Share News

సేవలు నిల్‌.. సూచనలు ఫుల్‌

ABN , Publish Date - May 31 , 2024 | 12:19 AM

‘అంగట్లో అన్నీ ఉన్నా, అల్లుడు నోట్లో శని’ అన్న చందంగా డివిజన్‌ కేంద్రంలోని మార్కాపురం సర్వజన వైద్యశాల పరిస్థితి తయారైంది.

సేవలు నిల్‌.. సూచనలు ఫుల్‌

మార్కాపురం రూరల్‌, మే 30: ‘అంగట్లో అన్నీ ఉన్నా, అల్లుడు నోట్లో శని’ అన్న చందంగా డివిజన్‌ కేంద్రంలోని మార్కాపురం సర్వజన వైద్యశాల పరిస్థితి తయారైంది. జిల్లాలోని పశ్చిమ ప్రకాశం ప్రజలకు అందుబాటులో వైద్య సేవలు ఉంచడం కోసం ప్రభుత్వం సర్వజన వైద్యశాలను ఏర్పాటు చేసింది. పనిచేసే వైద్యుల నిర్లక్ష్యంతో చిన్న చిన్న రుగ్మతలతో వచ్చిన రోగులను సైతం ఏదో ఒక కారణంతో ఒంగోలు రిమ్స్‌కు వెళ్లాలని సూచిస్తూ సరిపెడుతున్నారు.

ప్రజల వద్దకే వైద్య సేవలు అందిస్తున్నామని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రచారాలు నిర్వహిస్తోంది. అయితే ప్రజల వద్దకే కాదు కదా రోగులు వైద్యం కోసం డివిజన్‌ కేంద్రమైన మార్కాపురం సర్వజన వైద్యశాలకు వచ్చినా వారికి సరైన వైద్య సేవలు అందడం లేదు. అన్ని వ్యాధుల కు మార్కాపురం సర్వజన వైద్యశాలలో వైద్యులు అందు బాటులో ఉన్నారంటూ వైద్యశాఖ అధికారులు చెబుతుం టారు. కానీ వాస్తవంగా మార్కాపురం సర్వజన వైద్యశాల లో సుమారు 19 మంది వైద్యులు దాదాపు అన్ని విభాగాల లో ఉన్నప్పటికీ జిల్లా కేంద్రం ఒంగోలు మెడికల్‌ కళాశా లకు రోగులను మెరుగైన వైద్యం కోసం అంటూ రెఫర్‌ చేస్తున్నారు. అయితే అన్ని రకాల వ్యాధులకు వైద్యసేవలు అందిస్తున్నట్లు సమావేశాలలో మాత్రం చెబుతుంటారు. వాస్తవ పరిస్థితుల్లోకి వెళితే ప్రతిరోజు పదుల సంఖ్యలో జిల్లా కేంద్రం ఒంగోలు రిమ్స్‌కు రోగులను పంపిస్తున్నారు.

చిన్న చిన్న రుగ్మతలకు కూడా రెఫర్‌

రోగులు చిన్నచిన్న సమస్యలతో వ్యాధులతో వైద్యం కోసం వస్తున్నప్పటికీ వారిని కూడా ఒంగోలు రిమ్స్‌ వైద్య శాలకు రెఫర్‌ చేస్తున్నారని రోగులు వాపోతున్నారు. తమ వద్ద ఏదో ఒక టెస్టు అందుబాటులో లేదని సాకుగా చూపి స్తూ ఒంగోలు రిఫర్‌ చేస్తున్నారు. మార్కాపురం పరిసర ప్రాంత ప్రజలు దగ్గరలో పెద్ద ఆసుపత్రి ఉంది కదా అన్ని వ్యాధులను న్యాయం చేస్తారన్న నమ్మకంతో ఇక్కడకు వస్తుంటే ఇక్కడి వైద్యులు మాత్రం ఏదో ఒక సాకు చూపి తప్పుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అందుబాటులో ఉండని 108 వాహనాలు

డివిజన్‌లోని మార్కాపురం, తర్లుపాడు, కంభం, బీ.పేట, దోర్నాల, పెద్దారవీడు, వై.పాలెం, కొనకనమిట్ల త్రిపురాంత కం మండలాలకు కేటాయించిన 108 వాహనాల ద్వారా ప్రతిరోజు వందల సంఖ్యలో రోగులను ఒంగోలు రిమ్స్‌కు పంపిస్తున్నారు. దీంతో మార్కాపురం డివిజన్‌లోని వివిధ ప్రాంతాలలో ప్రమాదాలు జరిగినప్పుడు 108 వాహనాలు అందుబాటులో ఉండటం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే స్పందించాల్సిన 108 వాహనాలు అందుబాటులో లేకపోవడం వలన ప్రైవేట్‌ వాహనాల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర సమయాలలో 108 వాహనాలు అందుబాటులో లేక, ప్రైవేట వాహనాలు సమయానికి దొరక్క ప్రమాదాలలో తీవ్రంగా గాయపడిన వారికి ప్రాణాపాయం ఏర్పడే పరిస్థితి ఉందని ప్రజలు వాపోతున్నారు.

Updated Date - May 31 , 2024 | 12:19 AM