Share News

వైసీపీ వార్డు మెంబర్‌ ఇంటి స్థలంలో ప్రహరీ కూల్చివేత

ABN , Publish Date - Jan 03 , 2024 | 11:12 PM

అతను వీఆర్‌ఏ.. పైపెచ్చు నిరుపేద.. అతని కుమారుడికి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అంటే ఇష్టం. ఆ అభిమానంతో వైసీపీ సానుభూతిపరుడిగా గ్రామ వార్డు మెంబరుకు పోటీచేసి ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. చివరకు ఆ నిరుపేద కుటుంబంపై అదే పార్టీ మండల స్థాయి వైసీపీ నాయకుడు కన్నెర్ర చేశాడు.

వైసీపీ వార్డు మెంబర్‌ ఇంటి స్థలంలో ప్రహరీ కూల్చివేత
ఎక్స్‌కవేటర్‌తో ప్రహరీ కూల్చివేత

అందులో పాలకేంద్రం నిర్మించాలని ఆ పార్టీ మండల నేత ప్లాన్‌

అడ్డుకున్న బాధితులు

అడ్డుచెప్పలేని రెవెన్యూ అధికారులు

పీసీపల్లి, జనవరి 3 : అతను వీఆర్‌ఏ.. పైపెచ్చు నిరుపేద.. అతని కుమారుడికి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అంటే ఇష్టం. ఆ అభిమానంతో వైసీపీ సానుభూతిపరుడిగా గ్రామ వార్డు మెంబరుకు పోటీచేసి ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. చివరకు ఆ నిరుపేద కుటుంబంపై అదే పార్టీ మండల స్థాయి వైసీపీ నాయకుడు కన్నెర్ర చేశాడు. వివరాల్లోకి వెళితే... మండలంలోని కమ్మవారిపల్లికి చెందిన షేక్‌ మౌలాలి రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో గ్రామసేవకుడు. ఆయన భార్య షేక్‌ రహంతుబీ పేరున పీసీపల్లిలో 1997లో సర్వేనెంబరు 820లో ప్లాట్‌నెంబరు 119లో 2సెంట్ల నివేశన స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. అప్పటి అధికారులు పట్టా కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఆ స్థలానికి ఆనుకుని రైతుభరోసా కేంద్రం, గ్రామ సచివాలయ భవనాలున్నాయి. ఆ పక్కనే మరికొంత ప్రభుత్వ ఖాళీస్థలం ఉంది. ప్రభు త్వం కేటాయించిన స్థలంలో మౌలాలి తనయుడు దస్తగిరి షెడ్‌ నిర్మించుకుని విద్యుత్‌ కనెక్షన్‌ తీసుకుని నివాసం ఉంటున్నాడు. ఆ స్థలంపై మండల స్థాయి వైసీపీ నాయకుడు కన్నేశాడు. అందులో పాలకేంద్రాన్ని నిర్మించాలనే సాకుతో అధికారులపై ఒత్తిడి తెచ్చాడు. రెవెన్యూ అధికారులు దస్తగిరిని పిలిపించి స్థలాన్ని ఖాళీచేయాలం టూ మౌఖికంగా ఆదేశించారు. తమ కుటుంబానికి ప్రభుత్వం పట్టా మంజూరు చేసిందని అతను చెప్పాడు. ప్రభుత్వ భవనాల నిర్మాణం కోసం అవసరం మేరకు మీ పట్టాను రద్దుచేసి పాలకేంద్రం నిర్మించుకునేందుకు స్థలాన్ని కేటాయించామంటూ రెవెన్యూ అధికారులు చెప్పారని బాధితుడు చెప్పాడు. రాత పూర్వకంగా నోటీసు ఇవ్వాలని కోరినా అధికారులు స్పందించలేదని వాపోయాడు. తమకు నోటీసు లు ఇవ్వకుండా ప్రత్యామ్నాయంగా స్థలం కేటాయించకుండా పట్టాను ఎలా రద్దుచేస్తారని బాధితుడు ప్రశ్నించినా ఆలకించే వారే లేరు. ఇదిలా ఉండగా, బుధవారం వైసీపీ నాయకుడు ఎక్స్‌కవేటర్‌ను తీసుకొచ్చి ఆ స్థలంలో ఉన్న ప్రహరీని పడగొట్టి ఇంటిని కూల్చేందుకు య త్నించాడు. మౌలాలి కుటుంబ సభ్యులు అడ్డుకోవడంతో తాత్కాలికం గా నిలిపివేశాడు. ఈ విషయమై తహసీల్దార్‌ ప్రవీణ్‌కుమార్‌ వివరణ కోసం పలుమార్లు ఫోన్‌లో సంప్రదించినా అందుబాటులోకి రాలేదు.

Updated Date - Jan 03 , 2024 | 11:12 PM