Share News

అకుంఠిత దీక్ష, పట్టుదలతో సివిల్స్‌లో ర్యాంకు

ABN , Publish Date - Apr 19 , 2024 | 01:36 AM

అదో కఠిన పరీక్ష... ప్రతి యువకుడు సాధించేందుకు తపన పడే సివిల్స్‌ సర్వీసెస్‌. ఆ లక్ష్యాన్ని సాధించాలంటే ఎంతో కఠోర సాధనతోపాటు అకుంఠిత దీక్ష, పట్టుదల అవసరం.

అకుంఠిత దీక్ష, పట్టుదలతో సివిల్స్‌లో ర్యాంకు
కుటుంబ సభ్యులతో రాహుల్‌కుమార్‌ (ఫైల్‌)

తల్లిదండ్రుల ప్రోత్సాహం, భార్య సహకారం మరువలేనిది

504 ర్యాంకర్‌ రాహుల్‌కుమార్‌

కనిగిరి, ఏప్రిల్‌ 18: అదో కఠిన పరీక్ష... ప్రతి యువకుడు సాధించేందుకు తపన పడే సివిల్స్‌ సర్వీసెస్‌. ఆ లక్ష్యాన్ని సాధించాలంటే ఎంతో కఠోర సాధనతోపాటు అకుంఠిత దీక్ష, పట్టుదల అవసరం. అలాంటి సివిల్స్‌ పరీక్షల్లో 504 స్థానాన్ని సాధించి కనిగిరి ప్రాంతానికి పేరు తీసుకువచ్చిన రాహుల్‌కుమార్‌ను ప్రతిఒక్కరూ అభినందిస్తున్నారు. రాహుల్‌ స్వగ్రామం వెలిగండ్ల మండలం మొగళ్లూరు. తండ్రి వంగేపురం రత్నకుమార్‌ పశుసంవర్థకశాఖలో (ఈహెచ్‌ఏ)గా పీసీపల్లి మండలం ముద్దపాడు గ్రామంలో విధులు నిర్వర్తిస్తున్నారు. తల్లి వయోలారాణి కనిగిరి మండలం చింతలపాలెం హైస్కూల్‌లో ఉపాధ్యాయినిగా పనిచేస్తున్నారు. వృత్తిరీత్యా వీరిద్దరూ గత 25 ఏళ్లుగా కనిగిరిలో నివాసం ఉంటున్నారు. తమ ఒక్కగానొక్క కుమారుడు రాహుల్‌ ఉన్నత స్థాయిలో ఉండాలన్నదే వారి ఆకాంక్ష. రాహుల్‌ కనిగిరి పట్టణంలోని ప్రగతి విద్యానిలయంలో పదో తరగతి 2009లో పూర్తి చేశారు. ఇంటర్మీడియట్‌ నెల్లూరు నారాయణ కళాశాలలో చదివారు. 2011 నుంచి 2015 వరకు కాకినాడ జేఎన్‌టీయూ ఇంజనీరింగ్‌ పూర్తి చేశాడు.

కలెక్టర్‌ కావాలన్నదే లక్ష్యం.. రాహుల్‌

చిన్ననాటి నుంచి నాకు కలెక్టర్‌ కావాలన్న కోరిక బలంగా ఉండేది. ఇంజనీరింగ్‌ పూర్తయిన అనంతరం ఢిల్లీలో ఒక ఏడాది కోచింగ్‌ తీసుకున్నా. ఆతర్వాత స్వీయ శిక్షణతో నిరంతరం పుస్తకపఠనం, కొత్త విషయాలను తెలుసుకోవడం, గూగుల్‌ ద్వారా జనరల్‌ నాలెడ్జ్‌ పెంపొందించుకుంటూ వచ్చా. పోటీ పరీక్షలకు హాజరవుతూ 2017లో 701వ ర్యాంకు సాధించా. ఆర్యాంకు ద్వారా ఐఆర్‌ఎస్‌, ఐఎఫ్‌ఎస్‌లలో ఉద్యోగం వచ్చేది. అయితే, కలెక్టర్‌ కావాలన్నదే నా సంకల్పం. వాటిలో చేరకుండా మళ్లీ సాధన చేశా. 2024 యూపీఎస్‌సీ ఫలితాల్లో 504 ర్యాంకు పొంది లక్ష్యాన్ని సాధించా. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోపాటు భార్య సహకారం మరువలేనిది.

Updated Date - Apr 19 , 2024 | 01:36 AM