Share News

రసవత్తరంగా దర్శి

ABN , Publish Date - Mar 13 , 2024 | 01:05 AM

తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి బీజేపీతో జతకట్టిన నేపథ్యంలో జిల్లాలో దర్శి నియోజకవర్గ రాజకీయం రసవత్తరంగా మారింది. తొలుత టీడీపీ, జనసేన మధ్య జరిగిన ఒప్పందంలో దర్శిని జనసేనకు కేటాయించాలని నేతలు నిర్ణయం తీసుకున్నారు.

రసవత్తరంగా దర్శి

బరిలో టీడీపీ అభ్యర్థే?

పరిశీలనలో శిద్దా, కృష్ణచైతన్య, డాక్టర్‌ లక్ష్మి పేర్లు

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి బీజేపీతో జతకట్టిన నేపథ్యంలో జిల్లాలో దర్శి నియోజకవర్గ రాజకీయం రసవత్తరంగా మారింది. తొలుత టీడీపీ, జనసేన మధ్య జరిగిన ఒప్పందంలో దర్శిని జనసేనకు కేటాయించాలని నేతలు నిర్ణయం తీసుకున్నారు. ఆ స్థానం కోసం జనసేన నాయకులు గట్టిగా పట్టుబట్టారు. దీటైన అభ్యర్థిని ఇరు పార్టీలు కలిసి ఎంపిక చేయాలని భావించారు. అయితే బీజేపీతో కూడా ఎన్నికల అవగాహన కుదరడంతో రాష్ట్రంలో టీడీపీ పోటీచేసే స్థానాల్లో ఒకదాన్ని, జనసేన మూడు స్థానాలను వదులుకున్నాయి. జనసేన వదులుకున్న మూడింటిలో దర్శి ఒకటని సమాచారం. దీంతో తెలుగుదేశం పార్టీ నుంచి దర్శి టికెట్‌ ఆశిస్తున్న వారిలో పోటీ పెరిగింది. అధికారికంగా దర్శి నుంచి టీడీపీ, జనసేనల్లో ఎవరూ పోటీచేస్తారనే విషయం ప్రకటించలేదు. అయినా తెలుగుదేశమే రంగంలో ఉండనున్నట్లు తెలుస్తోంది. జనసేన 24 నుంచి మూడు స్థానాలు తగ్గించుకున్నందున జిల్లాలో మరోస్థానం కోరుకునే అవకాశం కూడా లేదంటున్నారు. పైగా టీడీపీ పోటీ చేయబోయే 144 స్థానాల్లో ఉమ్మడి జిల్లాలో ఆ పార్టీ అభ్యర్థులను ప్రకటించని గిద్దలూరు, మార్కాపురం, చీరాల, కందుకూరు కూడా ఉన్నాయి. దీంతో జనసేన ఇతర జిల్లాల్లో ఉన్న అవసరాల దృష్ట్యా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మరోస్థానం కోరుకునే అవకాశం లేదని తెలుస్తోంది. పైగా ఆపార్టీ తరఫున అధినేత పవన్‌కల్యాణ్‌కు నమ్మకస్తుడైన జిల్లా అధ్యక్షుడు రియాజ్‌కు భవిష్యత్‌లో సముచిత అవకాశాలు ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. అలాగే మార్కాపురం జనసేన నాయకుడు ఇమ్మడి కాశీనాథ్‌కు కూడా తగు ప్రాధాన్యం ఇస్తామని ఆపార్టీ నేతలు చెప్పినట్లు తెలిసింది. చీరాలకు చెందిన ఆమంచి స్వాములుకు పార్టీలో ప్రాధాన్యత ఉన్నప్పటికీ ఆయన పదవికి రాజీనామా చేయడంతో ఆపార్టీ నాయకులు అసంతృప్తిలో ఉన్నట్లు సమాచారం. పైగా చీరాలలో ఆయన సోదరుడు కృష్ణమోహన్‌ స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసే అవకాశాన్ని పరిగణనలోకి తీసుకొని ఒక అంచనాకు వస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో దర్శి నుంచి కూడా టీడీపీ అభ్యర్థే రంగంలో ఉండవచ్చనే స్పష్టత కనిపిస్తోంది. దీంతో దర్శి టికెట్‌ ఆశిస్తున్న ఆశావాహుల నుంచి పోటీ పెరిగింది.

పెరిగిపోయిన ఆశావహులు

వైసీపీ నుంచి టీడీపీలో చేరి దర్శి నుంచి పోటీ చేసేందుకు పలువురు ప్రయత్నిస్తున్నారు. దీంతో టీడీపీ కూడా అభ్యర్థి ఎంపికను సీరియస్‌గా తీసుకొని గెలుపు అవకాశాలను పరిశీలిస్తోంది. మాజీ మంత్రి శిద్దా రాఘవరావు విషయంలో అనేక అవకాశాలు ఇచ్చినప్పటికీ టీడీపీ నుంచి వెళ్లి వైసీపీలో చేరారన్న భావనను ఆ పార్టీ అగ్రనేత వ్యక్తం చేసినట్లు తెలిసింది. అయితే ఇద్దరు కీలక నాయకులు శిద్దాను రంగంలో దింపితే మంచి ఫలితం ఉంటుందని, ఆర్యవైశ్య సామాజికవర్గం నుంచి ఉపయోగం ఉంటుందని సూచించారు. మార్కాపురం నుంచి ఆర్యవైశ్య సామాజికవర్గం అభ్యర్థి పేరును పరిశీలిస్తున్న టీడీపీ అధిష్ఠానం అటు వైపునకు ప్రాధాన్యత ఇస్తోంది. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డితోపాటు టీడీపీలో చేరేందుకు శిద్దా రాఘవరావు సిద్ధమైనట్లు సమాచారం. అయితే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ పార్టీని వీడిన వారిని రానివ్వకూడదనే నిర్ణయంతో ఉన్నందున ఏమి జరుగుతుందో చూడాల్సి ఉంది. జిల్లాలో సీనియర్‌ నాయకులు, మాజీ ఎమ్మెల్యే గరటయ్యతోపాటు అద్దంకి వైసీపీ ఇన్‌చార్జిగా ఉన్న కృష్ణచైతన్యలు టీడీపీలో చేరేందుకు సిద్ధమై బాబును కలిసి ఉన్నారు. డాక్టర్‌ గరటయ్యకు చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అద్దంకితోపాటు పర్చూరు, ఎస్‌ఎన్‌పాడు నియోజకవర్గాల్లో గరటయ్య ప్రభావం ఉండొచ్చనేది జగమెరిగిన సత్యం. వారు ప్రస్తుతం దర్శి టికెట్‌ను ఆశిస్తున్నారు. ఇంకోవైపు మాజీ మంత్రి గొట్టిపాటి హనుమంతరావు మనుమరాలు, మాజీ ఎమ్మెల్యే నరసయ్య కుమార్తె అయిన డాక్టర్‌ లక్ష్మి కూడా టికెట్‌ను ఆశిస్తున్నారు. ఆమె భర్త డాక్టర్‌ లలిత్‌, మామ డాక్టర్‌ వెంకటేశ్వర్లు నరసరావుపేట టీడీపీలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. దర్శి నుంచి డాక్టర్‌ లక్ష్మి ముందుకు రావడంతో ముగ్గురిలో టీడీపీ అవకాశం ఎవరికి దక్కుతుందనేది సందిగ్ధంగా మారింది.

Updated Date - Mar 13 , 2024 | 01:05 AM