Share News

రోడ్డునపడుతున్న సర్పంచ్‌లు

ABN , Publish Date - Mar 06 , 2024 | 01:17 AM

గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేసేందుకు వైసీపీ ప్రభుత్వం వెనుకాడటం లేదు. గ్రామీణ ప్రాంత ప్రజలు ఏమైనా మాకేంటి అన్న విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుండటంతో పంచాయతీ పాలకవర్గాలు ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో రోడ్డు మీదకు రావాల్సిన దుస్థితి నెలకొంది.

రోడ్డునపడుతున్న సర్పంచ్‌లు

ఆర్థిక సంఘం నిధులు డ్రా చేసుకోకుండా ఆంక్షలు

ఇప్పటికే భారీగా దారిమళ్లింపు

సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ అదే పరిస్థితి

నేడు కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన

ఒంగోలు(కలెక్టరేట్‌), మార్చి 5 : గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేసేందుకు వైసీపీ ప్రభుత్వం వెనుకాడటం లేదు. గ్రామీణ ప్రాంత ప్రజలు ఏమైనా మాకేంటి అన్న విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుండటంతో పంచాయతీ పాలకవర్గాలు ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో రోడ్డు మీదకు రావాల్సిన దుస్థితి నెలకొంది. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పంచాయతీ నిధులను రాత్రికి రాత్రే దారిమళ్లించింది. ప్రస్తుతం కూడా అదే విధానాలను అవలంబిస్తుండటంతో సర్పంచ్‌లు మళ్లీ ఆందోళన బాట పడుతున్నారు. ఇప్పటికే కేంద్రం మంజూరు చేసిన ఆర్థికసంఘం నిధులు సుమారు రూ.8,629 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం దారిమళ్లించింది. అందులో మన జిల్లాలో కూడా సుమారు రూ.450 కోట్లకుపైగా ఉన్నాయి. తాజాగా కేంద్రప్రభుత్వం రెండు నెలల క్రితం 15వ ఆర్థికసంఘం నిధులను సుమారు రూ.40కోట్లు మంజూరుచేయగా, వివిధ పన్నుల రూపంలో మరో ఏడెనిమిది కోట్లు పంచాయతీ అకౌంట్లకు చేరాయి. ఆ నిధులను కూడా రాష్ట్రం ప్రభుత్వం దారిమళ్లించేందుకు ప్రయత్నం చేయడంతో పాలకవర్గాలు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఇప్పటికే బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు రాష్ట్రవ్యాప్తంగా వివిధ రూపాల్లో పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టినా ప్రభుత్వం అవేమీ పట్టించుకోలేదు. ప్రస్తుతం కూడా పంచాయతీ నిధులను విద్యుత్‌ బకాయిలు, కార్మికుల జీతాల పేరుతో దారిమళ్లించేందుకు ప్రయత్నిస్తోంది. దీంతో చేసేదేమీ లేక పంచాయతీ సర్పంచ్‌లు మరోసారి ఆందోళన బాట పట్టారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ పంచాయతీ సర్పంచ్‌ల సంఘం ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్‌ ఎదుట ఆందోళనకు దిగుతున్నారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థంచేసుకోవచ్చు.

Updated Date - Mar 06 , 2024 | 01:17 AM