Share News

ధరలు పైపైకి..

ABN , Publish Date - May 19 , 2024 | 01:19 AM

దక్షిణాది పొగాకు మార్కెట్లో జోరు కొనసాగుతూనే ఉంది. రోజురోజుకూ ధరలు పైపైకి పోతున్నాయి. శనివారం మేలురకం గరిష్ఠ ధర గతం కన్నా మరో రూ.3 పెరిగి కిలో రూ.311 లభించింది. ఈ సీజన్‌ ప్రారంభం నుంచి మార్కెట్‌ పరుగులు తీస్తోంది.

ధరలు పైపైకి..

పొగాకు మార్కెట్‌లో కొనసాగుతున్న జోరు

కిలో రూ.311 పలికిన గరిష్ఠ ధర

ఒంగోలు, మే 18 (ఆంధ్రజ్యోతి): దక్షిణాది పొగాకు మార్కెట్లో జోరు కొనసాగుతూనే ఉంది. రోజురోజుకూ ధరలు పైపైకి పోతున్నాయి. శనివారం మేలురకం గరిష్ఠ ధర గతం కన్నా మరో రూ.3 పెరిగి కిలో రూ.311 లభించింది. ఈ సీజన్‌ ప్రారంభం నుంచి మార్కెట్‌ పరుగులు తీస్తోంది. తొలుత నెలరోజులకుపైగా మేలురకం ధరలు కిలో రూ.250కి అటుఇటు నిలకడగా సాగుతూ మీడియం, లోగ్రేడ్‌లకు డిమాండ్‌ వచ్చి ధరలు పెరిగాయి. దీంతో రైతులు కూడా మేలురకం బేళ్లను ఇళ్ల వద్ద ఉంచుకొని లోగ్రేడ్‌ బేళ్లను వేలం కేంద్రాలకు తెస్తున్నారు. ఇప్పటికి కూడా ఆయా వేలం కేంద్రాలలో చూస్తే మేలురకం కన్నా మీడియం, లోగ్రేడ్‌ బేళ్లే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కొద్దిమొత్తంలోనే మేలురకం తెస్తున్నారు. ఈ నేపథ్యంలో పక్షం రోజులుగా మేలురకం ధరలను కూడా వ్యాపారులు పెంచారు. క్రమంగా ఆ ధరలు పెరుగుతున్నాయి. వారం క్రితం కిలో గరిష్ఠ ధర రూ.300కు చేరుకోగా, మూడు రోజుల క్రితం రూ.305, శుక్రవారం రూ.308, శనివారం మరో రూ.3 పెరిగి రూ.311కు చేరింది. ఒంగోలు-2 వేలం కేంద్రంలో ఈ ధర లభించగా, ఒంగోలు-1లో గరిష్ఠ ధర రూ.310.. ఇతర కేంద్రాల్లోనూ రూ.305 అంతకన్నా ఎక్కువగానే పలికింది. ఇక బ్రౌన్‌, లోగ్రేడ్‌లోని పచ్చధరలు కూడా బాగానే ఉండటంతోపాటు బేళ్ల కోసం పలు కంపెనీల బయ్యర్లు పోటీ పడుతుండటం మార్కెట్లో కనిపిస్తోంది. ఇప్పటివరకు ఈ సీజన్‌లో సుమారు 50 మిలియన్‌ కిలోల పొగాకు కొనుగోళ్లు జరగ్గా సగటున కిలోకు రూ.339 వరకు ధర లభించింది. రానున్న రోజుల్లో మేలురకం బేళ్ల ధరలు మరికొంత పెరిగే అవకాశం ఉంది.

Updated Date - May 19 , 2024 | 01:19 AM