Share News

పెంచారు.. ఆపేశారు!

ABN , Publish Date - Jan 03 , 2024 | 12:30 AM

ప్రతి నెలా ఏ ఒక్కరితో సంబంధం లేకుండా నేరుగా వలంటీర్ల ద్వారా అందించే పింఛన్‌ సొమ్ముకు ఈనెలలో ప్రభుత్వం ఎమ్మెల్యేలతో లింకు పెట్టింది.

పెంచారు.. ఆపేశారు!
కనిగిరి నగర పంచాయతీ కార్యాలయంలో పింఛన్‌లు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే బుర్రా

జిల్లాలో పింఛన్ల పంపిణీ ఆలస్యం

పెంపు మహోత్సవాల పేరుతో ఆర్భాటం

ఈనెల 8వరకు నిర్వహించాలని ఆదేశం

ఎమ్మెల్యేలకు సమయం కుదిరితేనే పంపిణీ

గ్రామాల్లో లబ్ధిదారుల ఎదురుచూపులు

ప్రతి నెలా ఏ ఒక్కరితో సంబంధం లేకుండా నేరుగా వలంటీర్ల ద్వారా అందించే పింఛన్‌ సొమ్ముకు ఈనెలలో ప్రభుత్వం ఎమ్మెల్యేలతో లింకు పెట్టింది. పెంపు మహోత్సవాలంటూ హడావుడి చేయాలని, శాసనసభ్యులను పిలవాలని ఆదేశించింది. అయితే జిల్లాలోని ఎమ్మెల్యేలంతా ఎన్నికల వైపు దృష్టి సారించారు. తమకు టికెట్‌ దక్కుతుందో, లేదోనన్న మీమాంసలో ఉన్నారు. ప్రభుత్వమేమో స్థానిక ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో పింఛన్‌లు పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు డీఆర్‌డీఏ, వైకేపీ అధికారులు తేదీలను కూడా ఖరారు చేసి ప్రకటించారు. దీంతో ఈ నెలలో పింఛన్‌ సొమ్ము లబ్ధిదారులకు అందటం ఆలస్యమయ్యే పరిస్థితి అనివార్యమైంది.

ఒంగోలు నగరం, జనవరి 2 : ప్రతినెలా ఒకటో తేదీనే ఇంటికే వచ్చి అందించే పింఛన్‌ సొమ్ము ఈ నెలలో చేతికందేందుకు వారం రోజులపైనే పట్టనుంది. ఈనెల నుంచి ఫింఛన్‌ను రూ.3 వేలు చేసిన రాష్ట్రప్రభుత్వం జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో పింఛన్‌ పెంపు మహోత్సవాలు నిర్వహించి వాటికి ఎమ్మెల్యేలను ఆహ్వానించి వారి ద్వారా ఇప్పించాలని ఆదేశించింది. ఇందుకోసం ప్రతి మండలానికి పంపిణీ చేసే తేదీని ముందుగానే ప్రకటించింది. జనవరి ఒకటో తేదీన కనిగిరి, ఒంగోలు నియోజకవర్గాల్లో పంపిణీ చేయనున్నట్లు డీఆర్‌డీఏ అధికారులు నిర్ణయించారు. 2న హెచ్‌ఎంపాడు, కనిగిరి, పీసీపల్లి, మార్కాపురం, ఒంగోలులో పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. 3న దొనకొండ, ముండ్లమూరు, గిద్దలూరు, పామూరు, వెలిగండ్ల, మర్రిపూడి, చీమకుర్తి, ఎన్‌జీపాడు, ఎస్‌ఎన్‌పాడు, దోర్నాల, పెద్దారవీడు, త్రిపురాంతకం, వైపాలెం, 4న కురిచేడు, కంభం, జరుగుమల్లి, శింగరాయకొండ, పొదిలిల్లో పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. 5న దర్శి, బీపేట, కొమరోలు, కొండపి, పొన్నలూరు, టంగుటూరు, కొనకనమిట్ల, 6న తాళ్లూరు, అర్ధవీడు, ఒంగోలు అర్బన్‌, గిద్దలూరు, 8న గిద్దలూరు, రాచర్ల, మద్దిపాడు మండలాల్లో పింఛన్ల పంపిణీ ఉంటుందని ప్రకటించారు. అయితే జిల్లాలో ఎక్కడా స్థానిక ఎమ్మెల్యేలు పింఛన్‌ పెంపు మహోత్సవాల్లో పాల్గొనేందుకు ఆసక్తిచూపడం లేదు. జనవరి 1,2 తేదీల్లో ప్రకటించిన మండలాల్లో కూడా ఎమ్మెల్యేలు హాజరు కాకుండానే స్థానిక ప్రజాప్రతినిధులతో వైఎస్సార్‌కేపీ ఉద్యోగులు మహోత్సవాలు నిర్వహించి పంపిణీని ప్రారంభించారు. అయితే మండలంలోని లబ్ధిదారులందరికీ పూర్తిస్థాయిలో ఇవ్వకుండా కొద్దిమందికే పంపిణీ చేస్తున్నారు. ఇక మిగిలిన మండలాల్లో కూడా ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారమే పింఛన్‌ పెంపు మహోత్సవాలు నిర్వహించిన తర్వాతే పంపిణీ ప్రారంభించాల్సి ఉంది కాబట్టి ఈ నెల 8వ తేదీ వరకు పంపిణీ జిల్లా మొత్తం మీద ప్రారంభం కాని పరిస్థితి నెలకొంది.

కొత్తగా 3,731 పింఛన్లు మంజూరు

జిల్లాలో గతనెల వరకు 2,93,684 సామాజిక పింఛ న్లు ఉన్నాయి. ఈ నెలలో కొత్తగా 3,731 మంజూరు చేసింది. కొత్త పింఛన్లతో కలుపుకొని జిల్లాలో మొత్తం పింఛన్లు 2,97,415కి చేరాయి. కొత్తగా మంజూరైన వారికి కూడా రూ.3వేల వంతున ఈనెల నుంచే పింఛన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి.

అవసరమైన నిధులు రూ.88.98 కోట్లు

జిల్లాలో మొత్తం సామాజిక పింఛన్లు 2,97,415 ఉన్నాయి. వీటికి నెలవారీగా రూ.88.98 కోట్లు అవసరం. మొత్తం పింఛన్‌లలో వృద్ధాప్య, వితంతు, చేనేత, ఒంటరి మహిళల, కల్లుగీత కార్మికుల పింఛన్లు 2,47,638 ఉన్నాయి. ఈ లబ్ధిదారులకు మాత్రమే ఇప్పటివరకు రూ.2,750 ఇస్తున్నారు. వీటిని ప్రభుత్వం ఇప్పుడు రూ.3 వేలకు పెంచింది. ఇవిపోను హెచ్‌ఐవీ బాధితులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి రూ.3వేలకుపైనే ప్రభుత్వం పింఛన్‌ ఇస్తూ వస్తోంది. రూ.3 వేలకు తక్కువగా ఉన్న పింఛన్లనే ప్రభుత్వం రూ.3వేలు చేసి ఈ నెల నుంచి పంపిణీ చేయాలని నిర ్ణయించింది.

విడుదలైంది రూ.46.26 కోట్లు

ప్రభుత్వం ఆర్భాటంగా ఈనెల నుంచి పింఛన్లను రూ. 3వేలకు పెంచుతున్నట్లు ప్రక టించింది. అందుకు తగ్గట్లుగా అవసరమైన మేరకు నిధులను విడుదల చేయలేదు. రూ.46.26 కోట్లు మాత్రమే ఇచ్చింది. నిధులు లేకనే పెంపు మహోత్సవాల పేరుతో పింఛన్ల పంపిణీని ఆలస్యం చేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో శాసనస భ్యులు ఈ మహోత్సవాల్లో పాల్గొని పింఛన్లు పెంచామని చెప్పుకునేందుకు పెద్దగా ఆసక్తి కూడా చూపడం లేదు. అయితే నిధులు లేక మహోత్సవాల పేరుతో పంపిణీని ఈ నెల 8వతేదీ వరకు చేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పటివరకు పింఛన్ల పంపిణీకి అవసరమైన నిధుల్లో సగం మాత్రమే జిల్లాకు విడుదల య్యాయి.

Updated Date - Jan 03 , 2024 | 12:31 AM