Share News

ప్రాణం తీసిన గుంతలు

ABN , Publish Date - May 22 , 2024 | 10:12 PM

తారు రోడ్లు పల్లెల్లో ఉన్న డొంక రోడ్లు కన్నా దారుణంగా తయారయ్యాయి. నిగ నిగ లాడే తారు రోడ్లు గుంతలు పడి రెండేళ్లయినా పట్టించుకోని ప్రభుత్వ వైఖరికి, అధికారుల నిర్లక్ష్యానికి ప్రభుత్వ ఉపాధ్యాయుడు నిండు ప్రాణం బలైంది. ఈ సంఘటన యద్దనపూడి మండలంలో బుధవారం ఉదయం జరిగింది. యద్దనపూడి నుంచి పర్చూరు వెళ్లే రోడ్డులో యద్దనపూడి గ్రామ శివార్లో ఈ ఘటన చోటుచేసుకుంది.

ప్రాణం తీసిన గుంతలు
వినోద్‌ కుమార్‌ మృతదేహాన్ని పరిశీలిస్తున్న ఎస్‌ఐ

బైకు పైనుంచి పడి ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి

యద్దనపూడి పర్చూరు రోడ్డులో ఘటన

యద్దనపూడి, (మార్టూరు) మే 22 : తారు రోడ్లు పల్లెల్లో ఉన్న డొంక రోడ్లు కన్నా దారుణంగా తయారయ్యాయి. నిగ నిగ లాడే తారు రోడ్లు గుంతలు పడి రెండేళ్లయినా పట్టించుకోని ప్రభుత్వ వైఖరికి, అధికారుల నిర్లక్ష్యానికి ప్రభుత్వ ఉపాధ్యాయుడు నిండు ప్రాణం బలైంది. ఈ సంఘటన యద్దనపూడి మండలంలో బుధవారం ఉదయం జరిగింది. యద్దనపూడి నుంచి పర్చూరు వెళ్లే రోడ్డులో యద్దనపూడి గ్రామ శివార్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మండలంలోని పోలూరు గ్రామానికి చెందిన ఎస్సీ కాలనీకి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు తాళ్లూరి వినోద్‌ కుమార్‌ (37) మృతి చెందారు. అతను ఉమ్మడి ప్రకాశం దర్శి నియోజకవర్గం కురిచేడు మండలం అలవలపాడు గ్రామంలో ఎంపీపీ ప్రాథమిక పాఠశాలలో సెకెండరీ గ్రేడ్‌ టీచర్‌గా పనిచేస్తున్నారు. కుమార్‌కు భార్య స్వప్న, ఇద్దరు కుమారులు ఉన్నారు.

ప్రమాదం జరిగిందిలా

పోలూరు గ్రామానికి చెందిన వినోద్‌ కుమార్‌ ఉద్యోగరీత్యా పెద దర్శిలో నివాసం ఉంటున్నారు. అతను ఎన్నికలు నిమిత్తం పోలూరు గ్రామానికి ఓటు వేయడానికి తన ఇద్దరు కుమారులతో వచ్చారు. అనంతరం సెలవులు కావడంతో అడపాదడపా పెద దర్శి వెళ్లి వస్తున్నారు. అందులో భాగంగా బుధవారం ఉదయం పెద దర్శి నుంచి ద్విచక్రవాహనంపై పోలూరు గ్రామానికి వస్తున్నారు. గత కొంత కాలంగా యద్దనపూడి నుంచి పర్చూరు వరకు ఉన్న తారు రోడ్డు చాలా చోట్ల గుంతలు పడి పూర్తిగా దెబ్బతిన్నది. ఈ విషయాన్ని వినోద్‌ కుమార్‌ గమనించలేదో ఏమోగానీ యద్దనపూడి గ్రామ పొలిమేర దాటిన తర్వాత పర్చూరు రోడ్డులో గుంతలలో అదుపు చేయలేక బైక్‌తో సహా రోడ్డుపై పడి పోయాడు. దాంతో వెంటనే అతని తల వెనుక భాగాన బలమైన దెబ్బ తగలడంతో విపరీతంగా రక్తస్రావం అయింది. దీంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఈ విషయాన్ని అటుగా వెళ్తున్న కొంత మంది ద్విచక్రవాహనదారులు గమనించి పర్చూరు 108కి సమాచారం ఇచ్చారు. అంతేగాకుండా ఈ ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి 5 కి.మీ. దూరంలో ఉన్న పోలూరు గ్రామం నుంచి బంధువులు సంఘటనా స్థలానికి వచ్చారు. ఈ ప్రమాదంపై సమాచారం అందడంతో ఎస్‌ఐ జీవీఎస్‌ చౌదరి సిబ్బందితో వచ్చారు. అయితే అప్పటికే అతను చనిపోవడంతో మృతదేహాన్ని పోస్టు మార్టమ్‌ నిమిత్తం మార్టూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వినోద్‌ సోదరుడు సామ్యేలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహానికి పోస్టు మార్టమ్‌ చేయించగా సాయంత్రం బంధువులు మృతదేహాన్ని పోలూరు గ్రామానికి తీసుకు వెళ్లారు.

ఘటనపై స్పందించిన ఎస్‌ఐ

రోడ్లపై భారీగా గుంతలు ఉండడంతో ఉపాధ్యాయుడు మృతి చెందడం, కుటుంబ యజమానికి కోల్పోవడంపై ఎస్‌ఐ జీవీఎస్‌ చౌదరి ఆవేదనకు గురయ్యారు. వెంటనే స్పందించారు. మరోసారి ఈ రోడ్డుపై ఘటన జరుగకుండా ఉండేలా మార్టూరు మండలంలోని కోలలపూడి, వలపర్ల గ్రావెల్‌ క్వారీల నుంచి టిప్పర్లతో గ్రావెల్‌ను తెప్పించి గుంతలను పూడ్చివేయించారు. కిలో మీటర్‌కు పైగా గుంతల్లో మట్టిని పోసి చదును చేయించారు.

Updated Date - May 22 , 2024 | 10:12 PM