Share News

శీనారెడ్డి స్వాహారాయుడు

ABN , Publish Date - May 26 , 2024 | 02:04 AM

జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) ప్రాజెక్టు డైరెక్టర్‌గా కె.శీనారెడ్డి పనిచేసిన కాలంలో భారీగా అవినీతి, అక్రమాలు జరిగాయని పీడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్‌ ఈదర మోహన్‌బాబు ఆరోపించారు. కేంద్రం నుంచి ఉపాధి హామీ పథకం కింద వచ్చే నిధులు పెద్దఎత్తున దుర్వినియోగమయ్యాయన్నారు.

శీనారెడ్డి స్వాహారాయుడు
ఒంగోలులోని డ్వామా కార్యాలయం

ఆయన పదవీకాలంలో డ్వామాలో భారీ అవినీతి

పెద్దఎత్తున నిధుల దుర్వినియోగం

విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలి

కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ, సీవీసీకు డీసీసీబీ మాజీ చైర్మన్‌ ఫిర్యాదు

ఒంగోలు, మే 25 (ఆంధ్రజ్యోతి) : జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) ప్రాజెక్టు డైరెక్టర్‌గా కె.శీనారెడ్డి పనిచేసిన కాలంలో భారీగా అవినీతి, అక్రమాలు జరిగాయని పీడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్‌ ఈదర మోహన్‌బాబు ఆరోపించారు. కేంద్రం నుంచి ఉపాధి హామీ పథకం కింద వచ్చే నిధులు పెద్దఎత్తున దుర్వినియోగమయ్యాయన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగుల బదిలీలు, అవుట్‌ సోర్సింగ్‌ నియామకాలు చేసి వారి నుంచి భారీగా వసూళ్లకు పాల్పడ్డారన్నారు. ఆయన అవినీతి, అక్రమాలపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆ మేరకు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ, సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషనర్‌(సీవీసీ)లకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. సహకార శాఖ ఉద్యోగైన శీనారెడ్డి సొంత జిల్లా కూడా ప్రకాశంనే కావడంతో రాజకీయ అండదండలతో డ్వామా పీడీగా డిప్యుటేషన్‌ వేయించుకున్నారని ఆరోపించారు. 2019 ఆగస్టు 27 నుంచి 2024 ఫిబ్రవరి వరకు నాలుగున్నరేళ్లు ఇక్కడే పనిచేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ సమయంలో ఒక ప్రభుత్వ ఉద్యోగిగా కాక రాజకీయ నాయకునిగా శీనారెడ్డి పనిచేశారన్నారు. దోర్నాల మండలంలో 2020-21లో సుమారు రూ.1.84 కోట్ల మేర స్థానిక సిబ్బంది మస్టర్లలో అవినీతికి పాల్పడి తినేసినట్లు సోషల్‌ ఆడిట్‌లో గుర్తించారు. దానిపై కాంట్రాక్టు ఉద్యోగి చేత పరిశీలన చేయించిన శీనారెడ్డి శాఖాపరంగా సరైన విచారణ చేయించలేదన్నారు. ఇందులో అక్కడి ఏపీవో సస్పెండ్‌ కాగా అతని నుంచి రూ.41.03లక్షలు రికవరీ చేయాల్సి ఉందన్నారు. అయితే నామమాత్రంగా రికవరీ చూపి తిరిగి పోస్టింగ్‌ ఇచ్చారని పేర్కొన్నారు. పెద్దారవీడు, కొండపి మండలాల్లో పెద్దఎత్తున యంత్రాలతో పనులు జరగడాన్ని రాష్ట్రస్థాయి అధికారుల బృందాలు గుర్తించాయని, వాటిల్లో భారీగా నిధులు దుర్వినియోగమైనట్లు తేల్చాయన్నారు. ముండ్లమూరు దోర్నాల, కనిగిరి మండలాల్లో 15వ విడత సోషల్‌ ఆడిట్‌లో భారీగా నిధులు దుర్వినియోగమైనట్లు గుర్తించామన్నారు. ఇలా జిల్లా అంతటా శీనారెడ్డి పీడీగా పనిచేసిన కాలంలో భారీగా అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయన్నారు. అందులో అతని పాత్ర కూడా ఉందని ఆరోపించారు. అందువల్లనే బాధ్యులైన సిబ్బందిపై నామమాత్రపు చర్యలతో సరిపెట్టడం లేదా వారి నుంచి డబ్బులు తీసుకుని తిరిగి పోస్టింగ్‌లు ఇవ్వడం చేశారన్నారు. జలకళ నిధుల డిపాజిట్లపై వడ్డీ మొత్తాన్ని శీనారెడ్డి ఆత్మీయుడుగా ఉండే కాంట్రాక్టు ఉద్యోగి అక్రమంగా డ్రా చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఇక వివిధ స్థాయిల సిబ్బంది నియామకాలు, బదిలీల్లో పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించిన మోహన్‌బాబు.. అతని కాలంలో డ్వామాలో జరిగిన లావాదేవీలు, కార్యక్రమాలపై సమగ్ర విచారణ చేయాలని కేంద్రమంత్రిత్వశాఖ, విజిలెన్స్‌ కమిషనర్లను కోరారు. ఫిర్యాదులో కొన్ని అంశాలను పేర్కొన్న మోహన్‌ విచారణలో మరికొన్నింటిని ఆధారాలతో అందజేస్తానని తెలియజేశారు.

Updated Date - May 26 , 2024 | 02:04 AM