Share News

అ‘ధర’హో..

ABN , Publish Date - Jun 02 , 2024 | 01:40 AM

పొగాకు మార్కెట్‌ కళకళలాడుతోంది. ప్రస్తుత సీజన్‌లో ధరలు అదిరిపోతున్నాయి. ఊహించని రీతిలో రికార్డు స్థాయిలో లభిస్తున్నాయి. దీంతో అప్పుడే రైతులు వచ్చే సీజన్‌ సాగుపై దృష్టి సారించారు.

 అ‘ధర’హో..

భారీగా పొగాకు కొనుగోలు ధరలు

ఆశాజనకంగా మార్కెట్‌

పోటీపడి కొంటున్న బయ్యర్లు

వచ్చే ఏడాది సాగు మరింత పెరిగే అవకాశం

బ్యారన్‌లు, పొలాల కోసం రైతుల పరుగు

బ్యారన్‌ అద్దె రూ.2లక్షలపైనే!

ఎకరా కౌలు రూ.30వేల నుంచి రూ.45వేల వరకు

ఇప్పుడే అడ్వాన్సులిస్తున్న కౌలుదారులు

కొండపి, జరుగుమల్లి, టంగుటూరు మండలాల్లోని సారవంతమైన నల్లరేగడి నేలల్లో వాతావరణం అనుకూలిస్తే పది క్వింటాళ్ల పొగాకు పండుతుంది. దీంతో ఈ నేలల కోసం రైతులు ఎగబడుతున్నారు. రింగ్‌రోడ్డుగా పిలిచే మండలాల్లో ఎకరం రూ.45వేల చొప్పున రాబోయే సీజన్‌కి రైతులు ఇప్పుడే అడ్వాన్సులు ఇచ్చి ఖాయపర్చుకుంటున్నారు. ఏడు నుంచి ఎనిమిది క్వింటాళ్ల దిగుబడి వచ్చే పొలాలను ఎకరా రూ.30వేలకు కౌలుకు తీసుకుంటున్నారు.

కొండపి మండలంలోని ఒకట్రెండు గ్రామాల్లో కౌలు రైతులు వచ్చే ఏడాదికి పొగాకు బ్యారన్‌ అద్దె రూ.2.30లక్షలు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. తక్కువగా అనుకున్నా రూ.2లక్షల నుంచి ఉంటుందని రైతులు అంటున్నారు. బ్యారన్‌ క్యూరింగ్‌, లైసెన్స్‌ అమ్మకాలకు కలిపి ఈ ధర ఉంటుందని భావిస్తున్నారు.

పొగాకు మార్కెట్‌ కళకళలాడుతోంది. ప్రస్తుత సీజన్‌లో ధరలు అదిరిపోతున్నాయి. ఊహించని రీతిలో రికార్డు స్థాయిలో లభిస్తున్నాయి. దీంతో అప్పుడే రైతులు వచ్చే సీజన్‌ సాగుపై దృష్టి సారించారు. క్రమంగా పొగాకు సాగులో కౌలు రైతులు పెరుగుతుండగా రానున్న ఏడాదికి మరింత అధికమయ్యే అవకాశం కనిపిస్తోంది. వేలం కేంద్రాల్లో సగం పొగాకు అమ్మకం పూర్తయిందో? లేదో? వచ్చే పంట కాలంపై దృష్టి పెట్టారు. వచ్చే ఏడాది సాగుకు భూములు, బ్యారన్ల కోసం పరుగులు తీస్తున్నారు. దీంతో అటు భూముల కౌలు, ఇటు బ్యారన్‌ అద్దెలు ఆకాశాన్నంటుతున్నాయి. గతేడాది కన్నా కనీసం 50శాతం అధికంగా కౌలు, అద్దె చెల్లించేందుకు సిద్ధమవుతున్నారు. అంతేకాక కొన్నిచోట్ల డిమాండ్‌ అధికమై ముందుగానే అడ్వాన్సులు చెల్లించి ఖాయపర్చుకుంటున్నారు.

ఒంగోలు, జూన్‌ 1 (ఆంఽధ్రజ్యోతి)/ కొండపి : సాధారణంగా పొగాకు పంటలో అధిక లాభాలకు అవకాశం ఉండదు. అంతర్జాతీయ పరిణామాలపై ఈ మార్కెట్‌ ఆధారపడి ఉండటంతోపాటు కూలీల అవసరం, ఉత్పత్తి ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. సొంత బ్యారన్‌, భూమి ఉన్న రైతులకు ఒక మోస్తరులో మిగులదల ఉంటే కౌలురైతులకు ఒక ఏడాది లాభం వస్తే మరోసారి నష్టం వస్తుంటుంది. కొన్ని సందర్భాల్లో వరుసగా రెండు, మూడేళ్లు మార్కెట్‌ సరిలేక తీవ్రంగా నష్టపోతుంటారు. అలా 2015లో తీవ్రనష్టాల పాలైన పొగాకు రైతులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. అనంతరం పంటసాగు విస్తీర్ణం కొంతమేర తగ్గడంతో తిరిగి మార్కెట్‌ కాస్తంత కోలుకుంటూ వస్తోంది. మూడేళ్లుగా మంచి ధరలే లభిస్తున్నాయి. గతేడాది (2022-23) దక్షిణాదిలో పొగాకు రైతులకు కాస్తంత మంచి ధరలే లభించాయి. 56వేల హెక్టార్లలో సాగుకు, 88 మిలియన్‌ కిలోల పంట ఉత్పత్తికి పొగాకు బోర్డు అనుమతివ్వగా సుమారు 61వేల హెక్టార్లలో సాగు చేశారు. దాదాపు 90 మిలియన్‌ కిలోల పంట ఉత్పత్తి జరగ్గా సగటు ధర కిలోకు రూ.237 లభించింది. బ్యారన్‌కు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు రైతులకు మిగిలాయి. దీంతో ప్రస్తుత ఏడాది (2023-24)లో భారీగా సాగు పెంచారు. సుమారు 56వేల హెక్టార్లలో సాగుకు, 99.82 మిలియన్‌ కిలోల పంట ఉత్పత్తికి బోర్డు అనుమతివ్వగా 72వేల హెక్టార్లకుపైగా విస్తీర్ణంలో పంట సాగు చేశారు. దాదాపు 134 మిలియన్‌ కిలోల ఉత్పత్తి అంచనా వేస్తున్నారు. అంతకుముందు సీజన్‌లో (2022-23)లో ఎకరా భూమి కౌలు రూ.15వేల నుంచి రూ.20వేలు, బ్యారన్‌ అద్దె రూ.లక్ష ఉండగా 2023-24 సీజన్‌కు భూమి కౌలు ఎకరాకు రూ.20వేల నుంచి రూ.25వేలు, బ్యారన్‌ అద్దె లక్షన్నర పెట్టి తీసుకున్నారు. ఇతర ఖర్చులు కూడా అలాగే పెరిగాయి. అయినప్పటికీ ప్రస్తుత సీజన్‌లో మార్కెట్‌ జోరుగానే సాగుతోంది.

సీజన్‌ మొదటి నుంచి హాట్‌హాట్‌గా..

అంతర్జాతీయంగా అధికంగా నాణ్యమైన పొగాకు పండే బ్రెజిల్‌, జింబాబ్వేలలో ఉత్పత్తి గణనీయంగా తగ్గడం వంటి సానుకూల పరిస్థితులతో ప్రస్తుత సీజన్‌ హాట్‌హాట్‌గా సాగుతోంది. మేలురకం గరిష్ఠ ధరలు కిలో రూ.360కు చేరుకోగా బ్రౌన్‌రకం రూ.270, లోగ్రేడ్‌లు సైతం కిలో రూ.225పైనే ఉంటున్నాయి. ఇప్పటివరకూ సుమారు 62.52 మిలియన్‌ కిలోలు దక్షిణాదిలో విక్రయాలు జరగ్గా సగటు ధర కిలో రూ.249.50గా ఉంది. అయితే ఇప్పటివరకూ అమ్మకాలు జరిగిన దానిలో లోగ్రేడ్‌ రకం మూడొంతులు ఉంది. అంటే ఈ ఏడాది మార్కెట్‌ ముగిసేసరికి సగటు ధర కిలో రూ.260కిపైన చేరే అవకాశం ఉంది. ఈ స్థాయి ధరలతో ఈ ఏడాది కూడా రైతులకు బ్యారన్‌కు రూ.5లక్షల వరకు మిగులుదల కనిపిస్తోంది. దీంతో ప్రస్తుత సీజన్‌ అమ్మకాలు సగం కూడా పూర్తి కాకముందే రైతులు వచ్చే సీజన్‌ పంట సాగుపై దృష్టి సారించారు. అందుకు సంబంధించి భూముల కౌలు, బ్యారన్‌ అద్దెలకు తీసుకోవడం గత నెలరోజుల నుంచి జోరుగా సాగుతోంది.

డిమాండ్‌తో పెరిగిన కౌలు

ఒంగోలు, సంతనూతలపాడు, కొండపి, కందుకూరు నియోజకవర్గాల పరిధిలోని అనేక గ్రామాల్లో ఇప్పటికే వేలాది ఎకరాల భూములను, వందలాది బ్యారన్‌లను వచ్చే ఏడాది కోసం గతం కన్నా దాదాపు 50శాతం అధిక ధరతో రైతులు తీసుకున్నట్లు సమాచారం. ఆ పరిధిలోని దాదాపు వందకుపైగా గ్రామాల్లో గతంలో ఎకరా రూ. 25వేలు ఉన్న భూమి కౌలు ప్రస్తుతం రూ.30వేల నుంచి రూ.35వేల వరకు చేరింది. అలాగే బ్యారన్‌ అద్దెలు కూడా రూ. లక్షన్నర నుంచి ఏకంగా రూ. 2.5లక్షలకు చేరాయి. సాధారణంగా పొగాకు అమ్మకాల తర్వాత కౌలు, అద్దెల చెల్లింపు జరుగుతుంది. అయితే ప్రస్తుత డిమాండ్‌తో చాలా చోట్ల అడ్వాన్స్‌లు ఇస్తున్నారు.

అప్రమత్తంగా ఉండాలంటున్న అనుభవజ్ఞులు

ఈ విపరీత పోకడపై ఆ రంగంలోని అనుభవజ్ఞులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పొగాకు మార్కెట్‌ పూర్తిగా అంతర్జాతీయ పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని, రెండేళ్లుగా అను కూల పరిస్థితులతో మంచి ధరలు లభి స్తున్నా యంటు న్నారు. వచ్చే ఏడాది ఇతర దేశాల్లో పంట ఉత్పత్తి, నాణ్యత పెరిగితే ఆ మేర దేశీయంగా ప్రత్యేకించి దక్షి ణాది ఆంధ్ర మార్కెట్‌లో ధరలు పడిపోయే అవకాశం ఉంటుందని అభిప్రాయపడుతు న్నారు. గతంలో అనేక సంద ర్భాలలో ఇలా జరిగి ధరల కోసం రైతు లు రోడ్డెక్కడం, చివరకు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకోవడాన్ని ఉద హరిస్తూ అప్రమత్తంగా ఉం డాలని సూచిస్తు న్నారు.

స్వీయ నియంత్రణ పాటించాలి

- ఎం.లక్ష్మణరావు, పొగాకు బోర్డు ఆర్‌ఎం

ప్రస్తుత పరిస్థితిపై పొగాకు బోర్డు ఒంగోలు ప్రాంతీయ మేనేజర్‌ ఎం.లక్ష్మణరావు స్పందిస్తూ రైతులు స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు. అత్యధిక మంది పొగాకు రైతులు దీర్ఘకాలంగా ఈ పంట సాగులో ఉండి ఒడిదొడుకులు చూస్తున్న వారేనని, అలాంటి వారు ప్రస్తుతం ధరలను చూసి అధికంగా కౌలు, అద్దెలకు భూములు, బ్యారన్‌లు తీసుకోవడం సరైంది కాదన్నారు. వీటితోపాటు ఇతర ఖర్చులు కూడా భారీగా పెరిగి ఉత్పత్తి వ్యయం అధికమైతే ఎంతధర ఉన్నా మిగిలేది ఏమీ ఉండదన్న వాస్తవాన్ని గ్రహించాలని కోరారు. పొగాకు బోర్డు అనుమతిచ్చిన మేరకు మాత్రమే పంట సాగు, ఉత్పత్తిని నియంత్రించుకోవాలని సూచించారు.

ఆల్‌టైం రికార్డు

పొగాకు గరిష్ఠ ధర కిలో రూ.360

పొగాకు ధరలు అదరగొడుతున్నాయి. తాజాగా శనివారం మార్కెట్‌లో కిలో గరిష్ఠ ధర ఏకంగా రూ.360 పలికింది. పొగాకు బోర్డు చరిత్రలో ఇది ఆల్‌టైం రికార్డు. సాధారణంగా కర్ణాటకలో అధికంగా, ఆంధ్రలోని ఉత్తరాదిలో కర్ణాటక కన్నా కాస్తంత తక్కువగా.. అలాగే దక్షిణాదిలో ఇంకాస్త తక్కువగా ధరలు ఉంటుంటాయి. అలాంటిది ఈ ఏడాది దక్షిణాది పొగాకు మార్కెట్‌ ఆరంభం నుంచి ఆశాజనకంగా సాగుతోంది. ఇక్కడ అనుమతి ఇచ్చిన దాని కన్నా పంట సాగు విస్తీర్ణం, పంట ఉత్పత్తి అధికమైనా కూడా ఊహించని రీతిలో ధరలు పెరిగాయి. ఈ సీజన్‌ కొనుగోళ్లు ప్రారంభమైన రోజు గరిష్ఠ ధర కిలో రూ.230 ఉండగా శనివారం నాటికి కిలోకు రూ.130 పెరిగి ఏకంగా రూ.360 ధర లభించింది. ఈ ఏడాది కొనుగోళ్లను ఫిబ్రవరి 29న తొలిదశ, మార్చి 6న రెండోదశ ప్రారంభించారు. దాదాపు నెలన్నర రోజులు పెద్దగా గరిష్ఠ ధరలు పెంచకుండానే కొనుగోలు చేశారు. అయితే లోగ్రేడ్‌, మీడియం రకం బేళ్లను మాత్రం భారీగానే ధర ఇచ్చి కొన్నారు. దీంతో రైతులు మేలురకం బేళ్లను కాకుండా లోగ్రేడ్‌ బేళ్లను అధికంగా వేలానికి తెచ్చారు. కాగా నెలక్రితం నుంచి మేలురకం బేళ్ల ధరలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. పక్షం క్రితం కిలో రూ.300 ధర పలికింది. అనంతరం రోజూ పెరుగుతూ గురువారం కిలో రూ.326 లభించింది. శుక్రవారం రూ.338 లభించింది. ఆ ధరలే బోర్డు చరిత్రలో అధికం కాగా శనివారం ఊహించని రీతిలో ఏకంగా కిలో గరిష్ఠ ధర రూ.360 పలికింది. ఒంగోలు-1 కేంద్రంలో ఈ ధర లభించగా ఒంగోలు-2లో రూ.356 దక్కింది. ఇతర కేంద్రాల్లోనూ ధరలు కిలో రూ.345 నుంచి రూ.355 వరకు ఉన్నాయి. మూడు దశాబ్దాల పొగాకు బోర్డు చరిత్రలో ఎన్నడూ ఇంత ధర లభించిన దాఖలాలు లేవు. అంతర్జాతీయంగా పంట ఉత్పత్తి తగ్గి ఇక్కడ ఈ స్థాయి ధరలు లభిస్తున్నట్లు మార్కెట్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కాగా ఊహించని రీతిలో పెరిగిన డిమాండ్‌, మార్కెట్‌లో లభిస్తున్న ధరలతో రైతుల్లో సంతోషం, ఉత్సాహం కనిపిస్తున్నా భవిష్యత్‌ పరిణామాలపై బోర్డు అధికారులు, రైతు ప్రతినిధుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

Updated Date - Jun 02 , 2024 | 01:40 AM