరులు స్వాగతించడంతో రానున్న వారం పదిరోజుల్లో అనేక సరికొత్త రాజకీయ పరిణామాలు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది.

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

వైసీపీలో అనేక అవమానాలను దిగమింగి ఓర్పుగా ఎంపీ మాగుంట ముందడుగు వేశారు. పార్టీకి రాజీనామా చేసిన బుధవారం కూడా ఆయన గౌరవం లేక బయటకు వస్తున్నానని, ఆత్మగౌరవం విషయంలో రాజీపడనని వ్యాఖ్యానించడం ద్వారా తనకు ఎదురైన అవమానాలను చెప్పకనే చెప్పారు. 2019 ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చింది మొదలు మాగుంట మాటకు జగన్‌ ఏమాత్రం విలువ ఇవ్వకపోగా అనేక విధాలుగా ఇబ్బందులకు గురిచేశారు. తొలుత ఆయన వ్యాపార లావాదేవీలపై ఆంక్షలు విధించారు. దీంతో రమారమి నాలుగేళ్లపాటు ఆంధ్రాలో మాగుంట వ్యాపారాలను నిలిపివేశారు. ఎంపీ నిధులను అవసరానికి అనుగుణంగా అభివృద్ధి పనులకు ఇస్తే వాటిని జరగకుండా కూడా అడ్డంకులు సృష్టించారు. ఒంగోలు, సూరారెడ్డిపాలెం, గిద్దలూరుల్లో రైల్వే ఓవర్‌బ్రిడ్జిల నిర్మాణానికి మాగుంట కేంద్రం నుంచి అనుమతులు తెచ్చారు. రాష్ట్రప్రభుత్వం నుంచి భూసేకరణ, ఇతర అంశాలకు ఇవ్వాల్సిన కనీస తోడ్పాటును కూడా ఇవ్వకుండా వాటికి బ్రేక్‌ వేసే ప్రయత్నం చేశారు. మెడికల్‌ కాలేజీ కోసం మాగుంట ప్రయత్నిస్తే తోచిపుచ్చి అంతా రాష్ట్రప్రభుత్వం ఘనతేనని ప్రకటించుకున్నారు. ఇక పార్టీ కార్యక్రమాలపరంగా ఎక్కడా ఆయనకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వలేదు. వ్యాపారపరంగా ఢిల్లీ వ్యవహారాల్లో కొన్ని సమస్యలు ఎదురైతే కనీసం ఏమిటని అడిగింది లేదు. ఆతర్వాత క్రమంలో ఒంగోలు ఎంపీ సీటును మాగుంటకు ఇవ్వకూడదన్న ఉద్దేశంతో జగన్‌ నడిపిన తంతు జగమెరిగిన సత్యం. వివాదాస్పద షరతులు విధించడం, ఆతర్వాత తన ఇంటి గడపనే తొక్కనివ్వొద్దని ఆదేశించడం, ఢిల్లీలో ఎదురుగా వెళ్లి పలకరిస్తే స్పందించక పోవడం, మాగుంటకు చెప్పకుండానే చెవిరెడ్డిని ఎంపీ అభ్యర్థిగా అందరికీ పరిచయం చేయడం మాగుంట ఎదుర్కొన్న సమస్యల్లో కొన్ని. అయినా బుధవారం వైసీపీకి రాజీనామా చేసే సమయంలో మాగుంట సీఎంని కానీ, ఆ పార్టీని కానీ పల్లెత్తుమాట అనకపోవడం గమనార్హం. అయితే ఆత్మగౌరవం కోసం వైసీపీని వీడుతున్నామని ఆయన చెప్పిన ఒకేఒక్క మాట మొత్తం వ్యవహారశైలిని తేటతెల్లం చేసింది.

మాగుంటకు బాసటగా అనుచరులు

జిల్లాతో 33ఏళ్ల రాజకీయ బంధం మాగుంట కుటుంబానికి ఉంది. 1991లో తొలుత సుబ్బరామిరెడ్డి పోటీచేసి అనూహ్య విజయం సాధించారు. 1995లో ఆయన హత్యకు గురికాగా 1996లో జరిగిన ఎన్నికల్లో ఆయన సతీమణి పార్వతమ్మ పోటీచేసి గెలుపొందారు. 1998 ఎన్నికలకే శ్రీనివాసులరెడ్డి రంగంలోకి వచ్చారు. అప్పటినుంచి ఇప్పటివరకు ఆరు సార్లు పోటీచేసిన ఆయన నాలుగు సార్లు విజయంసాధించారు. రాజకీయాలకతీతంగా అందరికీ మర్యాద ఇచ్చిపుచ్చుకోవడం మాగుంట ప్రత్యేకత. పైపెచ్చు 2014 నుంచి 2019 వరకు టీడీపీలో ఉన్నారు. దీంతో టీడీపీ కేడర్‌తోనూ ఆయనకు విస్తృత పరిచయాలున్నాయి. ఆయన పార్టీకి రాజీనామా చేసిన వెంటనే వైసీసీలో ఉన్న అనేకమంది ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతు ప్రకటించారు. ఒంగోలులోనూ అదే పరిస్థితి కనిపించింది. కొండపిలో ఆయన అనుచరులు మొత్తం బహిరంగంగానే బయటకొచ్చేశారు. కనిగిరిలో కొందరు బహిరంగంగా బయటకు రాగా మరికొందరు మేమెక్కడున్నా మీకే సపోర్టు అని ఫోన్లు చేసి సమాచారమిచ్చారు. మార్కాపురంలో అయితే ఆయనకు మరింత మద్దతు లభిస్తోంది. మార్కాపురం, గిద్దలూరు, వైపాలెం, దర్శి నియోజకవర్గాల్లో రాజకీయ పెత్తనం చేసే ఒక ప్రధాన సామాజికవర్గం నుంచి గ్రామ, మండలస్థాయిలో కీలకంగా వ్యవహరించే నాయకులు మాగుంటకు మద్దతు తెలపటమే గాక ఆయనతో కలిసి బహిరంగంగానే తిరగబోతున్నారు.

వ్యూహాత్మకంగా ముందడుగు వేసిన రాఘవరెడ్డి

రాజకీయంగా మాగుంట రాఘవరెడ్డి ఆ కుటుంబం నుంచి మూడో వారసుడు. తాజా పరిణామాల నేపథ్యంలో కుటుంబం మొత్తం ఏకగ్రీవంగా అతనిని రంగంలోకి తేవడం విశేషం. దివంగత సుబ్బరామిరెడ్డి మనవడైన సుబ్బరామిరెడ్డి పేరు కూడా వారసునిగా పరిశీలనలోకి వచ్చినట్లు తెలిసింది. అయితే వివిధ కారణాలు, రాఘవరెడ్డి ఇప్పటికే రాజకీయంగా చురుకైన పాత్ర పోషిస్తుండటం తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని ఆయన్నే అభ్యర్థిగా ప్రకటించారు.

అసెంబ్లీ బరిలో మాగుంట

ఎంపీ మాగుంట లోక్‌సభ పరిధిలోని ఏదో ఒక అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేసే అవకాశం లేకపోలేదని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. మాగుంట కుటుంబం నుంచి రెండు స్థానాల్లో పోటీ చేసేందుకు టీడీపీ అవకాశం ఇచ్చినట్లు తెలిసింది. శ్రీనివాసులరెడ్డిని తిరిగి ఎంపీగా పోటీ చేయించి వచ్చే ఎన్నికల్లో రాఘవరెడ్డిని రంగంలోకి తేవాలని ఆపార్టీ సూచించినట్లు సమాచారం. అయితే రాఘవరెడ్డిని రంగంలోకి దింపాలన్నది తమ కుటుంబ నిర్ణయమని శ్రీనివాసులరెడ్డి చెప్పడంతో ఆయన్ను ఒక అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేయాలని టీడీపీ సూచించినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఎంపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచిచూడాలి.

వైసీపీ ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి

ఒంగోలు ఎంపీ మాగుంట వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన వెంటనే ఆ పార్టీ అధిష్ఠానం కూడా ప్రతిస్పందించింది. ఇప్పటికే అనధికారికంగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని నియోజకవర్గంలో తిప్పుతున్న వైసీపీ.. మాగుంటను పరోక్షంగా కాదుకూడదు పొమ్మన్నట్లు వ్యవహరించింది. అయితే మాగుంటపై లోక్‌సభ నియోజకవర్గం వ్యాప్తంగా వైసీపీ శ్రేణుల నుంచి వ్యక్తమవుతున్న అభిమానాన్ని దృష్టిలో ఉంచుకుని చెవిరెడ్డి పేరును అధికారికంగా ప్రకటించకుండా వ్యూహం పన్నింది. బుధవారం మాగుంట రాజీనామా ప్రకటించగానే చెవిరెడ్డి పేరును ఒంగోలు లోక్‌సభ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడం గమనార్హం. అలాగే కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌యాదవ్‌ను కందుకూరు ఇన్‌చార్జిగా కూడా అధికారికంగా ఆ పార్టీ ప్రకటించింది.

Updated Date - Feb 29 , 2024 | 01:27 AM