Share News

‘తల్లి’డిల్లి...

ABN , Publish Date - Nov 17 , 2024 | 11:42 PM

రెండేళ్ల క్రితం భర్త చనిపోయాడు. కూలి పనులు చేసి ఇద్దరు కొడుకులను ఆమె కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. వారిని ఉన్నతస్థాయికి చేర్చాలని ఎన్నో కలలు కనింది. వారి భవిష్యత్తు గురించి ఆశల సౌధాలు కట్టుకుంది. ఆ సౌధాలు ఒక్కసారిగా కుప్పకూలాయి. ఆమె కలలు కన్నీటి సుడుల్లో కరిగిపోయాయి. నీటి ట్రాక్టర్‌ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు ఆ బిడ్డలను కబళించి ఆ తల్లికి కడుపుకోతను మిగిల్చింది.

‘తల్లి’డిల్లి...
బిడ్డ మృతదేహాన్ని చూసి విలపిస్తున్న కుటుంబ సభ్యులు

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన

బిడ్డల మృతదేహాలను చూసి కన్నీరుమున్నీరు

కొప్పోలు వద్ద ద్విచక్ర వాహనాన్ని

వెనుక నుంచి ఢీకొన్న నీటి ట్రాక్టర్‌

ముగ్గురు విద్యార్థుల దుర్మరణం

వారిలో ఇద్దరు అన్నదమ్ములు

ట్యాంకర్‌ డ్రైవర్‌ నిర్లక్ష్యమే కారణం

రిమ్స్‌ వద్ద మిన్నంటిన రోదనలు

రెండేళ్ల క్రితం భర్త చనిపోయాడు. కూలి పనులు చేసి ఇద్దరు కొడుకులను ఆమె కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. వారిని ఉన్నతస్థాయికి చేర్చాలని ఎన్నో కలలు కనింది. వారి భవిష్యత్తు గురించి ఆశల సౌధాలు కట్టుకుంది. ఆ సౌధాలు ఒక్కసారిగా కుప్పకూలాయి. ఆమె కలలు కన్నీటి సుడుల్లో కరిగిపోయాయి. నీటి ట్రాక్టర్‌ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు ఆ బిడ్డలను కబళించి ఆ తల్లికి కడుపుకోతను మిగిల్చింది. విగతజీవులుగా పడి ఉన్నవారిని చూసి అలుపెరగని శోకంతో తల్లడిల్లిపోయింది. ‘‘దేవుడా ఎంత పనిచేశావు.. అభం శుభం తెలియని నా బిడ్డలను ఎందుకు తీసుకెళ్లావు?’’ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా రోదిస్తున్న ఆ తల్లిని సముదాయించడం ఎవరి వల్లా కాలేదు. కొప్పోలు ఆంజనేయస్వామి దేవాలయం సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె ఇద్దరు కుమారులతోపాటు మరో బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. చనిపోయిన ముగ్గురు కొప్పోలుకు చెందినవారు కావడంతో ఆ గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి.

ఒంగోలు (క్రైం), నవంబరు 17 (ఆంధ్రజ్యోతి) : ఒంగోలు నగర పరిధి కొప్పోలులోని అంబేడ్కర్‌నగర్‌కు చెందిన వడ్డే బాలకోటేశ్వరి కూలి పనులు చేసి కుటుంబాన్ని పోషించుకుంటోంది. ఆమె కుమారులు వికాస్‌ (14), విశాల్‌ అలియాస్‌ కుశాల్‌ (11). కొత్తపట్నంలో సంక్షేమ హాస్టల్‌లో ఉంటూ వికాస్‌ తొమ్మిదో తరగతి, విశాల్‌ ఆరో తరగతి చదువుతున్నారు. తన సమీప బంధువు గృహప్రవేశం కోసం శనివారం ఇంటికొచ్చారు. ఆ శుభకార్యానికి అందరిలాగేనే తన పిల్లలు కూడా కొత్త దుస్తులు వేసుకోవాలన్న తపనతో తల్లి డబ్బులు ఇచ్చి తెచ్చుకోమని చెప్పింది. వారి బంధువులైన కన్నెధార బుజ్జిబాబు, పుష్పాంజలి దంపతుల కుమారుడు రేష్మంత్‌ (16) ప్రైవేటు కాలేజీలో ఇంటర్మీడియట్‌ చదువుతున్నాడు. అతని చెల్లెలు పుట్టినరోజు వేడుకకు దుస్తులు కొనుక్కునేందుకు షాపింగ్‌ వెళ్లాలనుకున్నాడు. రేష్మంత్‌తోపాటు వికాస్‌, విశాల్‌ ద్విచక్రవాహనంపై ఒంగోలు వెళ్లి షాపింగ్‌ పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణమయ్యారు. కొప్పోలులోని ఆంజనేయస్వామి గుడి వద్దకు చేరుకునే సరికి వారు ప్రయాణిస్తున్న స్కూటీని వెనుక నుంచి వాటర్‌ ట్యాంకర్‌ ఢీకొట్టడంతో ముగ్గురూ కిందపడిపోయారు. వాటర్‌ ట్యాంకర్‌ ట్రాక్టర్‌ వెనుక చక్రం వారిపై నుంచి వెళ్లింది. స్కూటీని నడుపుతున్న రేష్మంత్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. వికాస్‌ను చికిత్స నిమిత్తం ఒంగోలు తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు విడిచాడు. విశాల్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు.

ఇద్దరు బిడ్డలను పోగొట్టుకున్న తల్లి గర్భశోకం

భర్త బాలకోటయ్యను కోల్పోయిన బాలకోటేశ్వరి తన ఇద్దరు బిడ్డలే ప్రాణంగా బతుకుతోంది. ఆర్థిక స్థోమత లేక తన బిడ్డలను సంక్షేమ హాస్టల్‌లో ఉంచి చదివిస్తోంది. వారి భవిష్యత్తు కోసం కూలీనాలి చేసి పైసాపైసా కూడబెడుతోంది. ఒక్కసారిగా కుమారుల మృతి వార్త విని విలపిస్తూ ఒంగోలులోని ప్రభుత్వ ఆస్పత్రి వద్దకెళ్లింది. తన బిడ్డల మృతదేహాలను చేతుల్లోకి తీసుకుంది. వారి బంగారు భవిష్యత్తు కోసం పడ్డ కష్టాన్ని తలుచుకుంటూ.. దుఃఖాన్ని మాటల్లో వెళ్లగక్కుతూ... తీరని బాధతో బోరున ఏడుస్తున్న ఆమె ప్రళయ రోదనను చూసి అక్కడున్నవారందరి కళ్లు చమర్చారు. పిల్లలు ఇక లేరనే మాట మింగుడు పడక వారితో మాట్లాడుతూ ఉండటం చూసి ఆస్పత్రి వద్ద ఉన్న ప్రతి ఒక్కరూ కంట తడి పెట్టారు.


చెల్లికి దుస్తులు తెస్తానని వెళ్లి తిరిగిరాని లోకాలకు..

తన చెల్లి పుట్టినరోజు వేడుకకు కొత్త దుస్తులు తెస్తానని చెప్పి వెళ్లిన రేష్మంత్‌ రెండు నిమిషాల్లో ఇంటికి చేరుకుంటాడానుకునేలోపే తిరిగి రాని లోకాలకు వెళ్లాడన్న వార్త విని అతని కుటుంబం కన్నీరుమున్నీరైంది. రేష్మంత్‌ తండ్రి బుజ్జిబాబు ఒంగోలు మున్సిపల్‌ కార్పొరేషన్‌లోని వాటర్‌వర్క్స్‌ విభాగంలో పనిచేస్తూ పిల్లలను చదివించుకుంటున్నాడు. చేతికి అందివస్తున్న బిడ్డ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో తల్లి పుష్పాంజలి, తండ్రి బుజ్జిబాబు తల్లడిల్లిపోతున్నారు.

కొప్పోలులో విషాదఛాయలు

కొప్పోలు అంబేడ్కర్‌ నగర్‌లో ముగ్గురు బాలురు రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడటంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. గ్రామంలో అందరూ విషన్న వదనంలోకి వెళ్లిపోయారు. వేడుక ఇంటి వద్ద ఉన్నవారంతా అక్కడ చేస్తున్న పనులు పక్కన పెట్టి ఒంగోలు రిమ్స్‌ ఆసుపత్రికి చేరారు. గ్రామంలో ఎక్కడ చూసినా బరువెక్కిన హృదమాలతో కంటతడి పెడుతున్నారు.

ట్రాక్టర్‌ డ్రైవర్‌ నిర్లక్ష్యం

ఒంగోలు నుంచి కొప్పోలుకి నీటి ట్యాంకర్‌తో వెళుతున్న ట్రాక్టర్‌ డ్రైవర్‌ నిర్లక్ష్యంగా నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు. డ్రైవర్‌ స్థానిక జయప్రకాష్‌ కాలనీకి చెందిన యన్‌.శివప్రసాద్‌. అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలాన్ని ఒంగోలు డీఎస్పీ ఆర్‌.శ్రీనివాసరావు, మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌ కిరణ్‌ ప్రభాకర్‌, తాలుకా సీఐ అజయ్‌కుమార్‌ పరిశీలించారు. చుట్టుపక్కల వారిని విచారించారు. ప్రమాదానికి కారణాన్ని అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు తాలుకా ఎస్సై పావని కేసు నమోదు చేశారు.

Updated Date - Nov 17 , 2024 | 11:42 PM