రోడ్లు..రోత
ABN , Publish Date - Oct 21 , 2024 | 12:29 AM
గడిచిన ఐదేళ్లలో నాటి వైసీపీ ప్రభుత్వం రహదారులను గురించి పట్టించుకోలేదు. గ్రామాల్లో సైడు కాలువల ఊసే లేకుండా పోయింది.
గడిచిన ఐదేళ్లలో నాటి వైసీపీ ప్రభుత్వం రహదారులను గురించి పట్టించుకోలేదు. గ్రామాల్లో సైడు కాలువల ఊసే లేకుండా పోయింది. దీంతో పల్లెముంగిళ్లలో బురదదారులు వెక్కిరిస్తున్నాయి. ఇటీవల తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు రోడ్లు మరీ అధ్వానంగా తయారయ్యాయి. అడుగుతీసి అడుగువేయలేని పరిస్థితి నెలకొంది.
మార్కాపురం, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): మార్కాపురంలో ప్రధానంగా చెరువుకట్టపై ప్రయాణం చేయాలంటే ప్రజలు బెంబేలెత్తుతు న్నారు. అలుగు సమీపంలో రహదారిపై అడుగుకో గుంత దర్శినమిస్తోంది. అటుగా వెళ్లాలంటేనే భయపడాల్సి వస్తోంది. అదేవిధంగా కొండేపల్లి రహదారి పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. బీటీ రహదారి కావడంతో వర్షపు నీరు నిలిచి పూర్తిగా ధ్వంసమైంది. పలుచోట్ల రోడ్డు కుంటలను తలపిస్తోంది. నూతన రహదారులు నిర్మించకపోయినా, కూటమి ప్రభుత్వం తక్షణమే మరమ్మతులు చేయాల్సి ఉంది.
కనిపించని డ్రైనేజీ -రోడ్డుపైనే వర్షం నీరు
గిద్దలూరు : గిద్దలూరు మున్సిపాలిటి పరిధిలోని శివారు ప్రాంతాలలో మురుగునీటి కాలువలు కనిపించడం లేదు. దీంతో చిన్నపాటి వర్షం కురిసినా ఆ నీరంతా రోడ్లపైనే నిలిచి ఉంటోంది. మెటల్ రోడ్లలో వర్షం నీరు నిలిచి బురదమయంగా మారి దుర్వాసన వెదజల్లుతోంది. కనీసం నడిచేందుకు వీలుకాని పరిస్థితి ఏర్పడుతున్నది. అర్బన్ కాలనీలో పలు రోడ్లతోపాటు సబ్‌స్టేషన్‌కు వెళ్లే రహదారి అధ్వాన్నంగా ఉంది. ఆయా రోడ్లు, కాలువలు నిర్మించాలని ఆప్రాంత ప్రజలు కోరుతున్నారు.
ప్రధాన రహదారులు బురదమయం
కంభం : కంభంలోని హోండా షోరూం పక్కన ప్రధాన రహదారి, విద్యానగర్, వాల్మీకినగర్, అర్బన్ కాలనీ తదితర ప్రాంతాలలో వర్షం నీరు వెళ్లేందుకు డ్రైనేజీలు నిర్మించక పోవడంతో రోడ్లపైనే వర్షం నీరు నిలుస్తోంది. దీంతో బురదమయంగా మారింది. అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి నెలకొన్నది. విద్యార్థులు, వృద్ధులు, మహిళలు ఈ రోడ్లపై నడిచేం దుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ద్విచక్ర వాహనదారులు అయితే వాహనాలతో సహా కిందపడి గాయాలపాలు అవుతున్నారు.
మార్కాపురం రూరల్ : మార్కాపురం నుంచి ఒంగోలు, రైల్వేస్టేషన్ రోడ్డుపై గోతులు అధికంగా పడ్డాయి. పట్టణంలోకి వచ్చే రోడ్డు మార్కెట్ యార్డు వద్ద లోతైన గోతులు ఏర్పడ్డాయి. తర్లుపాడు నుండి మార్కాపురం రోడ్డు అల్లూరి పోలేరమ్మ గుడి వద్ద, సీతా నాగులవరం వెళ్ళే రోడ్డు గుంతలమయంగా మారింది. మండలంలోని గజ్జలకొండ రోడ్డుపై రాయవరం మోకాళ్ల లోతు గోతులు పడ్డాయి. పట్టణంలోని కళాశాల రోడ్డులో లక్కి షాపు వద్ద, రీడింగ్ రూమ్ సమీపంలోని ప్రధాన రోడ్డు పై గుంతలు ఏర్పడ్డాయి. తక్షణమే రహదారులను మరమ్మతులు చేయాలని ప్రజలు కోరుతున్నారు.