వెలిగొండ ప్రారంభం సిగ్గుసిగ్గు..!
ABN , Publish Date - Mar 06 , 2024 | 11:47 PM
వెలిగొండ ప్రాజెక్టు పనులు పూర్తి చేయకుండా నీళ్లు లేకుండా ఎన్నికల్లో లబ్ధి కోసం సీఎం జగన్‌రెడ్డి ప్రారంభించడం సిగ్గుచేటని ఎర్రగొండపాలెం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. పనులు పూర్తి కాకుండా వెలిగొండను ప్రారంభిండంపై టీడీపీ ఆధ్వర్యంలో బుధవారం టీడీపీ కార్యాలయం ఎదుట నల్లబెలూన్లను గాలిలోకి వదిలి నిరసన తెలిపారు.

నల్ల బెలూన్లతో నిరసన
పనులు పూర్తి చేయకుండా, నీళ్లు లేకుండా శిలాఫలకమా
నిర్వాసితులకు పరిహారానికి బదులు నోటీసులివ్వడం అన్యాయం
ఎన్నికల లబ్ధి కోసం మోసానికి తెరలేపిన జగన్‌రెడ్డి
టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎరిక్షన్‌బాబు
అధికారంలోకి రాగానే వెలిగొండను పూర్తి చేస్తాం
ఎర్రగొండపాలెం, మార్చి 6 : వెలిగొండ ప్రాజెక్టు పనులు పూర్తి చేయకుండా నీళ్లు లేకుండా ఎన్నికల్లో లబ్ధి కోసం సీఎం జగన్‌రెడ్డి ప్రారంభించడం సిగ్గుచేటని ఎర్రగొండపాలెం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. పనులు పూర్తి కాకుండా వెలిగొండను ప్రారంభిండంపై టీడీపీ ఆధ్వర్యంలో బుధవారం టీడీపీ కార్యాలయం ఎదుట నల్లబెలూన్లను గాలిలోకి వదిలి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎరిక్షన్‌బాబు విలేకరులతో మాట్లాడుతూ రెండు సొరంగాలు పూర్తయ్యాయని శిలాఫలకాన్ని ఏర్పాటు చేసి జాతికి అంకితం అంటూ జగన్‌రెడ్డి ప్రజలను మోసం చేశారన్నారు. ప్రాజెక్టు పరిధిలో 7వేల మంది భూ నిర్వాసితులకు పరిహారం ఇవ్వాల్సి ఉందన్నారు. పెద్దారవీడు, మార్కాపురం, అర్ధవీడు మండలాల్లో 11 ముంపు గ్రామాలను తరలించాల్సి ఉందని తెలిపారు. ఒక్కో నిర్వాసితునికి రూ.12.50 లక్షల వంతున రూ.1500 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. టీడీపీ ప్రభుత్వం రూ.1450 కోట్లు ఖర్చుచేస్తే, వైసీపీ ఈ ఐదేళ్లలో కేవలం రూ.958 కోట్లు మాత్రమే ఖర్చు చేసి ప్రాజెక్టుపై నిర్లక్ష్యం చూపిందన్నారు. దీంతో ప్రాజెక్టు వ్యయం రూ.10వేల కోట్లకు చేరిందన్నారు. మరో రూ.4వేల కోట్లు ఖర్చు చేస్తేగాని ప్రాజెక్టు పూర్తి కాదన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే ప్రాజెక్టును పూర్తి చేస్తామని తెలిపారు. నిర్వాసితులకు పరిహారం ఇవ్వకపోగా పోలీసులతో నోటీసులు ఇప్పించడం అన్యాయమని ఎరిక్షన్‌బాబు అన్నారు. కొల్లంవాగు వద్ద రెగ్యులేటరీ పనులు, డిస్ట్రిబ్యూటరీ కాలువ పనులు పూర్తి కాకుండానే ప్రారంభ కార్యక్రమం నిర్వహించడం ఓట్లు దండుకోవడానికి చేస్తున్న మరో మోసమని పేర్కొన్నారు. జగన్‌రెడ్డి మాయలు, అబద్ధపు మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని, ఎన్నికల్లో గద్దె దింపుతారని ఎరిక్షన్‌బాబు అన్నారు. కార్యక్రమంలో టీడీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.