Share News

ప్రలోభాలతో సిద్ధం

ABN , Publish Date - Mar 08 , 2024 | 11:12 PM

వైసీపీ నిర్వహిస్తున్న సిద్ధం సభకు వెళ్లేందుకు జనం సుముఖంగా లేరని తేలిపోయింది. దీంతో బెంబేలెత్తిన ఆపార్టీ అభ్యర్థులు అటు నాయకులకు, ఇటు సభకు వచ్చే వారికి భారీ ఎత్తున తాయిలాల పంపిణీకి శ్రీకారం పలికారు. మండల, గ్రామాల వారీగా వాహనాలను సిద్ధం చేసినా పార్టీ శ్రేణులే కదలరని గుర్తించి వారికి నగదును ఎర వేశారు. మరోవైపు వలంటీర్లకు డబ్బులకు తోడు అదనంగా బహుమతులు ఇచ్చి ప్రలోభపెడుతున్నారు. మార్కాపురంలో గురువారం ప్రతి వలంటీర్‌కు ఒక రైస్‌కుక్కర్‌ పంపిణీ చేయడం అందుకు నిదర్శనం. ఇప్పటికే గిద్దలూరు, కనిగిరి, మార్కాపురం, పొదిలి ప్రాంతాల్లో వైసీపీ కౌన్సిలర్లకు డబ్బులు పంపిణీ చేయగా, మిగిలిన చోట్ల కూడా అందుకు రంగం సిద్ధమైంది. నాయకులు కదిలినా ప్రజల నుంచి స్పందన లేదన్న విషయాన్ని గుర్తించి సభకు వచ్చే వారికి ఆయా పాంతాల్లో రోజుకూలితోపాటు పలావు ప్యాకెట్‌, అడిగిన వారికి లిక్కర్‌ బాటిల్‌ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. తద్వార మేదరమెట్ల వద్ద జరిగే సిద్ధం సభకు జనసమీకరణలో ముందున్నామని అనిపించుకునేందు వైసీపీ అభ్యర్ధులు నానా తంటాలు పడుతున్నారు.

ప్రలోభాలతో సిద్ధం

రాజకీయ నేతలకు డబ్బులు.. వచ్చేవారికి రోజుకూలి

అదనంగా పలావు పొట్లాలు, లిక్కర్‌ బాటిళ్లు

పశ్చిమప్రాంతంలో కౌన్సిలర్‌కు రూ.2లక్షల చొప్పున పంపిణీ

వలంటీర్లకు డబ్బులతోపాటు విలువైన బహుమతులు

మార్కాపురంలో రైస్‌ కుక్కర్ల అందజేత

సభకు జనం సిద్ధం కాకపోవడంతో వైసీపీ నేతల బెంబేలు

వైసీపీ నిర్వహిస్తున్న సిద్ధం సభకు వెళ్లేందుకు జనం సుముఖంగా లేరని తేలిపోయింది. దీంతో బెంబేలెత్తిన ఆపార్టీ అభ్యర్థులు అటు నాయకులకు, ఇటు సభకు వచ్చే వారికి భారీ ఎత్తున తాయిలాల పంపిణీకి శ్రీకారం పలికారు. మండల, గ్రామాల వారీగా వాహనాలను సిద్ధం చేసినా పార్టీ శ్రేణులే కదలరని గుర్తించి వారికి నగదును ఎర వేశారు. మరోవైపు వలంటీర్లకు డబ్బులకు తోడు అదనంగా బహుమతులు ఇచ్చి ప్రలోభపెడుతున్నారు. మార్కాపురంలో గురువారం ప్రతి వలంటీర్‌కు ఒక రైస్‌కుక్కర్‌ పంపిణీ చేయడం అందుకు నిదర్శనం. ఇప్పటికే గిద్దలూరు, కనిగిరి, మార్కాపురం, పొదిలి ప్రాంతాల్లో వైసీపీ కౌన్సిలర్లకు డబ్బులు పంపిణీ చేయగా, మిగిలిన చోట్ల కూడా అందుకు రంగం సిద్ధమైంది. నాయకులు కదిలినా ప్రజల నుంచి స్పందన లేదన్న విషయాన్ని గుర్తించి సభకు వచ్చే వారికి ఆయా పాంతాల్లో రోజుకూలితోపాటు పలావు ప్యాకెట్‌, అడిగిన వారికి లిక్కర్‌ బాటిల్‌ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. తద్వార మేదరమెట్ల వద్ద జరిగే సిద్ధం సభకు జనసమీకరణలో ముందున్నామని అనిపించుకునేందు వైసీపీ అభ్యర్ధులు నానా తంటాలు పడుతున్నారు.

ఆంధ్రజ్యోతి, ఒంగోలు

రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా సిద్ధం పేరుతో భారీ సభలను వైసీపీ నిర్వహిస్తోంది. అందులో భాగంగా ఆదివారం ఉమ్మడి జిల్లాలోని కొరిశపాడు మండలం మేదరమెట్ల సమీపంలో సభ జరగనుంది. సీఎం జగన్‌ పాల్గొననున్నారు. నిజానికి 3వ తేదీ జరగాల్సిన సభను జనసమీకరణ కోసం 10వ తేదీకి వాయిదా వేశారు. తదనుగుణంగా ఉమ్మడి జిల్లాలోని పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు లేనిచోట్ల ప్రస్తుత ఇన్‌చార్జిలకు బాధ్యతలు అప్పగించారు. ఒంగోలులో ఆపార్టీ నాయకులతో విజయసాయిరెడ్డి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి నియోజకవర్గాల వారీ జనసమీకరణకు టార్గెట్‌ విధించారు. బుధవారం వెలిగొండ ప్రాజెక్టు వద్ద సభ ఏర్పాటు చేస్తే తిరిగి ఆప్రాంతం నుంచి ‘సిద్ధం’కు జనసమీకరణ కష్టమవుతుందని భావించి అక్కడ సభను రద్దు చేసుకున్నారు. సీఎం కూడా ఈ విషయాన్ని నాయకులకు గుర్తు చేస్తూ సిద్ధం సభకు రెడీ కావాలని స్పష్టం చేసి వెళ్లారు. దీంతో రంగంలోకి దిగిన వైసీపీ అభ్యర్థులకు ప్రజలనుంచే కాక పార్టీ శ్రేణుల నుంచి సమస్యలు ఎదురయ్యాయి. మీరు వాహనాలు పంపగానే మేము జనాన్ని తరలించేందుకు సిద్ధంగా లేమంటూ కిందిస్థాయి నాయకులు అనేకచోట్ల తేల్చిచెప్పారు. దీంతో ఆగమేఘాలపై లోక్‌సభ స్థాయి అభ్యర్థి, ఇతర నాయకులు జోక్యం చేసుకొని మీరేమైనా చేయండి భారీగా జనసమీకరణ జరగాల్సిందేనంటూ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థులకు హుకుం జారీ చేశారు. అయినప్పటికీ.. ఇటు పార్టీ నాయకులను, అటు శ్రేణులను కదిలించేందుకు ఇప్పటి నుంచే మేమెక్కడ ఖర్చు పెట్టాలంటూ కొందరు అభ్యర్థులు వెనకడుగు వేసినట్లు తెలిసింది. దీంతో ఒంగోలు లోక్‌సభ పరిధిలో ఎక్కువ నియోజకవర్గాలకు ఎంపీ అభ్యర్థి ద్వారా రూ.కోటి నుంచి రూ.నాలుగు కోట్ల వరకు పంపినట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలో ఇలా డబ్బులు అందిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో సభకు రెడీ కావాలంటూ తాయిలాల పంపిణీ ప్రారంభించారు. నిధులు అందని చోట వాహనాలు వస్తాయి సిద్ధం కావాలంటూ ఖర్చులకు డబ్బులు ఇస్తామని మాత్రం చెబుతున్నారు. ఏదిఏమైనా వైసీపీ సభకు వెళ్లేందుకు పార్టీ శ్రేణులే సుముఖంగా లేరని తేలిపోయింది.

మాకు సరే.. వచ్చే వారికి ఏంటి?

వైసీపీలోని కిందిస్థాయి నాయకులకు డబ్బులు ఇస్తూ భారీగా బస్సులు, ఇతర వాహనాలు పంపుతాము జనాన్ని తీసుకురావాలని వైసీపీ అభ్యర్థులు చెబుతున్నారు. అయితే నాయకులు మాత్రం వాహనం పెట్టగానే జనం ఎక్కే పరిస్థితి లేదని, సభకు వచ్చే వారి విషయం ఏంటని ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. ఆయా ప్రాంతాల వారీ రోజువారీ వ్యవసాయ, ఇతర పనులకు దినసరి కూలీకి వెళ్లే వారికి కూలిస్థాయిలో డబ్బులు ఇస్తేనే వాహనం ఎక్కే పరిస్థితి ఉందని కిందిస్థాయి నాయకులు చెబుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయా ప్రాంతాలను బట్టి సభకు వచ్చే వారికి ఒక్కొక్కరికి రూ.300 నుంచి రూ.600 వరకు చెల్లించేందుకు కూడా డబ్బు లు సమకూర్చుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనికితోడు వాహనాల్లో ఎక్కే వారికి పలావు పొట్లాలు, అవసరమైన వారికి క్వార్టర్‌ లిక్కర్‌ బాటిల్‌ కూడా ఏర్పాటు చేస్తామని చెబుతున్నట్లు తెలిసింది. ప్రత్యేక వాహనాలను ఎక్కువ సంఖ్యలో వైసీపీ రాష్ట్ర నాయకత్వమే పంపుతోంది. అందుకు అనుగుణంగా రాష్ట్రంలోని ఇతక ప్రాంతాల నుంచి కూడా ఆర్టీసీ బస్సులు సమకూర్చుతున్నారు. ఎక్కడికక్కడ స్థానిక విద్యా సంస్థల బస్సులు, ఇతర ప్రైవేట్‌ వాహనాలను సమకూర్చుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. సిద్ధం సభ కూడా ఆదివారమే జరుగుతున్నందున విద్యా సంస్థల యాజమాన్యాలపై ఒత్తిడి పెంచి వాహనాలను ఏర్పాటు చేస్తున్నారు.

వలంటీర్లకు అదనపు తాయిలాలు

వలంటీర్లకు ఇప్పటికే ఇచ్చిన రూ.5 వేల నగదుతోపాటు సిద్ధం సభకు ప్రజలను తరలించాలంటూ మరికొన్ని బహుమతులు ఇవ్వడం ప్రారంభించారు. గురువారం మార్కాపురంలోని ఒక కళాశాలలో ఒక్కో వలంటీర్‌కు ఒక్కో రైస్‌కుక్కర్‌ ఇచ్చినట్లు సమాచారం. ఇలా డబ్బులు, గిఫ్టులు ఇచ్చే సమయంలో వారి వద్ద సెల్‌ఫోన్‌ లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం.

కౌన్సిలర్‌కు రూ.2లక్షలు

ముందుగా పట్టణ ప్రాంతాల్లోని కీలకమైన నాయకులను కదిలించేందుకు డబ్బుల పంపిణీని ప్రారంభించారు. ఇప్పటికే గిద్దలూరు, కనిగిరి నగర పంచాయతీలు, మార్కాపురం మున్సిపాలిటీలోని వైసీపీ కౌన్సిలర్లు, కౌన్సిలర్లు లేని వార్డుల్లో గతంలో పోటీ చేసి ఓడిపోయిన నాయకులకు డబ్బులు పంపారు. ఒక్కొక్కరికి రూ.2లక్షల చొప్పున అందజేసినట్లు తెలిసింది. మార్కాపురం నియోజకవర్గంలోని పొదిలిలో మాత్రం ఒక్కొక్కరికి రూ.లక్ష ఇచ్చినట్లు తెలుస్తోంది. దర్శిలోని కౌన్సిలర్లకు ముందుగానే ఖర్చుల కింద కొంత మొత్తం ముట్టజెప్పినట్లు సమాచారం. అద్దంకి, చీరాల కందుకూరులోనూ ఇదే తంతుకు రంగం సిద్ధమైంది. ఒంగోలులో గుట్టుచప్పుడు కాకుండా ఈ వ్యవహారం సాగించబోతున్నట్లు తెలిసింది. పూర్తిగా గ్రామీణ వాతావరణంతో ఉన్న కొండపి, పర్చూరు నియోజకవర్గాల్లో గ్రామాల వారీ ఎలా ముందుకు పోవాలన్న విషయంపై లెక్కలు వేస్తున్నారు.

పెద్ద సంఖ్యలో జనసమీకరణ టార్గెట్‌

సిద్ధం సభకు ఉమ్మడి ప్రకాశం, ఉమ్మడి గుంటూరు, ఉమ్మడి నెల్లూరు జిల్లాల నుంచి ఎక్కువ మంది ప్రజలను తరలించాలని వైసీపీ అధిష్ఠానం ఆదేశించినట్లు సమాచారం. మరీముఖ్యంగా ఉమ్మడి ప్రకాశం అందులోనూ అద్దంకి, చీరాల, పర్చూరు. ఒంగోలు, దర్శి, కొండపి ప్రాంతాల నుంచి ఎక్కువ జనసమీకరణ చేయాలని నేతలను ఆదేశించారు. దూరంగా ఉన్న ఇతర నియోజకవర్గాలకు కూడా పెద్దమొత్తంలో టార్గెట్‌ ఇచ్చారు. ఒంగోలు నియోజకవర్గంలో గ్రామానికి 10 బస్సులు పంపుతామని నాయకత్వం చెప్పడంతో జనసమీకరణ బాధ్యత చూసే కిందిస్థాయి నాయకులు బిత్తరపోతున్నారు. ఇదెలా సాధ్యమని వారు ప్రశ్నించినట్లు తెలిసింది. సంతనూతలపాడు నియోజకవర్గంలో అయితే కొన్ని గ్రామాల వారు మాకు ఒకట్రెండు వాహనాలు చాలంటూ ఎదురు తిరుగుతుండటంతో తాయిలాలు మరింతగా ఇస్తామంటూ వారిని మైమరపిస్తున్నట్లు తెలిసింది. అద్దంకిలో వైసీపీ అభ్యర్థి ముందుగానే డబ్బులతోపాటు వాహనాలు ఇస్తూ అందరికంటే మనమే ముందుండాలంటూ.. ఏవిషయంలోనూ వెనక్కు తగ్గకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. ఇన్ని రకాల వ్యవహారాలు సాగిస్తున్నప్పటికీ అధిష్ఠానం ఇచ్చిన టార్గెట్‌కు అనుగుణంగా జనసమీకరణ జరిగే అవకాశాలు కనిపించడం లేదని వైసీపీలోని కిందిస్థాయి నాయకులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం.

Updated Date - Mar 08 , 2024 | 11:12 PM