ఆగస్టు నాటికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ
ABN , Publish Date - Mar 06 , 2024 | 11:40 PM
వచ్చే ఖరీఫ్ నాటికి ముంపు బాధితులకు ఆర్‌అండ్ ఆర్ ప్యాకేజీ పరిహారం డబ్బులు ఇస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. మండలంలోని కొత్తూరు వద్ద నిర్మిస్తున్న పశ్చిమ ప్రకాశం ఆశల సౌధం పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు పైలాన్‌ను ముఖ్యమంత్రి బుధవారం అవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు.

వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో సీఎం జగన్
పెద్ద దోర్నాల, మార్చి 6 : వచ్చే ఖరీఫ్ నాటికి ముంపు బాధితులకు ఆర్‌అండ్ ఆర్ ప్యాకేజీ పరిహారం డబ్బులు ఇస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. మండలంలోని కొత్తూరు వద్ద నిర్మిస్తున్న పశ్చిమ ప్రకాశం ఆశల సౌధం పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు పైలాన్‌ను ముఖ్యమంత్రి బుధవారం అవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ప్రకాశం, కడప, నెల్లూరు జిల్లాల్లోని 30 మండలాలకు చెందిన 15.25 లక్షల ప్రజలకు రక్షిత మంచి నీటిని, 4.47 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే లక్ష్యంతో వైఎస్సార్ ఈ ప్రాజెక్టును ప్రారంభించారన్నారు. కాంగ్రెస్ పాలనలో నిర్మాణ పనులు వేగంగా జరిగాయని, టీడీపీ హయాంలో పనులు నెమ్మదించాయన్నారు. ప్రాజెక్టులో ప్రధానమైన మొదటి సొరంగం 2021లో, రెండో సొరంగం ఇప్పుడు దేవుడి దయతో మీ ఆశీర్వాదంతో వచ్చిన బిడ్డ రెండు టన్నెళ్లను పూర్తి చేసి జాతికి అంకితం చేస్తున్నట్లు చెప్పారు. జూలై, అగస్టులో డ్యాంకు నీరొస్తే 840 అడుగుల దాటిన వెంటనే రోజుకో టీఎంసీ నీటినిప్రాజెక్టు ద్వారా నల్లమల సాగర్ రిజర్వాయర్‌కు తరలిస్తామన్నారు. ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చి నిర్వాసితులకు రూ.1200కోట్లు ఎల్‌ఏ ఆర్ అండ్ ఆర్ పూర్తి చేసి జలాశయాలకు నీటిని తరలిస్తామన్నారు. అనంతరం ఎర్రగొండపాలెం అభ్యర్థిగా చంద్రశేఖర్, ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని మీకు పంపానన్నారు. గిద్దలూరు, మార్కాపురం నాగార్జునరెడ్డి, అన్నా రాంబాబు, ఒంగోలు బాలినేనిని, సురే్‌షను పరిచయం చేశారు. కార్యక్రమంలో అంబటి రాంబాబు, మేరుగ నాగార్జున, జంకె వెంకట రెడ్డి, బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, సుధాకర్‌బాబు, బుర్రా మధుసూదన్‌రావు, వైవీ సుబ్బారెడ్డి, బూచేపల్లి వెంకాయమ్మ, పోతుల సునీత, కొమ్మూరి కనకారావు పాల్గొన్నారు.
మీ పల్లకి మోయాలి.. మా సమస్యలు పట్టవా?
సీఎం సభకు అనుమతించకపోవడంపై కార్యకర్తల ఆగ్రహం
మా ఓట్లు కావాలి, మీ పల్లకి మోయాలి కానీ మాకు అనుమతించరు.. సమస్యలు వినరా అంటూ వైసీపీకార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి బుధవారం హాజరవుతున్న నేపథ్యంలో అభిమానులు కార్యకర్తలు తమ నాయకుడిని చూసేందుకు, సమస్యలు చెప్పుకునేందుకు ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. కాగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. వీఐపీ పాసులు చూపించినా అనుమతించలేదు. దీంతో కార్యకర్తలు గొడవకు దిగారు. నియోజకవర్గం, మండల స్థాయి నాయకులు జోక్యం చేసుకుని పోలీసులను బతిమిలాడినా అనుమతించలేదు. పైగా ఎండలు మండిపోతున్నాయి. అంతెందుకు ప్రభుత్వ అనుమతి మేరకు ముఖ్యమంత్రి పర్యటనను కవర్ చేసేందుకు కలెక్టర్ మంజూరు చేసిన పాసులతో వెళ్లిన విలేకరులను కూడా పోలీసులు చాలా సేపు గ్యాలరీలోకి అనుమతించలేదు. డీపీఆర్‌వో విజ్ఞప్తి మేరకు 15 నిమిషాల అనంతరం అనుమతించారు. సామాన్య కార్యకర్తలకు అవకాశం లేక, ఎండకు బయట ఉండలేక ఆ పార్టీ నాయకులను నిందిస్తూ ఉసూరుమంటూ వెనుదిరిగారు.
సీఎం వస్తున్నారని ముందస్తు అరెస్టులు
ఇళ్ల వద్ద రాజకీయ నేతల నిర్బంధాలు
మార్కాపురం వన్‌టౌన్, మార్చి 6: సీఎం జగన్ వస్తున్నారని ప లువురు సీపీఐ, సీపీఎం నాయకులను పోలీసులు నిర్బంధం విధించారు. వెలిగొండ ప్రాజెక్టు ప్రా రంభోత్సవ కార్యక్రమం లో పాల్గొనేందుకు జగ న్‌రెడ్డి కొత్తూరుకు వచ్చా రు. ఈ నేపథ్యంలో పోలీసులు పట్టణంలోని సీపీఐ నాయకుడు నాసరయ్య, సీపీఎం నాయకుడు సోమయ్య, రఫి, బీజేపీ నాయకులు పీవీ కృష్ణారావు, జీవీ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా అందె నాసరయ్య మాట్లాడుతూ పశ్చిమ ప్రాంత ప్రజల ఆశాజ్యోతి అయిన పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణ పనులను పూర్తి చేయకుండానే కేవలం ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని రాజకీయ లబ్ది పొందేందుకు మాత్రమే పైలాన్ ఆవిష్కరించడం ప్రజలను వంచించడమేనన్నారు. ముంపు గ్రామాల ప్రజలకు ఆర్‌ఆర్ ప్యాకేజీ ఇవ్వకుండా ప్రారంభోత్సవం చేయడం మరోసారి మోసం చేయడమేనని విమర్శించారు.