సబ్ సెంటర్‌కు రూ.వెయ్యి!
ABN , Publish Date - Jun 17 , 2024 | 11:12 PM
జిల్లా వైద్యారోగ్యశాఖకు అవినీతి జబ్బు చేసింది. ఇక్కడ పనిచేసే కొందరు సిబ్బంది అందివచ్చిన ప్రతి అవకాశాన్నీ ఆదాయవనరుగా మార్చుకుంటున్నారు. వసూళ్లపర్వం కొనసాగిస్తున్నారు. ఇప్పటికే అనేక ఆరోపణలు, విచారణలు ఎదుర్కొంటున్న ఆశాఖలో తాజాగా ఆడిట్ పేరుతో సబ్‌సెంటర్‌ల సిబ్బంది నుంచి ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్నారు. అసలు బాధ్యత చూసే ఉద్యోగి కాకుండా కాంట్రాక్టు ఉద్యోగి అన్నీ తానై ఈ వ్యవహారాన్ని సాగిస్తున్నాడు.

ఆడిట్ పేరుతో అడ్డగోలు వసూలు
వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో కాంట్రాక్టు ఉద్యోగి నిర్వాకం
పట్టించుకోని ఉన్నతాధికారులు
ఒంగోలు (కలెక్టరేట్), జూన్ 17 : జిల్లా వైద్యారోగ్యశాఖకు అవినీతి జబ్బు చేసింది. ఇక్కడ పనిచేసే కొందరు సిబ్బంది అందివచ్చిన ప్రతి అవకాశాన్నీ ఆదాయవనరుగా మార్చుకుంటున్నారు. వసూళ్లపర్వం కొనసాగిస్తున్నారు. ఇప్పటికే అనేక ఆరోపణలు, విచారణలు ఎదుర్కొంటున్న ఆశాఖలో తాజాగా ఆడిట్ పేరుతో సబ్‌సెంటర్‌ల సిబ్బంది నుంచి ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్నారు. అసలు బాధ్యత చూసే ఉద్యోగి కాకుండా కాంట్రాక్టు ఉద్యోగి అన్నీ తానై ఈ వ్యవహారాన్ని సాగిస్తున్నాడు.
కాంట్రాక్టు ఉద్యోగి ఇష్టారాజ్యం
రికార్డులను సబ్‌సెంటర్‌ల నుంచి తెచ్చి ఆడిట్ బృందానికి సమర్పించాల్సి ఉంటుంది. ఆ బాధ్యతను డీఎంహెచ్‌వో కార్యాలయం ఎస్టాబ్లిష్ సెక్షన్‌లోని ఒక ఉద్యోగి చూడాలి. కానీ అందుకు భిన్నంగా మరో విభాగంలో పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగికి అప్పగించారు. ఆయన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడు. జిల్లాలో 82 పీహెచ్‌సీలు, యూపీహెచ్‌ల పరిధిలో 638 సబ్ సెంటర్లు ఉన్నాయి. వాటికి సెంటర్‌ను బట్టి రేటు నిర్ణయించి వసూళ్లు ప్రారంభించాడు. ఒక్కో సబ్ సెంటర్ నుంచి కనీసం రూ.వెయ్యికి తగ్గకుండా తీసుకుంటున్నట్లు సమాచారం. తాము ఎలాంటి తప్పులు చేయకపోయినా ఆడిట్ బృందం ఏదో ఒక సాకు చూపి ఇబ్బందులు పెడుతుందన్న భయంతో సదరు ఉద్యోగి అడిగినంత మొత్తాన్ని సబ్‌సెంటర్ల సిబ్బంది ఇచ్చి వెళ్తున్నారు. కొందరు డబ్బులు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నిస్తే ఆడిట్ బృందానికి భోజనాలు, ఇతరత్రా ఖర్చులుంటాయని చెప్పి సదరు ఉద్యోగి వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులు పట్టించుకోవడం విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికైనా జోక్యం చేసుకుని ఈ వ్యవహారానికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది.
ఒకేసారి మూడేళ్ల ఆడిట్
వైద్యారోగ్యశాఖలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో సబ్ సెంటర్లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులను మంజూరు చేస్తున్నాయి. ఆ సొమ్మును ఎలా ఖర్చుచేశారు? ఎందుకోసం చేశారు? తదితర అంశాలపై ఏటా ఆడిట్ జరుగుతుంది. ఏవైనా అక్రమాలు, లోటుపాట్లు జరిగినట్లు ఆడిట్ బృందం గుర్తిస్తే బాధ్యులపై చర్యలు తీసుకోవడంతోపాటు నిధులను రికవరీ చేయాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా మూడేళ్లుగా ఆడిట్ నిర్వహించలేదు. 2021-22, 2022-2023, 2023-24 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి ప్రస్తుతం ఒకేసారి వైద్యశాఖ కార్యాలయంలో ఆడిట్ జరుగుతోంది.