Share News

నేటి నుంచి పొగాకు కొనుగోళ్లు

ABN , Publish Date - Feb 29 , 2024 | 01:25 AM

రాష్ట్రంలో ప్రస్తుత సీజన్‌ పొగాకు కొను గోళ్లు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. మొత్తం మూడు విడత లుగా ఈ ఏడాది చేపట్టనుండగా తొలిదశ లో జిల్లాలోని ఒంగోలు-1, కొండపి కేంద్రాల్లో వేలం మొదలవుతోంది.

నేటి నుంచి పొగాకు కొనుగోళ్లు
మాక్‌ వేలంలో భాగంగా హ్యాండ్‌ సెట్స్‌ను పరిశీలిస్తున్న బోర్డు ఆర్‌ఎం

ఒంగోలు-1, కొండపిలలో తొలిదశ వేలం

పాల్గొననున్న బోర్డు చైర్మన్‌, ఈడీ

గతం కన్నా సాగు, పంట ఉత్పత్తి అధికం

భారీగా పెరిగిన పెట్టుబడి ఖర్చులు

కిలో రూ.250 ప్రారంభ ధర కోరుతున్న రైతులు

ఒంగోలు, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రస్తుత సీజన్‌ పొగాకు కొను గోళ్లు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. మొత్తం మూడు విడత లుగా ఈ ఏడాది చేపట్టనుండగా తొలిదశ లో జిల్లాలోని ఒంగోలు-1, కొండపి కేంద్రాల్లో వేలం మొదలవుతోంది. అందుకు అవసరమైన ఏర్పాట్లను బోర్డు అధికారులు పూర్తిచేశారు. రెండేళ్లుగా పొగాకు మార్కెట్‌ బాగానే ఉండి రైతులు కాస్తంత లాభాలు పొందినప్పటికీ ప్రస్తుత సీజన్‌లో పెరిగిన ఉత్పత్తి ఖర్చులకు అనుగుణంగా ధరలు పెంచి ఇస్తే తప్ప భవిష్యత్‌ పంట సాగుకు భరోసా ఉండదన్న అభిప్రాయం రైతుల్లో వ్యక్తమవుతోంది. ప్రతి ఐదేళ్లలో మూడేళ్లు తీవ్రఒడుదొడుకులు ఎదుర్కొనే పొగాకు మార్కెట్‌ వరుసగా గత రెండేళ్లు మంచి డిమాండ్‌తో సాగింది. పంట ఉత్పత్తి చేయగలిగిన రైతులకు లాభాలను తెచ్చిపెట్టింది. గతేడాది రాష్ట్రంలో ఎన్నడూ లేనంతగా ధరలు లభించి బ్యారన్‌కు సగటున రెండు నుంచి మూడు లక్షల రూపాయల వరకూ మిగిలింది.

ఈ ఏడాది భారీగా పంట సాగు

ప్రస్తుత ఏడాది (2023-24) కూడా రాష్ట్రంలో 142 మిలియన్‌ కిలోల పంట ఉత్పత్తికి బోర్డు అనుమతించింది. దక్షిణాది వరకు చూస్తే రెండు రీజియన్లలో నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో 11 వేలం కేంద్రాలు ఉండగా 57,100 హెక్టార్ల విస్తీర్ణంలో పంట సాగుకు, 88.68 మిలియన్‌ కిలోల పంట ఉత్పత్తికి పొగాకు బోర్డు అనుమతి ఇచ్చింది. అయితే గత రెండేళ్ల నుంచి మార్కెట్‌ సానుకూలంగా ఉండి లాభాలు రావడం, ఇతర పలు పంటలు ఆశాజనకంగా లేకపోవడం, వాతావరణ పరిస్థితుల్లో మార్పులు ఇలా అనేక కారణాలతో పంట సాగు భారీగా పెరిగి తదనుగుణంగా ఉత్పత్తి కూడా అధికమైంది. బోర్డు లెక్కల ప్రకారం దాదాపు 72,100 హెక్టార్లలో పంట సాగు కాగా సుమారు 135 నుంచి 137 మిలియన్‌ కిలోల పంట ఉత్పత్తి కావచ్చని అంచనా. ఇది పొగాకు మార్కెట్‌కు తీవ్ర ప్రతికూల అంశం కాగా ఉత్పత్తి ఖర్చులు మరింతగా పెరిగాయి. ప్రధానంగా భూముల కౌలు, బ్యారన్‌ అద్దెలు, కూలీల వేతనాలు ఇతరత్రా అన్ని ఖర్చులు అధికమయ్యాయి. ఒక్కో బ్యారన్‌కు గతంలో సగటున రూ.5లక్షల వరకు అవు తుండగా ప్రస్తుత ఏడాది అది రూ.7లక్షలకు పైమాటగానే చెప్తున్నారు.

ప్రారంభ ధరపైనే ఆశలు

ఈనేపథ్యంలో రాష్ట్రంలో తొలివిడతగా ఎస్‌బీఎస్‌ రీజయన్‌లోని ఒంగోలు-1, కొండపి కేంద్రాల్లో గురువారం నుంచి పొగాకు వేలం ప్రారంభించాలని బోర్డు అధికారులు నిర్ణయించారు. తదనుగుణంగా ఏర్పాట్లు కూడా చేశారు. ఒంగోలు-1 కేంద్రంలో గురువారం ఉదయం బోర్డు ఈడీ అద్దంకి శ్రీధర్‌బాబు, కొండపిలో బోర్డు చైర్మన్‌ చిడిపోతు యశ్వంత్‌కుమార్‌ ప్రారంభించనున్నారు. ఒంగోలులో ఏర్పాట్లను ఆర్‌ఎం లక్ష్మణరావు బుధవారం పరిశీలించారు. ఇదిలా ఉండగా ఈ ఏడాది ధరలు బాగానే ఉంటాయన్న అభిప్రాయం ఉన్నప్పటికీ ఈ ఏడాది పెరిగిన ఉత్పత్తి వ్యయం, ప్రతికూల పరిస్థితుల్లో పంట సాగు అంశాలను పరిగణనలోకి తీసుకొని ధరలు మరింతగా పెంచాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. గతేడాది దక్షిణాదిలో ఫిబ్రవరి 24నుంచి వేలం ప్రక్రియ ప్రారంభం కాగా తొలిరోజు కిలో రూ.200 ప్రారంభ ధర పలుకగా సగటున సీజన్‌ మొత్తం కిలో రూ.218.34 లభించింది. కాగా ఈ ఏడాది తొలిరోజున కిలో రూ.250 ధర ఇవ్వాలని, అలాగే సీజన్‌ మొత్తంగా కిలో రూ.260 సగటు ధర లభించేలా చూడాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - Feb 29 , 2024 | 01:25 AM