Share News

పేరుకే శిలాఫలకాలు.. పనులకు తిలోదకాలు

ABN , Publish Date - Apr 27 , 2024 | 12:10 AM

పొదిలి నగర పంచాయతీని సమూలంగా మార్చి వేసి అభివృద్ధి చేస్తామని గతేడాది మార్కాపురం వచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. దీనిలో భాగంగా ప్రజలకు శాశ్వతంగా తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు పొదిలి పెద్దచెరువుకు సాగర్‌ కాలువ నుంచి పైపులైన్‌ ఏర్పాటు చేస్తానని ప్రకటించారు.

పేరుకే శిలాఫలకాలు.. పనులకు తిలోదకాలు
మధ్యలోనే ఆగిన పొదిలి పెద్దచెరువు పైపులైన్‌ పనులు

సీఎం జగన్‌ ప్రారంభించిన పనులకూ దిక్కులేదు

ఇబ్బందులు పడుతున్న పొదిలి పంచాయతీ ప్రజలు

పొదిలి, ఏప్రిల్‌ 26 : పొదిలి నగర పంచాయతీని సమూలంగా మార్చి వేసి అభివృద్ధి చేస్తామని గతేడాది మార్కాపురం వచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. దీనిలో భాగంగా ప్రజలకు శాశ్వతంగా తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు పొదిలి పెద్దచెరువుకు సాగర్‌ కాలువ నుంచి పైపులైన్‌ ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. అంతేగాక మార్కాపురం అడ్డరోడ్డు నుంచి రోడ్డు విస్తరణ పనులు చేపడతానని ఆర్భాటంగా ప్రకటించారు. ఆ తర్వాత ఆ పనుల తాలూకు శిలాఫలకాలను తాడేపల్లి నుంచి వర్చ్యువల్‌ విధానంలో జగన్‌ ఆవిష్కరించారు. ఆ పనులు ఆర్భాటంగా ప్రారంభించి ఆపేశారు.

పొదిలి పెద్దచెరువుకు పైపులైన్‌ ద్వారా తాగు, సాగునీరు అందిస్తామని అప్పటి ప్రతిపక్షనేత ఇప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పాదయాత్రలో హామీ ఇచ్చి ఆరేళ్లు అయ్యింది. పొదిలి పెద్దచెరువుకు దర్శి సాగర్‌ కెనాల్‌ నుంచి పైపులైన్‌ ద్వారా తాగు, సాగునీరు రావాల్సి ఉంది. దీని కోసం గతేడాది మార్కాపురం వచ్చిన సందర్భంలో వర్చ్యువల్‌ విధానంలో మార్కాపురంలో శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అదే పనులకు ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి కూడా కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ క్రమంలోనే నాలుగు కిలోమీటర్ల మేర కాంట్రాక్టర్‌ పైపులైన్‌ కూడా వేశారు. దీనికోసం రూ.10 కోట్లు వెచ్చించినట్లు కాంట్రాక్టర్‌ తెలిపారు. అయితే ఒక్కరూపాయి కూడా విడుదల చేయలేదు. దీంతో కాంట్రాక్టర్‌ పనులను మధ్యలోనే నిలిపి వెళ్లిపోయారు. ఈ పైపులైన్‌ ఏర్పాటు క్రమంలో కాలువకు, పొదిలికి మధ్యలో ఉన్న మల్లవరం గ్రామస్థులు పైపులైన్‌ ఏర్పాటును అడ్డుకున్నారు. తమ నివాసాల మధ్య నుంచి పైపులైన్‌ వెళుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఆ సమస్యను పరిష్కరించకపోవడంతో పనులు మధ్యలోనే నిలిచిపోయాయి.

11 కోట్లతో రోడ్ల విస్తరణ పనులు ఏవీ..

మార్కాపురం అడ్డరోడ్డు నుంచి కాటూరివారిపాలెం వరకు రోడ్డు విస్తరణ పనులకు రూ.11కోట్లు నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. నిధులు మంజూరైన తరువాత మూడు నెలల్లో పొదిలి పట్టణంలో రోడ్ల విస్తరణ చేపట్టి ఆరునెలల్లో పూర్తి చేస్తామని ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి కూడా హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఆ ఊసే లేకుండా పోయింది. సైడుకాలువలు లేకపోవడం, రోడ్డువిస్తరణ చేయకపోవడంతో మురుగునీటితోపాటు, వర్షపునీరు రోడ్లపై ప్రవహిస్తోంది. దీంతో ఇరుకు రోడ్లతో అవస్థలు పడుతున్న పొదిలి ప్రధాన రహదారి విస్తరణ పనులు పూర్తి కాకపోవడంతో ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఏది ఏమైౖనా మటతప్పడం, మడమ తిప్పడం జగన్మోహన్‌రెడ్డి అలవాటేనని పలువురు ప్రజలు విమర్శిస్తున్నారు.

Updated Date - Apr 27 , 2024 | 12:10 AM