Share News

రాఘవరెడ్డి సరికొత్తగా..

ABN , Publish Date - Apr 19 , 2024 | 11:58 PM

ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గంలో మాగుంట కుటుంబీకులు టీడీపీ కూటమి ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రధానంగా టీడీపీ కూటమి ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి కుమారుడు రాఘవరెడ్డి ప్రచారంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొందరు కీలక నాయకులను టీడీపీ కూటమిలోకి రాబట్టడంలోనూ, రాజకీయాలకు అతీతంగా తటస్థవాదుల మద్దతు పొందటంలోనూ రాఘవరెడ్డి కీలకంగా వ్యవహరిస్తున్నారు. తండ్రీకొడుకులతో పాటు కుటుంబ సభ్యులలోని పలువురు మహిళలు, పురుషులు నియోజకవర్గాల్లో ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

రాఘవరెడ్డి సరికొత్తగా..
దర్శిలో కూటమి అభ్యర్థుల సభలో రాఘవరెడ్డి, మాట్లాడుతున్న అభ్యర్థి లక్ష్మి

ప్రచారంలో మాగుంట కుటుంబం

చక్రం తిప్పుతున్న రాఘవరెడ్డి

సూటి ప్రసంగాలతో ఆకట్టుకుంటున్న వైనం

ఆంధ్రజ్యోతి, ఒంగోలు :

ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గంలో మాగుంట కుటుంబీకులు టీడీపీ కూటమి ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రధానంగా టీడీపీ కూటమి ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి కుమారుడు రాఘవరెడ్డి ప్రచారంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొందరు కీలక నాయకులను టీడీపీ కూటమిలోకి రాబట్టడంలోనూ, రాజకీయాలకు అతీతంగా తటస్థవాదుల మద్దతు పొందటంలోనూ రాఘవరెడ్డి కీలకంగా వ్యవహరిస్తున్నారు. తండ్రీకొడుకులతో పాటు కుటుంబ సభ్యులలోని పలువురు మహిళలు, పురుషులు నియోజకవర్గాల్లో ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

గత 28 సంవత్సరాలుగా మాగుంట కుటుంబం ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గంలో రాజకీయంగా ప్రత్యేక స్థానం సొంతం చేసుకుంది. తొలుత 1991లో ఆ కుటుంబ పెద్ద దివంగత మాగుంట సుబ్బరామిరెడ్డి ఎంపీగా గెలుపొందారు. తీవ్రవాదుల చేతుల్లో 1995లో ఒంగోలు నడిబొడ్డులో ఆయన హత్యకు గురైన తర్వాత ఆయన సతీమణి పార్వతమ్మ ఆ తర్వాత ఆయన సోదరుడు శ్రీనివాసులరెడ్డి రాజకీయాల్లో ఆరంగేట్రం చేశారు. ఇప్పటికీ ఆరు పర్యాయాలు ఒంగోలు లోక్‌సభ నుంచి ఆ కుటుంబ సభ్యులు గెలుపొందారు. రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గ ప్రజలతో సన్నిహిత సంబంధాలను ఆ కుటుంబం కొనసాగిస్తోంది. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలుపొందిన శ్రీనివాసులరెడ్డికి ఈ ఎన్నికల్లో వైసీపీ టికెట్‌ నిరాకరించింది. స్థానికంగా టీడీపీ నాయకులతో పాటు ఆ పార్టీ అఽధినేత చంద్రబాబుతో మంచి సంబందాలు ఉన్న మాగుంట కొంతకాలం క్రితం టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. ఈ పర్యాయం ఎన్నికల్లో రాఘవరెడ్డిని పోటీలో దింపాలని శ్రీనివాసులురెడ్డి భావించినా చంద్రబాబు సూచనలతో శ్రీనివాసులరెడ్డి లోక్‌సభ నుంచి టీడీపీ కూటమి అభ్యర్థిగా రంగంలో నిలిచారు.

పరిచయాలను పెంచుకుంటూ..

తొలుత టీడీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలను రాఘవరెడ్డి కలిసి పార్టీ పరమైన రాజకీయ సంబంధం పెంచుకున్నారు. వెంటనే రాఘవరెడ్డి నియోజకవర్గంలోని అన్నీ అసెంబ్లీ స్థానాల్లో తిరుగుతూ తన తండ్రితో పాటు టీడీపీ కూటమిలోని అసెంబ్లీ అభ్యర్థుల ప్రచారానికి శ్రీకారం పలికారు. ముఖ్యంగా ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీలో ఉన్న వారిని టీడీపీలోకి తీసుకురావటంలోను, వారిని స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థులతో సమన్వయం చేయటంలోను, ఆయా వర్గాల ప్రముఖుల మద్దతును రాబట్టటంలోను రాఘవరెడ్డి ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఆయన సమక్షంలో కొండపి, దర్శి, మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెం లాంటి నియోజకవర్గాల్లో పలువురు టీడీపీలో చేరటం విశేషం. కింది స్థాయిలో పట్టున్న నాయకులను రాబట్టగలిగారు. ఒంగోలు అభ్యర్థి మాగుంట కనిగిరి, ఒంగోలు లాంటి నియోజకవర్గాల్లో కొందరు నాయకులతో పాటు వారి కుటుంబ శ్రేయోభిలాషులను టీడీపీకి మద్దతు ఇచ్చేందుకు కృషి చేసి సఫలీకృతులయ్యారు. నామినేషన్ల ఘట్టం ప్రారంభంకావటంతో తండ్రీకొడులకుతో పాటు మిగిలిన కుటుంబ సభ్యులు ప్రచార కార్యక్రమానికి శ్రీకారం పలికారు.

ప్రభుత్వ నిధులు రాకున్నా.. సొంత డబ్బుతో పనులు

మాగుంట కుటుంబం తరఫున తమ స్వంత నిఽధులతో మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చేపట్టిన సంస్థల్లోని ప్రతినిధులతో ఆ కుటుంబ మహిళలు కలిసి టీడీపీ కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. గత నాలుగేళ్లుగా ప్రభుత్వం నుంచి సరైన సహకారం లేక, ప్రభుత్వ నిధులతో అభివృద్ధి పనులు చేపట్టలేక మాగుంట కుటుంబం స్వంత నిఽధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. గ్రామాల్లో రోడ్లు, గ్రామాల మధ్య లింక్‌ రోడ్లు, పొలాలకు వెళ్లే రహదారులు అభివృద్ధి, తాగునీటి, డ్రైనేజీ లాంటి సమస్యల పరిష్కారానికి స్వంత నిఽధులతో పనులు నిర్వహిస్తున్నారు. ఆయా పనుల ద్వారా వీరిని గౌరవిస్తున్న సాధారణ ప్రజలను టీడీపీ కూటమి అభ్యర్థులకు ఓటు వేయాలని స్వయంగా వెళ్లి కలిసి చెబుతున్నారు. ప్రత్యేకించి పశ్చిమ ప్రాంతంపై దృష్టి కేంద్రీకరించి ఊరూవాడా ప్రచార కార్యక్రమాలు చేపట్టారు. మార్కాపురంలో నివాస గృహం ఏర్పాటు చేసుకొని అన్నీ ప్రాంతాలకు వెళ్లి పనిచేస్తున్నారు. అవసరమైన కార్యక్రమాల్లో తప్పా మిగిలిన సందర్భాల్లో తండ్రీకొడుకులు నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రచారం చేస్తున్నారు.

ఈ కార్యక్రమాల్లో మాగుంట రాఘవరెడ్డి చేస్తున్న ప్రసంగాలు, చెబుతున్న మాటలు హైలెట్‌గా నిలుస్తున్నాయి. ప్రధానంగా టీడీపీ కూటమి నాయకులు, కార్యకర్తలకు ఉత్సాహన్ని కల్పించే విధంగా తక్కువ సమయంలో చెప్పదలుచుక్ను, అంశాలను ఆయన సూటిగా చెప్పి అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. మీకు కూటమి పార్టీల అండ ఉంది, మేమున్నాం ధైర్యంగా నిలబడి పనిచేయండి. మీ భవిష్యత్తు మేము చూసుకుంటాం అంటూ మూడు పార్టీల శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు. ఇంకోవైపు జనసేన, బీజేపీ నాయకులతో సమన్వయంగా ఆ పార్టీ శ్రేణులను కలుపుకుపోటవంతో సఫలీకృతులవుతున్నారు.

Updated Date - Apr 19 , 2024 | 11:58 PM