Share News

అవ్వకు అవస్థ

ABN , Publish Date - Jan 18 , 2024 | 01:09 AM

ఇద్దరు కొడుకులు ఉన్నా ప్రయోజకులు కాలేదు. దీంతో ఎలాంటి ఆధారం లేక ఆమెకు నోటిలోకి ముద్ద వెళ్లడమే గగనమైంది.

అవ్వకు అవస్థ

పింఛన్‌ కోసం పడిగాపులు

ఎనిమిది నెలలుగా తిరుగుతున్నా కనికరించని అధికారులు

కంభం, జనవరి 17 : ఇద్దరు కొడుకులు ఉన్నా ప్రయోజకులు కాలేదు. దీంతో ఎలాంటి ఆధారం లేక ఆమెకు నోటిలోకి ముద్ద వెళ్లడమే గగనమైంది. పింఛన్‌ కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఇది ఒక దీనురాలి స్థితి. బుధవారం ఎంపీడీవో కార్యాలయం నుంచి 65ఏళ్ల వృద్ధురాలు వస్తుండటం చూసి ‘ఆంధ్రజ్యోతి’ పలుకరించగా ఆమె తన గోడు వెళ్లబోసుకుంది. ‘నా పేరు తరిట కమల. నాకు 65 సంవత్సరాలు. కంభం పంచాయతీ పరిధిలోని మేదరవీధిలో ఉంటున్నాను. ఇద్దరు కొడుకులున్నా వారు ప్రయోజకులు కాలేదు. బతుకు భారమై వృద్ధాప్య లేదా వితంతు పింఛన్‌ ఇప్పించాలని అధికారులు, ప్రజాప్రతినిధులను వేడుకుంటున్నాను. అటు సచివాలయానికి, ఇటు ఎంపీడీవో కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ఎవరూ కనికరించడం లేదు. నా భర్త పెద్దవెంకటేశ్వర్లు కూరగాయలు అమ్మి కుటుంబాన్ని పోషించేవారు. ఆయన 8 నెలలక్రితం మృతిచెందారు. దీంతో ఆయనకొచ్చే వృద్ధాప్య పింఛన్‌ నిలిచిపోయింది. అప్పటి నుంచి తనకు పింఛన్‌ ఇప్పించాలని కాళ్లరిగేలా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా కనికరించడం లేదు. ఆయన పోయాక పూట గడవడం కష్టమైంది. అధికారులను అడిగితే నీకు కచ్చితంగా పింఛన్‌ వస్తుందన్నారు. నేటికీ దిక్కులేదు. జనవరిలో కొత్త పింఛన్ల లిస్టులో నా పేరు లేదు. అధికారుల వద్ద సమాధానం లేదు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. దరఖాస్తు చేసుకుంటే పింఛన్‌ ఇస్తామని చెప్తున్న వైసీపీ పాలకులు తన కష్టం తెలుసుకొని పింఛన్‌ ఇచ్చి ఆదుకోవాలని ఆ అవ్వ కోరింది.

Updated Date - Jan 18 , 2024 | 01:09 AM