Share News

సాగర్‌ కాలువలను గాలికొదిలేశారు!

ABN , Publish Date - May 26 , 2024 | 02:08 AM

సాగునీటి రంగాన్ని వైసీపీ పాలకులు గాలికొదిలేశారు. ఐదేళ్లుగా సాగర్‌ కాలువల మరమ్మతుల గురించి పట్టించుకో లేదు. దీంతో బ్రాంచ్‌ కాలువలు అధ్వానంగా మారాయి.

సాగర్‌ కాలువలను గాలికొదిలేశారు!
లైనింగ్‌ దెబ్బతిన్న ఒంగోలు బ్రాంచ్‌ కాలువ

ఐదేళ్లుగా పట్టించుకోని వైసీపీ ప్రభుత్వం

అధ్వానంగా మేజర్లు, మైనర్లు

పలుచోట్ల ఆక్రమణలతో కుంచించుకుపోయిన కాలువలు

మరమ్మతుల ఊసే కరువు

ఇబ్బందుల్లో ఆయకట్టు రైతులు

దర్శి, మే 25 : సాగునీటి రంగాన్ని వైసీపీ పాలకులు గాలికొదిలేశారు. ఐదేళ్లుగా సాగర్‌ కాలువల మరమ్మతుల గురించి పట్టించుకో లేదు. దీంతో బ్రాంచ్‌ కాలువలు అధ్వానంగా మారాయి. మేజర్లు, మైనర్లు పూర్తిగా రూపు రేఖలు కోల్పోయాయి. కొన్నిచోట్ల అక్రమా ర్కులు కాలువలను ఆక్రమించుకొని తమ పొలాల్లో కలుపుకొన్నారు. జిల్లాకు జీవనాడిగా మారిన సాగర్‌ కాలువల దుస్థితి ఆయకట్టు దారులకు శాపంగా మారింది. గతంలో ఏడాదికి రెండు పంటలు పండించుకొని ఆనందంగా గడిపిన రైతులకు గత ఐదేళ్లుగా ఒక్క పంటకు కూడా సక్రమంగా నీరు అందలేదు. వైసీపీ పాలకులు సాగునీటి రంగం పట్ల పూర్తి నిర్లక్ష్యవైఖరి అవలంబించారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చేసిన ఆధునికీకరణ పనులు తప్ప, ఆతర్వాత ఒక్క పనికూడా చేయలేదు. కనీసం చిల్లచెట్లు కూడా తొలగించలేదు.

ప్రధాన కాలువల్లోనూ ప్రవాహానికి ఆటంకం

జిల్లాలో 4.5లక్షల ఎకరాల సాగర్‌ ఆయకట్టు ఉంది. అందులో దర్శి నియోజకవర్గంలో లక్ష ఎకరాల వరకూ ఉంది. సాగర్‌ ప్రధాన కాలువ, దర్శి బ్రాంచ్‌ కాలువ, పమిడిపాడు బ్రాంచ్‌ కాలువ, ఒంగోలు బ్రాంచ్‌ కాలువ ద్వారా సాగునీరు అందిస్తారు. గత ఐదేళ్లుగా మరమ్మతులకు నోచుకోకపోవడంతో ప్రధాన కాలువతోపాటు బ్రాంచ్‌ కాలువలు పూడిపోయా ప్రవాహానికి ఆటంకం ఏర్పడుతోంది. కాలువ కట్టలకు ఇరువైపులా చిల్లచెట్లు అడవిలా పెరిగి రూపురేఖలు మారిపోయాయి. దర్శి-ఒంగోలు బ్రాంచ్‌ కాలువల పరిధిలో అనేకచోట్ల లైనింగ్‌ దెబ్బతింది. పలుచోట్ల కట్టలు కోసుకుపోయాయి. కట్టలు దెబ్బతినడంతో సాగునీరు విడుదల చేస్తే తెగిపోయే పరిస్థితి నెలకొంది. దీంతో ఆయకట్టు రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

రూపురేఖలు కోల్పోయిన మేజర్లు, మైనర్లు

సాగర్‌ కాలువల పరిధిలోని మేజర్లు, మైనర్లు రూపురేఖలు కోల్పోయాయి. అనేక మేజర్లు పూడిపోయాయి. కట్టలు కుంచించుకుపోయి పొలాల్లో కలిసిపోయాయి. అనేక మేజర్లు ఆక్రమణలతో ఆనవాళ్లు కూడా కన్పించడం లేదు. దర్శి మైనర్‌ కాలువ దర్శి పట్టణం మధ్యలో నుంచి వెళ్తుంది. అక్కడ స్థలాల ధరలు విపరీతంగా పెరగడంతో ఇరువైపులా ఉన్న కట్టలను ఆక్రమించుకున్నారు. కొన్నిచోట్ల కాలువను కూడా కొంతమేర పూడ్చి కలుపుకున్నారు. ఇరువైపులా నివాసం ఉండే ప్రజలు మురికినీటిని పైపుల ద్వారా మైనర్‌లోకి మళ్లించారు. చెత్తాచెదారం కాలువలో వేస్తున్నారు. దీంతో మైనర్‌ మురికి కాల్వగా మారింది. ఒంగోలు బ్రాంచ్‌ కాలువ పరిధిలోని అనేక మైనర్ల డ్రాపులు దెబ్బతిన్నాయి. తూములు, తలుపులు ధ్వంసమయ్యాయి.

ఆందోళనలో ఆయకట్టు రైతులు

ఖరీఫ్‌ సీజన్‌ వచ్చే నెలలో ఆరంభమవుతుంది. వరుణుడు కరుణిస్తే జూలై నుంచి సాగునీరు విడుదల చేసే అవకాశం ఉంటుంది. కాలువలు అధ్వానంగా మారడంతో చుక్కనీరు కిందికి పోయే పరిస్థితి లేదు. పూర్తిస్థాయిలో నీరు విడుదల చేస్తే కాలువ కట్టలు తెగిపోయే ప్రమాదం ఉంది. దీంతో ఆయకట్టు రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఉన్నతాధికారులు సాగర్‌ కాలువల దుస్థితిని గుర్తించి ఈఏడాదైనా పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయించాలని వారు కోరుతున్నారు.

Updated Date - May 26 , 2024 | 02:08 AM