Share News

బరితెగించి ఆక్రమణలు

ABN , Publish Date - Mar 29 , 2024 | 12:16 AM

మార్కాపురం పట్టణంలో భూఆక్రమణదారులు రోజురోజుకు పెరుగుతు న్నాయి. కాస్త జాగ కనిపిస్తే చాలు పాగా వేసి బరితెగించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు.

బరితెగించి ఆక్రమణలు

మార్కాపురం వన్‌టౌన్‌, మార్చి 28: మార్కాపురం పట్టణంలో భూఆక్రమణదారులు రోజురోజుకు పెరుగుతు న్నాయి. కాస్త జాగ కనిపిస్తే చాలు పాగా వేసి బరితెగించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. జాతీయ రహ దారులను కూడా ఆక్రమణదారులు వదలడం లేదు.

మార్కాపురం పట్టణంలోని 2వ వార్డు ఏకలవ్య కాలనీ పారిశ్రామికవాడ వద్ద 565 జాతీయ రహదారి వెంబడి యథేచ్ఛగా ఆక్రమణలు కొనసాగుతున్నాయి. మున్సిపల్‌ చైర్మన్‌ బంధువైన ఒక వ్యక్తి ఈ అక్రమ కట్టడాన్ని నిర్మిస్తున్నారు. జాతీయ రహదారి నిర్మాణ సమయంలో మురుగు పారేందుకు ఏర్పాటు చేసిన కాలువ, ఆర్‌అండ్‌బీ స్థలాన్ని కూడా కూడా ఆక్రమించి దుకాణాలను నిర్మిస్తున్నాడు. గతంలో మస్తాన్‌ అనే వ్యక్తి సైకిల్‌ షాపు, పుల్లయ్య అనే వ్యక్తి చికెన్‌ షాపులు పెట్టుకుని ఇక్కడ జీవనం సాగిస్తుండేవారు. కానీ మున్సిపల్‌ ఛైర్మన్‌ అయిన ఒక వ్యక్తి వారిని బలవంతంగా ఖాళీ చేయించాడు. అనంతరం కాలువ, ఆర్‌అండ్‌బీ స్థలాన్ని ఆక్రమించి 80 అడుగుల పొడవు విస్తీర్ణంలో దుకాణాల నిర్మాణం చేపట్టాడు. సమాచారం అందుకున్న 2వ సచివాలయం వీఆర్‌వో వెళ్లి అక్రమ కట్టడాన్ని నిలిపివేయాలని అన్నారు. కానీ ఆక్రమణదారులు యథేచ్ఛగా కొనసాగిస్తున్నాడు. ఎన్నికల సమయంలో అధికారులు బిజీగా ఉంటారనే సమయం చూసుకుని రాజకీయ నాయకుల ప్రోద్భలంతో అండదండలతో నిర్మిస్తున్న స్థలా న్ని ఆక్రమణ దారుల నుంచి కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.

పెట్రోలు పంపు మాటున

మార్కాపురం రూరల్‌ : ఆక్రమణదారులు ప్రభుత్వ భూములతో పాటు జాతీయ రహదారులను కూడా ఆక్రమించేందుకు వెనుకాడడం లేదు. రహదారి పక్కనే నిర్మాణాలు చేస్తున్నప్పటికీ అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. మండల పరిధిలోని అమరావతి టూ అనంతపురం 544డీ జాతీయ రహదారిపై నికరంపల్లి-కోమటికుంట మధ్యలో నూతనంగా ప్రైవేటు పెట్రోల్‌ బంకు నిర్మాణం జరగుతోంది. పెట్రోల్‌ బంకుకు సంబంధించిన పార్క్‌ నిర్మాణం కోసం జాతీయ రహదారిని సైతం సదరు యజమాని ఆక్రమించారు. సాధారణంగా ఈ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు అధికంగానే ఉంటాయి. రహదారి అంచులలో వాహనాలు నిలిపితే సంబంధిత అధికారులు వాహన దారులపై చర్యలు తీసుకుంటారు. అలాంటిది ఏకంగా జాతీయ రహదారిని ఆక్రమించి ప్రైవేట్‌ వ్యక్తి ధైర్యంగా పార్కును ఏర్పాటు చేస్తున్నాడు. ఇదే రహదారిపై నిత్యం జాతీయ రహదారి పెట్రోలింగ్‌ పోలీసులు పర్యవేక్షిస్తుంటారు. కానీ ఆక్రమణదారునిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. తక్షణమే జాతీయ రహదారి ఆక్రమిస్తున్న వారిపై చర్యలు తీసుకుని నిర్మాణాలు నిలిపివేయాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Mar 29 , 2024 | 12:16 AM