Share News

ఆరంభం ఫర్వాలేదు

ABN , Publish Date - Feb 29 , 2024 | 11:19 PM

ఈ ఏడాది పొగాకు కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. దక్షిణాదిలోని ఒంగోలు-1, కొండపి కేంద్రాలలో తొలివిడతగా గురువారం వేలం ప్రక్రియ చేపట్టగా కొండపిలో పొగాకు బోర్డు చైర్మన్‌ చిడిపోతు యశ్వంత్‌కుమార్‌, ఒంగోలు-1లో ఈడీ అద్దంకి శ్రీధర్‌బాబులు లాంఛనంగా ప్రారంభించారు.

ఆరంభం ఫర్వాలేదు
ఒంగోలు కేంద్రంలో కొనుగోళ్లను ప్రారంభిస్తున్న ఈడీ శ్రీధర్‌బాబు

కిలో రూ.230 పలికిన ప్రారంభ ధర

ప్రారంభమైన పొగాకు కొనుగోళ్లు

పాల్గొన్న పొగాకు బోర్డు చైర్మన్‌, ఈడీలు

ఒంగోలు, ఫిబ్రవరి 29 (ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది పొగాకు కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. దక్షిణాదిలోని ఒంగోలు-1, కొండపి కేంద్రాలలో తొలివిడతగా గురువారం వేలం ప్రక్రియ చేపట్టగా కొండపిలో పొగాకు బోర్డు చైర్మన్‌ చిడిపోతు యశ్వంత్‌కుమార్‌, ఒంగోలు-1లో ఈడీ అద్దంకి శ్రీధర్‌బాబులు లాంఛనంగా ప్రారంభించారు. రెండుచోట్ల 18 బేళ్ల వంతున తొలిరోజు వేలంకు తీసుకరాగా కిలో రూ.230 గరిష్ఠఽ ప్రారంభ ధరగా వ్యాపారులు ఇచ్చారు. ఒక్క బేలుకు మాత్రం కిలో రూ.250 లభించింది. అయితే ధరను హ్యాండ్‌సెట్‌లో రూ.230కి బదులు రూ. 250ని ఒక కంపెనికి చెందిన బయ్యరు నొక్కడం వల్ల అలా వచ్చింది. జరిగిన తప్పిదాన్ని సదరు కంపెనీ ప్రతినిధితోపాటు అధికారులు, ఇతర వ్యాపారులందరూ గుర్తించారు. ఈ ఘటన ఒంగోలు-1 వేలంకేంద్రంలో చోటుచేసుకుంది. కాగా ఈ ఏడాది పొగాకును వ్యాపారులు ప్రారంభ ధర కిలో రూ.230 ఇస్తున్న విషయం ఇతర బేళ్లకు ఇచ్చిన ధరను బట్టి స్పష్టం కాగా అదే విషయాన్ని సంబంధిత కంపెనీ ప్రతినిధులు బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్ళగా అక్కడ వేలం పరిశీలిస్తున్న బోర్డు ఈడీ శ్రీధర్‌బాబు అందుకు అనుమతించలేదు. రైతులు కూడా ఈ ఏడాది ప్రారంభ ధర కిలో రూ.250 ఇవ్వాలని కోరుతూ వస్తున్న నేపథ్యంలో పొరపాటుగా అయినప్పటికి రూ.250 పలకడం వారికి ఎంతో కొంత సంతృప్తి ఇస్తుందన్న భావనతో అధికారులు ఆ ధరను కొనసాగించాలని సూచించారు. ఆ రకంగా తొలిరోజు సాంకేతికంగా గరిష్ఠ ధర కిలో రూ.250గా పరిగణించే అవకాశం ఉన్నప్పటికి వాస్తవంగా చూస్తే ప్రారంభ ధర కిలో రూ.200గా ఉండగా ఈ ఏడాది రూ.230తో ప్రారంభించడం పట్ల రైతులలో ఒకింత సంతృప్తి వ్యక్తమవుతోంది. అయితే క్రమంగా ధరలు పెంచుతూ సగటు ధర కిలో రూ.250 నుంచి రూ.260 వరకు దక్కేలా చూడాలని రైతు ప్రతినిధులు అటు అధికారులు వ్యాపారులకు విజ్ఞప్తి చేశారు. ఒంగోలు-1లో బోర్డు ఈడీ శ్రీధర్‌బాబు పూజలు చేసి కొనుగోళ్లు ప్రారంభించగా ఆర్‌ఎం లక్ష్మణరావు, బోర్డు సభ్యుడు పొద వరప్రసాదరావు, రైతు కమిటీల ప్రతినిధులు గురువారెడ్డి, ఆళ్ల సుబ్బారావు, వడ్డెళ్ల ప్రసాదు పాల్గొన్నారు అలాగే కొండపి కేంద్రంలో బోర్డు చైర్మన్‌ యశ్వంత్‌కుమార్‌ ప్రారంభించగా సెక్రటరి దివి వేణుగోపాల్‌, బోర్డు సభ్యుడు బ్రహ్మయ్య పాల్గొన్నారు.

Updated Date - Feb 29 , 2024 | 11:19 PM