Share News

అవినీతి అధికారులపై వేటు

ABN , Publish Date - Feb 28 , 2024 | 01:25 AM

పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)లో బోగస్‌ గ్రూపులు సృష్టించి భారీగా రుణ దోపిడీకి పాల్పడిన పలువురు అధికారులపై వేటు పడింది.

అవినీతి అధికారులపై వేటు

మెప్మాలో ఇద్దరు సీవోలు, ఐదుగురు ఆర్పీలు ఉద్యోగాల నుంచి తొలగింపు

పలువురికి మెమోలు

ఒంగోలు (కార్పొరేషన్‌), ఫిబ్రవరి 27 : పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)లో బోగస్‌ గ్రూపులు సృష్టించి భారీగా రుణ దోపిడీకి పాల్పడిన పలువురు అధికారులపై వేటు పడింది. ఇద్దరు సీవోలు, ఐదుగురు ఆర్పీలను ఉద్యోగం నుంచి తొలగిస్తూ మెప్మా మిషన్‌ ఎండీ విజయలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. మరికొందరికి చార్జిమెమోలు ఇచ్చారు. పట్టణ పొదుపు మహిళల ఆర్థికాభివృద్ధి కోసం ప్రభుత్వం పలు రుణాలు అందించగా.. కొందరు ఆర్పీలు, సీవోలు అధికారపార్టీ నేతలతో కలిసి నకిలీ గ్రూపులను సృష్టించి భారీగా దోచుకున్న వైనాన్ని ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తెచ్చింది. ఈ బాగోతంపై వరుస కథనాలు ప్రచురించింది. స్పందించిన కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ విచారణకు ఆదేశించారు. డీఆర్‌డీఏ పీడీ, సివిల్‌ సప్లయీస్‌ అధికారి, లీడ్‌ బ్యాంకు మేనేజర్లు గత వారం ఆర్పీలు, సీవోలు, ఇతర సిబ్బందిని విచారించారు. దీంతోపాటుగా పలు బ్యాంకుల్లో విచారణ చేసి ఆ నివేదికను కలెక్టర్‌కు అందజేశారు. అదేసమయంలో పీడీ కూడా నివేదికను మెప్మా ఎండీకి పంపారు. దీనిపై ఆమె సీరియస్‌ అయ్యారు. ఈ వ్యవహారంలో భాగస్వాములైన మరో ఇద్దరు సీవోలు చాంద్‌బీ, నిర్మల,ఆర్పీలు ఏవీ.సుజాత, సలోమి, పి.సుజాత, ఝాన్సీరాణి, వాసవిలను ఉద్యోగం నుంచి తొలగించారు. సీఎంఎం, ఐదుగురు సీవోలకు మెమోలు జారీ చేశారు. ఇదిలా ఉండగా పీడీ టి.రవికుమార్‌ ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ ఇప్పటివరకూ ప్రాఽథమిక విచారణలో పలువురిను గుర్తించి విధుల నుంచి తొలగించగా, కొందరికి మెమోలు జారీ చేసినట్లు తెలిపారు. విచారణ ఇంకా కొనసాగుతుందని, అయితే ఇప్పటికే అవినీతికి పాల్పడిన కొందరు ఆర్పీలు బోగస్‌ గ్రూపుల పేరుతో పొందిన రుణాలను తిరిగి చెల్లిస్తున్నారని తెలిపారు. త్వరలోనే పూర్తి నివేదికను కలెక్టర్‌ దినేష్‌కుమార్‌, మెప్మా ఎండీ విజయలక్ష్మికి అందజేస్తామని తెలిపారు.

Updated Date - Feb 28 , 2024 | 01:25 AM