నగర పాలనకు పన్నుపోటు
ABN , Publish Date - Nov 28 , 2024 | 11:38 PM
ఒంగోలు కార్పొరేషన్‌కు పన్ను బకాయిలు గుదిబండలా మారాయి. ఏటేటికీ అవి కొండలా పేరుకుపోతున్నాయి. నగరపాలక సంస్థ అభివృద్ధికి జవసత్వాలు ఇచ్చేది ఆర్థిక వనరులే. పన్నుల బకాయిలు కోట్లలో పేరుకుపోవడంతో ఖజానా వెలవెలబోతోంది.

300కు పైగా ప్రభుత్వ భవనాలకు పేరుకుపోతున్న బకాయిలు
రూ.40 కోట్ల పెండింగ్‌కు రూ.కోటి మాత్రమే వసూలు
ప్రైవేటు ఆస్తులవి రూ.50కోట్లు.. చెల్లింపులు రూ.20 కోట్లు
తాగునీటి బకాయిలు రూ.10కోట్లు.. వసూలు రూ.1కోటి
నిఽధులు లేక నీరసించిన నగరపాలక సంస్థ
ఒంగోలు కార్పొరేషన్‌కు పన్ను బకాయిలు గుదిబండలా మారాయి. ఏటేటికీ అవి కొండలా పేరుకుపోతున్నాయి. నగరపాలక సంస్థ అభివృద్ధికి జవసత్వాలు ఇచ్చేది ఆర్థిక వనరులే. పన్నుల బకాయిలు కోట్లలో పేరుకుపోవడంతో ఖజానా వెలవెలబోతోంది. యంత్రాంగంలో అలసత్వం, పన్నుదారుల్లో నిర్లక్ష్యమే ఇందుకు కారణం. ప్రధానంగా ప్రభుత్వ ఆస్తుల పన్ను బకాయిలు పెద్ద తలనొప్పిగా మారాయి. 2002 నుంచి బడ్జెట్ లేదనే కారణంతో ఆయా శాఖల నుంచి చెల్లింపులు లేకపోవడం, రెవెన్యూ విభాగం పట్టించుకోకపోవడంతో కోట్లలో బకాయిలు ఉన్నాయి. తాజాగా పన్ను వసూలుకు గడువు ముంచుకొస్తుండడంతో ఇప్పుడు వసూళ్లకు అధికారులు నానా తంటాలు పడుతున్నారు. ప్రధానంగా ఆయా డివిజన్ల వారీగా కేటాయించిన ఆర్‌ఐలు, సచివాలయ సెక్రటరీలకు బకాయిల వసూలు అన్నది కత్తి మీద సాములా మారింది.
ఒంగోలు, కార్పొరేషన్, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): ఒంగోలు నగరపాలక సంస్థకు పన్ను పోటు పెరిగింది. జిల్లా కేంద్రంలో ఉన్న 300 ప్రభుత్వ భవనాలకు సంబంధించి అసలు రూ.15 కోట్లు పన్ను బకాయి ఉండగా, వడ్డీ రూ.25 కోట్లు ఉంది. దీంతో రూ.40కోట్లు ప్రభుత్వ బకాయిలు ఉండగా, ప్రైవేటు ఆస్తులకు సంబంధించి రూ.34 కోట్లు వసూలు కావాల్సి ఉండగా, పాత బకాయిలు మరో రూ.14 కోట్లు ఉన్నట్లు సమాచారం. మొత్తం ప్రైవేటుది రూ.50 కోట్లు బకాయి ఉంది. ఇందుకు సంబంధించి ఇటీవల పన్నుల వసూళ్లకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. దీంతో సుమారు రూ.20 కోట్లు వరకు వసూలైనట్లు అధికారులు వెల్లడిస్తున్నారు.
ప్రభుత్వ భవనాల బకాయిలు రూ.40 కోట్లు
నివాస గృహాల ఇంటిపన్నును ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్న నగరపాలక సంస్థ.. ప్రభుత్వ కార్యాలయాల నుంచి రావాల్సిన వాటిపై ఉదాసీనంగా వ్యవహరిస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. కొన్నేళ్లు పన్నులు చెల్లించకపోవడంతో అపరాధ రుసుం కూడా తోడై బకాయిల భారం మరింత పెరిగింది. వాస్తవానికి 2002 నుంచి ఇప్పటివరకు పన్నులు రూ.15కోట్లు బకాయిలు వసూలు కావాల్సి ఉండగా, వడ్డీ రూ.25 కోట్లకు పెరిగింది. దీంతో ఆయా శాఖల నుంచి రూ.40 కోట్లు రావాల్సి ఉంది. అందులో ప్రధానంగా పోలీసు శాఖ, ప్రకాశం భవనం, కోర్టు, డీఆర్‌డీఏ, ఆర్‌అండ్‌బీ, ఎన్నెస్పీ, పంచాయతీరాజ్, బీసీ కార్పొరేషన్, జిల్లా పరిషత్, డ్వామా, రిమ్స్ భవనాల బకాయిలే అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కార్పొరేషన్ రెవెన్యూ యంత్రాంగం కేవలం నోటీసులతోనేసరిపెడుతుండగా, ఆయా ప్రభుత్వ శాఖలు సైతం పెద్దగా స్పందించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. వాస్తవానికి కొన్ని శాఖలు అప్పుడప్పుడు చెల్లింపులు చేస్తుండగా మరి కొన్ని తమకేమీ తెలియదన్నట్లుగానే వ్యవహరిస్తున్నాయి. వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించినా ప్రభుత్వ బకాయిలు మాత్రం వసూలు కాకపోవడంతో నగరపాలక సంస్థ సిబ్బంది డీలాపడుతున్నారు. నిబంధన మేరకు ఆయా శాఖల జీతభత్యాలతోపాటు కార్యాలయ భవనాల అద్దె, విద్యుత్ బిల్లుల చెల్లింపు, వివిధ పన్నులు చెల్లించేందుకు ఏటా బడ్జెట్ విడుదల చేయాలి. అయితే ఈ విధానం సక్రమంగా అమలు కాకపోవడంతో బకాయిల భారం మరింత రెట్టింపై కూర్చుంటుంది.
రెవెన్యూలో ’గూడు’ పుఠాణి
ఒంగోలు నగరంలో సుమారుగా 67 వేల వరకు అస్సె్‌సమెంట్‌లు ఉన్నాయి. అందులో రెసిడెన్షియల్ 35,402, నాన్ రెసిడెన్షియల్ 7వేలు, పార్టిలీ, నాన్ పార్టీల్లీ (అన్నీ కలిపి) 4,720 వరకు ఉండగా వాటికి సంబంధించిరూ.22 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. వాటితోపాటు రాష్ట్ర, కేంద్ర, ప్రభుత్వ కార్యాలయాల భవనాలు 300 వరకు ఉండగా వీటికి సంబంధించి రూ.40 కోట్లు వసూలు చేయాలి. ఇకపోతే దామోదర సంజీవయ్య కూరగాయల మార్కెట్‌లో, నగరంలోని పలు ప్రాంతాలలోని మునిసిపల్ షాపింగ్ కాంప్లెక్స్‌లకు సంబంధించి సుమారు రూ.4.5 కోట్లు బకాయిలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంచితే తాగునీటి పన్ను రూ.10 కోట్లు, ప్రైవేటు ఆస్తుల బకాయిలు రూ.50 కోట్లు ఉండటంతో పూర్తిస్థాయిలో వసూలే లక్ష్యంగా కార్పొరేషన్ అధికారులు దృష్టిసారించారు. అయితే ఇంత పెద్దమొత్తంలో బకాయిలు పేరుకుపోవడానికి గతంలో ఆర్‌ఐలుగా పనిచేసిన వారి నిర్లక్ష్యమే కారణంగా కనిపిస్తుంది.
అన్నింటికీ పన్నులే ఆధారం.
అధిక శాతం అభివృద్ధి పనులకు ఆయా మునిసిపాలిటీల ఖజానా నిధులు (జనరల్ ఫండ్)లనే ఉపయోగించాల్సి ఉంది. వాటితో తాగునీటి నిర్వహణ, కాంట్రాక్టు సిబ్బంది జీతాలు, పలు అభివృద్ధి పనులు, విద్యుత్ దీపాలు నిర్వహణ, విద్యుత్ బకాయిలతోపాటు పార్కుల నిర్వహణ, పారిశుధ్యం మెరుగు ఇతరత్రాకొన్ని ఆర్థికపరమైన వాటికి వీటినే వినియోగించాల్సి ఉంది. అయితే పన్ను వసూలు విషయంలో అధికారుల నిర్లక్ష్యంతో కార్పొరేషన్ ఖజానా బోసిపోతుంది.
డబ్బులు చెల్లించకుండా తాగేస్తున్నారు.
నగరంలో 47వేలకుపైగా గృహాలు ఉండగా, అధికారుల లెక్కల ప్రకారం 26,461 కొళాయి కనెక్షన్‌లు మాత్రమే ఉన్నట్లు సమాచారం. ఇప్పటివరకు పాత బకాయిలతో కలిపి రూ.10కోట్లు తాగునీటి పన్ను వసూలు కావాల్సి ఉంది. కాగా వాటిలోనే గృహ అవసరాలు, వాణిజ్య అవసరాలు, అపార్ట్‌మెంట్‌లు ఇతరత్రా అన్నింటికీ సంబంధించి కొళాయిలు ఉన్నట్లు అధికారుల కాకిలెక్కలు. వాస్తవ పరిస్థితి పరిశీలిస్తే సుమారు 8 వేల వరకు అక్రమ కొళాయి కనెక్షన్‌లు ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే వాటిని తొలగించడం కానీ, క్రమబద్ధీకరించే దిశగా అధికారులు దృష్టిసారించకపోవడంతో ఆశించిన స్థాయిలో పన్ను వసూలు కావడం లేదు.
అత్యధిక బకాయి ఉన్న ప్రభుత్వ భవనాలు
పోలీసు శాఖ రూ.3.53 కోట్లు
ప్రకాశం భవనం రూ.6.85 కోట్లు
న్యాయశాఖ రూ.80 లక్షలు
డీఆర్‌డీఏ రూ.3.19 కోట్లు
ఆర్‌అండ్‌బీ రూ.1.85 కోట్లు
ఎన్నెస్పీ రూ.1.17 కోట్లు
పంచాయతీరాజ్ రూ. 77 లక్షలు
బీసీ కార్పొరేషన్ రూ. 1.65 కోట్లు
జిల్లా పరిషత్ రూ. 4.35 కోట్లు
డ్వామా రూ. 80 లక్షలు
రిమ్స్ రూ. 1.55 కోట్లు
పన్నుల వసూళ్లకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నాం
డాక్టర్ కే వెంకటేశ్వరరావు, నగర కమిషనరు
కొన్నేళ్లుగా ప్రభుత్వ భవనాల నుంచి కోట్లలో పన్ను బకాయిలు పెండింగ్ ఉన్నట్లు గుర్తించాం. బడ్జెట్ లేని కారణంగా చెల్లించడం లేదని తెలిసింది. ఈ విషయాన్ని ఆయా శాఖల ఉన్నతాఽధికారుల దృష్టికి తీసుకెళతాం. అలాగే ప్రైవేటు ఆస్తులు, నీటి పన్నుల వసూళ్లపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాం. రెవెన్యూ సెక్షన్‌తోపాటు, గతంలో ఆర్‌ఐలుగా పనిచేసిన వారికి, సచివాలయ సెక్రటరీలకు ఆ బాధ్యతలు అప్పగించాం. మార్చి 31 నాటికి నూరుశాతం వసూలే లక్ష్యంగా ప్రణాళిక రూపొందించాం. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారికి మెమోలు జారీచేస్తాం. లక్ష్యాలు సాధించని వారికి అపరాధ రుసుం విధిస్తాం. ఆర్థిక లోటు ఉన్న కార్పొరేషన్‌ను బలోపేతం చేసే దిశగా ఆదాయ వనరులపై దృష్టి సారించాం.