Share News

అ‘ధర’హో..

ABN , Publish Date - May 08 , 2024 | 01:55 AM

పొగాకు మార్కెట్‌ మురిపిస్తోంది. పలు రకాల గ్రేడ్‌లకు రికార్డు స్థాయి ధరలు లభిస్తున్నాయి. మంగళవారం మేలు రకం ఏకంగా కిలో రూ.300 పలికింది.

అ‘ధర’హో..

పొగాకు కిలో రూ.300

పొదిలి వేలం కేంద్రంలో లభించిన గరిష్ఠ ధర

బోర్డు చరిత్రలోనే దక్షిణాదిలో ఇదే అధికం

ఒంగోలు-1లో రూ.301పలికినా తిరస్కరణ

ఒంగోలు, మే 7 (ఆంధ్రజ్యోతి) : పొగాకు మార్కెట్‌ మురిపిస్తోంది. పలు రకాల గ్రేడ్‌లకు రికార్డు స్థాయి ధరలు లభిస్తున్నాయి. మంగళవారం మేలు రకం ఏకంగా కిలో రూ.300 పలికింది. పొగాకు బోర్డు చరిత్రలోనే దక్షిణాదిలో ఇంత ధర లభించడం ఇదే ప్రథమం. పొదిలి కేంద్రంలో ఈ రేటు ఇవ్వగా, ఒంగోలు-1 కేంద్రంలో ఒక బేలు కిలో రూ.300, మరో బేలు రూ.301 పలికాయి. అయితే ఆ బేళ్లలో కొంత పొగాకు బాగాలేదన్న సాకు చూపి వాటిని కొనుగోలు చేసిన కంపెనీ రిజెక్ట్‌ (సీఆర్‌)గా ప్రకటించింది. అందుకు అక్కడి వేలం నిర్వహణాధికారులు అంగీకరించడంతో ఆ ధరలు రద్దయ్యాయి, దీంతో పొదిలిలో లభించిన కిలో రూ.300 అధిక ధర అయ్యింది. ఇతర కేంద్రాల్లో గరిష్ఠ ధరలు కిలో రూ.299 వద్ద నిలిచిపోయాయు. అదేసమయంలో లోగ్రేడ్‌లో నాణ్యమైన బ్రౌన్‌ రకం రేటు కూడా కిలో రూ.265 నుంచి 270 వరకూ పలుకుతోంది. ఇటు మేలురకం, అటు బ్రౌన్‌ రకం గ్రేడ్‌ల బేళ్ల కోసం పలు కంపెనీల బయ్యర్లు పోటీపడుతున్నారు. దక్షిణాదిలో ప్రస్తుత సీజన్‌లో ఇప్పటి వరకూ సుమారు 42 మిలియన్‌ కిలోల పొగాకు విక్రయాలు జరగ్గా సగటున కిలోకు రూ.231 ధర లభించింది.

Updated Date - May 08 , 2024 | 01:55 AM